Amritpal: అమిత్ షాకూ ఇందిర గతే
ABN , First Publish Date - 2023-02-27T01:24:12+05:30 IST
ఖలిస్థాన్ ఉద్యమాన్ని అణచివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో చేసిన వ్యాఖ్యలపై ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్‌పాల్ ఆదివారం మరోసారి తీవ్రంగా స్పందించారు.
ఖలిస్థాన్ ఉద్యమాన్ని అణచివేస్తామన్న
కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై అమృత్‌పాల్
హిందూస్థాన్‌తో ఖలిస్థాన్‌కు పోలిక
అసలైన హింస ముందుందని వ్యాఖ్య
ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వెల్లడి
వేర్పాటువాదులకు పాక్ నిధులు: మాన్
భావ్‌నగర్, ఫిబ్రవరి 26: ఖలిస్థాన్ ఉద్యమాన్ని అణచివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో చేసిన వ్యాఖ్యలపై ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్‌పాల్ ఆదివారం మరోసారి తీవ్రంగా స్పందించారు. ‘‘అమిత్ షాకు కూడా ఇందిరాగాంధీ గతే పడుతుంది’’ అని హెచ్చరించారు. 1984లో ఆపరేషన్ బ్లూస్టార్ తర్వాత ఇందిర సిక్కుల చేతిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, పంజాబ్‌లోని అజ్నాలా పోలీస్ స్టేషన్లో జరిగింది అసలు హింసే కాదని అమృత్‌పాల్ అన్నారు. అసలు హింస ముందుందని, ఖలిస్థాన్‌కు మద్దతుగా నిరసనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఖలిస్థాన్ ఉద్యమాన్ని హిందూస్థాన్ నినాదంతో పోల్చారు. ‘‘ఖలిస్థాన్ జిందాబాద్ అంటే తప్పు అయినప్పుడు హిందూస్థాన్ జిందాబాద్ అంటే ఎందుకు తప్పు కాదు. హిందూస్థాన్ అంటే ఏంటి.. అది ఎక్కడ ఉంది’’ అని ప్రశ్నించారు. ‘‘ఖలిస్థాన్ ఉద్యమాన్ని అణచివేస్తామన్న అమిత్ షా.. హిందూస్థాన్ నినాదంపై కూడా అలా మాట్లాడగలరా.. మాట్లాడి హోంమంత్రిగా ఉండగలరా’’ అని నిలదీశారు. తనను తాను భారతీయుడిగా భావించుకోవట్లేదని అమృత్‌పాల్ ఈ సందర్భంగా చెప్పారు. కాగా, ఖలిస్థాన్ వేర్పాటువాదులకు పాకిస్థాన్, ఇతర దేశాల నుంచి నిధులు అందుతున్నాయని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. కేవలం కొద్ది మంది సిక్కులు ఖలిస్థాన్‌కు మద్దతుగా నినాదాలు చేస్తున్నంత మాత్రాన పంజాబ్ మొత్తం ఆ ఉద్యమానికి అనుకూలంగా ఉన్నట్లు కాదని వ్యాఖ్యానించారు.
పాక్ నుంచి చైనా డ్రోన్.. అమృత్‌సర్‌లో కూల్చివేత
చండీగఢ్: పాకిస్థాన్ నుంచి ఆదివారం తెల్లవారుజామున మరో డ్రోన్ భారత్‌లోకి చొరబడింది. అమృత్‌సర్‌కు సమీప గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో విధుల్లో ఉన్న బీఎ్‌సఎఫ్ జవాన్లు డ్రోన్ శబ్దం విని అప్రమత్తమయ్యారు. భారత భూభాగంలోకి డ్రోన్ రాగానే కాల్పులు జరిపారు. సమీపంలో పరిశీలించగా చైనా తయారీ డ్రోన్ కనిపించింది. దీని ద్వారా ఏం రవాణా చేశారో తెలుసుకొనేందుకు ఆ ప్రాంతంలో గాలిస్తున్నారు.