Delhi HC : అభిషేక్ బచ్చన్-ఐశ్వర్య రాయ్ దంపతుల కుమార్తె ఆరోగ్యంపై దుష్ప్రచారం.. గూగుల్ ఎల్ఎల్సీకి హైకోర్టు సమన్లు..
ABN , First Publish Date - 2023-04-20T12:23:19+05:30 IST
ప్రముఖ బాలీవుడ్ నటులు ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ (Aishwarya Rai and Abhishek Bachchan) దంపతుల కుమార్తె ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యం
న్యూఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్ నటులు ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ (Aishwarya Rai and Abhishek Bachchan) దంపతుల కుమార్తె ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం జరుగుతుండటంతో గూగుల్ ఎల్ఎల్సీకి, మరికొన్ని సంస్థలకు ఢిల్లీ హైకోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. వారధిగా వ్యవహరించే వేదికలు చట్టాన్ని కచ్చితంగా పాటించేలా చేయవలసిన కర్తవ్యం గూగుల్ ఎల్ఎల్సీకి ఉందని తెలిపింది. ఐటీ రూల్స్, 2021 సహా వర్తించే చట్టాలన్నిటినీ కచ్చితంగా పాటించేలా చేయాలని తెలిపింది. ఆరాధ్య ఆరోగ్యంపై కొన్ని యూట్యూబ్ చానళ్లలో దుష్ప్రచారం జరుగుతోందని, దీనిని అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఈ చర్య తీసుకుంది.
ఓ యూట్యూబ్ టాబ్లాయిడ్ సహా దాదాపు 10 సంస్థలపై ఆరాధ్య బచ్చన్ (Aaradhya Bachchan) ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఆమె వయసు 11 సంవత్సరాలు. తన ఆరోగ్యం విషయంలో ఈ సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని కోర్టుకు తెలిపింది. తాను మైనర్‌నని, తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ మీడియా రిపోర్టింగ్‌పై ఇంజంక్షన్ మంజూరు చేయాలని కోరింది. తనపై రూపొందించిన అన్ని వీడియోలను డీ-లిస్ట్, డీయాక్టివేట్ చేయాలని కోరింది. గూగుల్ ఎల్ఎల్సీ, కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (గ్రీవియెన్స్ సెల్)లను కూడా పార్టీలుగా చేర్చింది. దీనిపై గురువారం విచారణ జరిగింది.
సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ నటి జయ బచ్చన్ మనుమరాలు అయిన ఆరాధ్య పుట్టినప్పటి నుంచి అందరి దృష్టిలోనూ సెలబ్రిటీ హోదాను అనుభవిస్తోంది. ప్రజలు ఆమె గురించి ఆసక్తిగా తెలుసుకుంటూ ఉంటారు. దీంతో ఆమోదయోగ్యంకాని వ్యాఖ్యల బారిన ఆమె తరచూ పడుతోంది. ఆమెను టార్గెట్ చేసిన ట్రోల్స్‌పై అభిషేక్ బచ్చన్ 2021లో తీవ్రంగా విరుచుకుపడ్డారు. తన కుమార్తెను ట్రోల్ చేయడం ఆమోదయోగ్యం కాదని, దీనిని తాను ఎంత మాత్రం సహించలేనని చెప్పారు. తాను పబ్లిక్ ఫిగర్ననడం మంచిదేనని, తన కుమార్తెకు అటువంటి పరిమితులేవీ లేవని అన్నారు. ఏదైనా చెప్పాలని ఎవరైనా అనుకుంటే, స్వయంగా తన దగ్గరకు వచ్చి చెప్పాలన్నారు.
ఆరాధ్య తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు మాట్లాడుతూ, బచ్చన్ కుటుంబ సభ్యుల కీర్తి, ప్రతిష్ఠల నుంచి చట్టవిరుద్ధంగా లబ్ధి పొందడం కోసమే ఇటువంటి దుష్రపచారం చేస్తున్నారని చెప్పారు. ఈ ప్రచారం వల్ల బచ్చన్‌లకు జరుగుతున్న నష్టాన్ని పట్టించుకోవడం లేదన్నారు.
ఆరాధ్య తన తల్లి ఐశ్వర్య రాయ్‌తో వ్యవహరించే తీరు గురించి సామాజిక మాధ్యమాల్లో తరచూ చర్చ జరుగుతోంది. ఆమె హెయిర్ స్టైల్ దగ్గర నుంచి ఆమె తన తల్లి చేతిని పట్టుకునే తీరు వరకు అన్నిటినీ చర్చిస్తున్నారు.
ఐశ్వర్య, అభిషేక్ వివాహం 2007లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఆరాధ్య 2011లో జన్మించింది. ఆరాధ్య ప్రస్తుతం ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతోంది. ఆమె తన తల్లిదండ్రులతో కలిసి హై ప్రొఫైల్ ఈవెంట్లలో పాల్గొంటూ ఉంటుంది. ఆ సమయంలో ఆమెను వీడియోలు, ఫొటోలలో చిత్రీకరిస్తూ ఉంటారు. ఇటీవలే ఆరాధ్య ముంబైలోని నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్లో విశిష్ట ప్రముఖులు పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొంది.
ఇవి కూడా చదవండి :
Jammu and Kashmir : మోదీకి బాలిక లేఖతో సత్ఫలితాలు.. పాఠశాల అభివృద్ధి ప్రారంభం..
Rahul Gandhi : పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ అపీలు తిరస్కరణ