Hindu Temple : హిందూ దేవాలయంపై భారత్ వ్యతిరేక నినాదాలు

ABN , First Publish Date - 2023-01-12T19:42:12+05:30 IST

ఈ దేవాలయం అధికారులు ఇచ్చిన ట్వీట్‌లో, ఈ విద్వేషం, విధ్వంసాల పట్ల దిగ్భ్రాంతికి గురయ్యామని, తీవ్రంగా విచారిస్తున్నామని తెలిపారు.

Hindu Temple : హిందూ దేవాలయంపై భారత్ వ్యతిరేక నినాదాలు
BAPS Swaminarayan Mandir

న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్న బీఏపీఎస్ స్వామినారాయణ్ మందిర్ (BAPS Swaminarayan Mandir)ను ఖలిస్థాన్ మద్దతుదారులు (Khalistan supporters) అపవిత్రం చేశారు. ఈ దేవాలయంపై దాడి చేసి, గోడలపై భారత వ్యతిరేక నినాదాలను రాశారు. ‘‘హిందుస్థాన్ ముర్దాబాద్’’ అని రాశారు. ఈ వివరాలను ఆస్ట్రేలియన్ మీడియా గురువారం వెల్లడించింది.

ఆస్ట్రేలియన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, మెల్‌బోర్న్ శివారు ప్రాంతం మిల్ పార్క్‌లో స్వామినారాయణ్ దేవాలయం ఉంది. ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఖలిస్థాన్ మద్దతుదారులు దీనిపై దాడి చేసి, ‘‘హిందుస్థాన్ ముర్దాబాద్’’ అని రాశారు.

ఈ దేవాలయం అధికారులు ఇచ్చిన ట్వీట్‌లో, ఈ విద్వేషం, విధ్వంసాల పట్ల దిగ్భ్రాంతికి గురయ్యామని, తీవ్రంగా విచారిస్తున్నామని తెలిపారు. శాంతి, సామరస్యాల కోసం తాము పూజలు, ప్రార్థనలు చేస్తామని తెలిపారు.

నార్తర్న్ మెట్రోపాలిటన్ రీజియన్ లిబరల్ ఎంపీ ఎవాన్ ముల్హోల్లండ్ మీడియాతో మాట్లాడుతూ, విక్టోరియాలోని శాంతియుత హిందువులకు ఈ విధ్వంసం తీవ్ర ఆందోళనకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా ఈ పవిత్ర సమయంలో ఈ విధ్వంసం చాలా బాధాకరమని తెలిపారు.

మెల్‌బోర్న్ హిందూ కమ్యూనిటీ ఈ సంఘటనపై స్థానిక పోలీసులకు, ఎంపీలకు ఫిర్యాదు చేసింది. సాంస్కృతిక శాఖ మంత్రి కూడా ఈ దేవాలయం ఉన్న ప్రాంతానికి చెందినవారే. గత ఏడాది నుంచి ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ దేవాలయం గోడలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు రాశారని చెప్పారు. తాజా సంఘటనను కేరళ హిందూ సంఘం ఖండించింది.

ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్ హిందూ కౌన్సిల్ అధ్యక్షుడు మకరంద్ భగవత్ మాట్లాడుతూ, ప్రార్థన స్థలాలు, దేవాలయాల పట్ల విద్వేషం, విధ్వంసాలు ఆమోదయోగ్యం కాదని, తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇటువంటి చర్యలు విక్టోరియాలోని జాతి, మత సహన చట్టానికి విరుద్ధమని తెలిపారు. ఈ దారుణానికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విక్టోరియా పోలీసులను, ప్రీమియర్ డాన్ ఆండ్రూస్‌ను కోరారు. ఆస్ట్రేలియా విశ్వహిందూ పరిషత్ కూడా ఈ చర్యలను తీవ్రంగా ఖండించింది.

ఖలిస్థాన్ ఉగ్రవాది జర్నయిల్ సింగ్ భింద్రన్‌వాలేని ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థ ప్రశంసించినట్లు ఆస్ట్రేలియన్ మీడియా వెల్లడించింది. ‘ఆపరేషన్ బ్లూస్టార్’లో ఆయనను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. సిక్కులకు ప్రత్యేక దేశం కావాలనేది ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థ డిమాండ్.

ఇదిలావుండగా, కెనడాలోని బీఏపీఎస్ స్వామినారాయణ్ మందిరాన్ని కూడా గత ఏడాది సెప్టెంబరులో అపవిత్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ దేవాలయం గోడలపై కూడా భారత వ్యతిరేక నినాదాలు రాశారు.

Updated Date - 2023-01-12T19:42:17+05:30 IST