Karnprayag: నిన్న జోషిమఠ్‌..నేడు కర్ణప్రయాగ్‌

ABN , First Publish Date - 2023-01-10T15:56:46+05:30 IST

భూమి కుంగిపోతుండటం, ఇళ్లు, హోటళ్లు, రోడ్లు పగుళ్లు తీస్తుండటంతో ఉత్తరాఖండ్ వణుకుతోంది. ఓవైపు జోషిమఠ్ పట్టణంలో పగుళ్లు..

Karnprayag: నిన్న జోషిమఠ్‌..నేడు కర్ణప్రయాగ్‌

చమోలి: భూమి కుంగిపోతుండటం, ఇళ్లు, హోటళ్లు, రోడ్లు పగుళ్లు తీస్తుండటంతో ఉత్తరాఖండ్ (Uttarakhand) వణుకుతోంది. ఓవైపు జోషిమఠ్ (Joshimath) పట్టణంలో పగుళ్లు ఏర్పడిన ఇళ్లు, హోటళ్ల కూల్చివేత పనులు వేగంగా జరుగుతుండగా, తాజాగా చమోలి జిల్లా కర్నప్రయాగ్ (Karnprayag)లోని బహుగుణ నగర్‌లో సుమారు 50 ఏళ్ల బీటలు వారాయి. దీంతో స్థానికులు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వం తక్షణం సహాయం చేయాలని వారు కోరుతున్నారు. బహుగుణ నగర్‌లోని పలు కుటుంబాలు ఇప్పటికే తమ ఇళ్లు వదిలి ఇతర ప్రాంతాల్లో ఉంటున్న తమ బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు. కర్నప్రయాగ్ అప్పర్ బజార్ వార్డులోని 30 కుటుంబాల వారు ఈ ప్రకృతి వైపరీత్యంతో వణికిపోతున్నారు. ప్రభుత్వ సాయం కోసం విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, జోషిమఠ్ ఏరియాలో పరిస్థితిపై చమేలీలోని డిజాస్టర్ మేనిజిమెంట్ అథారిటీ మంగళవారంనాడు ఒక బులిటెన్ విడుదల చేసింది. 678 ఇళ్లకు పగుళ్లు వచ్చినట్టు గుర్తించామని, భద్రతా కారణాల రీత్యా 81 కుటుంబాలను తాత్కాలికంగా తరలించామని ఆ బులిటెన్ తెలిపింది. బాధిత కుటుంబాలకు ఆహార కిట్లు, దుప్పట్లు, ఇతర అత్యవసర సామగ్రితో పాటు, కుటుంబానికి రూ.5,000 చొప్పున జిల్లా యంత్రాగం సాయం అందిస్తోంది. బాధిత ప్రాంతాలను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. భద్రత, రెస్క్యూ ఆపరేషన్ల కోసం అదనంగా రూ.11 కోట్లు విడుదల చేశారు.

Updated Date - 2023-01-10T16:01:14+05:30 IST