Share News

Palestinian prisoners : ఇజ్రాయెల్‌ జైళ్లలో అరాచకాలు?

ABN , First Publish Date - 2023-11-29T05:15:42+05:30 IST

హమాస్‌ దాడి తర్వాత.. ఇజ్రాయెల్‌లోని జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలు టార్గెట్‌గా మారారా? వారి పట్ల అధికారులు దురుసుగా వ్యవహరించారా? బందీలు-ఖైదీల మార్పిడిలో

Palestinian prisoners : ఇజ్రాయెల్‌ జైళ్లలో అరాచకాలు?

పాలస్తీనా ఖైదీలకు ఐసోలేషన్‌ సెల్స్‌

నీళ్లు, కరెంటు అందించకుండా హింస!

హమాస్‌ను తుదముట్టించాల్సిందే: మస్క్‌

హమాస్‌ దాడి తర్వాత.. ఇజ్రాయెల్‌లోని జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలు టార్గెట్‌గా మారారా? వారి పట్ల అధికారులు దురుసుగా వ్యవహరించారా? బందీలు-ఖైదీల మార్పిడిలో భాగంగా ఇటీవల విడుదలైన పాలస్తీనీయులు కొందరు పాశ్చాత్య మీడియాతో తాము ఎదుర్కొన్న పరిస్థితులను వివరించారు. ఇజ్రాయెల్‌ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీల్లో.. చాలా మంది ఎలాంటి నేరాలు చేయకుండానే నిర్బంధంలో ఉన్నారని పేర్కొన్నారు. అక్టోబరు 7న హమాస్‌ దాడి తర్వాత.. ఇజ్రాయెల్‌ జైళ్లలోని పాలస్తీనా ఖైదీల పరిస్థితి అధ్వానంగా మారిందని తెలిపారు. ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి జరిగిన వెంటనే.. జైళ్లలోని పాలస్తీనా ఖైదీలను ఐసోలేటెడ్‌ సెల్స్‌(ఇతర ఖైదీలతో కలవకుండా, వేరుగా ఉండే సెల్స్‌)కు తరలించినట్లు ఇస్రా జాబిస్‌ అనే మహిళా ఖైదీ బ్రిటన్‌కు చెందిన ‘స్కైన్యూ్‌స’కు వెల్లడించారు. ఇజ్రాయెల్‌ పోలీసు అధికారిని తుపాకీతో కాల్చిన కేసులో ఆమె నిందితురాలు. 2015 నుంచి ఆమె ఇజ్రాయెల్‌ జైలులో ఉండగా.. తాజాగా బందీలు-ఖైదీల మార్పిడిలో భాగంగా విడుదలయ్యారు. తనకు 11 ఏళ్ల శిక్షపడగా.. జైలుకు వెళ్లినప్పటి నుంచే అనేక అవమానాలను ఎదుర్కొన్నట్లు జాబిస్‌ వివరించారు. ‘‘హమాస్‌ దాడి తర్వాత.. ఇజ్రాయెల్‌లోని వేర్వేరు జైళ్లలో ఉన్న ఆరుగురు పాలస్తీనా ఖైదీలు అనుమానాస్పద స్థితిలో మరణించారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి జైళ్ల అధికారులు పాలస్తీనా ఖైదీలను కుక్కల్ని చూసినట్లు ప్రవర్తించేవారు. అవమానకరంగా మాట్లాడేవారు. దాడులకు పాల్పడేవారు’’ అని మరో ఖైదీ వివరించారు.

బీచ్‌ క్యాంప్‌లో ఇజ్రాయెల్‌ షెల్లింగ్‌

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉండగా.. మరోమారు కాల్పుల కలకలం రేగింది. ఉత్తర గాజాలోని బీచ్‌క్యాం్‌పలో కాల్పులు జరిగాయంటూ అల్‌-హర్రా న్యూస్‌చానల్‌ పలు వీడియోలను ప్రసారం చేసింది. మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో బీచ్‌ క్యాంప్‌తోపాటు.. షేక్‌ రద్వార్‌ ప్రాంతంలో ఐడీఎఫ్‌ షెల్లింగ్‌కు పాల్పడినట్లు తెలిపింది. అటు హమాస్‌ వర్గాలు కూడా తమ అధికారిక టెలిగ్రామ్‌ చానల్‌ ‘అల్‌-ఖాసమ్‌, అల్‌-కుద్స్‌’లో ఈ ఘటనను నిర్ధారించాయి. తాము కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని, ఇజ్రాయెల్‌ ఉల్లంఘనలపై మధ్యవర్తులతో చర్చిస్తున్నామని వివరించింది. దిగ్గజ మైక్రోబ్లాగింగ్‌ సంస్థ ఎక్స్‌ చీఫ్‌ ఈలాన్‌ మస్క్‌ కూడా హమా్‌సను కూకటివేళ్లతో సహా పెకిళించాలని ఆకాంక్షించారు. మరోవైపు.. ఫ్రంట్‌లైన్‌ సైనికులతో కలిసి యుద్ధంలో పాల్గొంటున్న తమ కుమారుడిని ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు హెర్జోగ్‌, ఆయన భార్య మంగళవారం గాజా సరిహద్దులో కలుసుకుని, క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు.

- సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2023-11-29T05:15:43+05:30 IST