Odisha Train Crash: ఒడిశా రైలు దుర్ఘటనపై షాకింగ్ నిజాలు బయటపెట్టిన సీబీఐ.. ఆ తప్పు వల్లే ఈ ఘోరం..

ABN , First Publish Date - 2023-08-25T20:39:53+05:30 IST

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఒడిశా రైలు దుర్ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ షాకింగ్ నిజాలు బయటపెట్టింది. అనుమతులు లేని మరమ్మతులు చేపట్టడం వల్లే...

Odisha Train Crash: ఒడిశా రైలు దుర్ఘటనపై షాకింగ్ నిజాలు బయటపెట్టిన సీబీఐ.. ఆ తప్పు వల్లే ఈ ఘోరం..

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఒడిశా రైలు దుర్ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ షాకింగ్ నిజాలు బయటపెట్టింది. అనుమతులు లేని మరమ్మతులు చేపట్టడం వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని వెల్లడించింది. ఉన్నతాధికారుల నుంచి అనుమతులు గానీ, సర్క్యూట్ చిత్రం గానీ తీసుకోకుండానే.. సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ అరుణ్‌ కుమార్‌ మహంత క్షేత్ర స్థాయిలో మరమ్మతులు చేయించారని ప్రత్యేక న్యాయస్థానానికి సీబీఐ వివరించింది. మహంత సమక్షంలోనే బహానగా బజార్‌ స్టేషన్‌ సమీపంలో ప్రమాదం జరిగిన 94వ క్రాసింగ్‌ లెవెల్‌ గేట్‌ వద్ద మరమ్మతు పనులు జరిగాయని.. గేట్‌ నెంబరు 79 వద్ద మరమ్మతులకు ఉపయోగించిన సర్క్యూట్‌ చిత్రం ఆధారంగానే ఇక్కడ మరమ్మత్తులు చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని సీబీఐ పేర్కొంది. ఈ పనులు జరుగుతున్నప్పుడు మహంత అక్కడే ఉన్నారని నొక్కి వక్కాణించింది.


కాగా.. ఈ కేసులో సీబీఐ ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ ముగ్గురిలో ఒకరైన అరుణ్ కుమార్ మహంత.. తనకు బెయిల్ మంజూరు చేయాలని భువనేశ్వర్‌లోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరగ్గా.. పైన వివరాల్ని సీబీఐ కోర్టుకు వివరించింది. ఆయనకు ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ మంజూరు చేయొద్దని తీవ్రంగా వ్యతిరేకించింది. మరోవైపు.. మహంత తరఫు న్యాయవాదులు మాత్రం మహంతకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ప్రమాదానికి కారణంగా భావిస్తున్న ‘లెవెల్‌ క్రాసింగ్‌ గేట్‌’ కొంతకాలం నుంచి సరిగ్గా పని చేయడం లేదని.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. అంతేకాదు.. పర్యవేక్షణ పనిని సైతం వేరే వ్యక్తులకు అప్పగించడం జరిగిందని.. కాబట్టి ఆ రైలు దుర్ఘటనకు మహంత బాధ్యుడు కాదని.. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని వాదనలు వినిపించారు.

ఇలా.. సీబీఐ, మహంత తరఫు న్యాయవాదులు వాదనల్ని విన్న అనంతరం న్యాయస్థానం మహంతకు బెయిల్‌ నిరాకరించింది. సిగ్నల్‌, ఇంటర్‌లాకింగ్‌ ఇన్‌స్టాలేషన్లను పరీక్షించడం.. వాటిని సరిదిద్దడం.. మార్పులు చేయడం వంటివి మహంత విధుల్లో భాగమేనని కోర్టు పేర్కొంది. ఉన్నతాధికారుల సూచనలకు అనుగుణంగా మహంత బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉండేదని.. అందులో విఫలం అవ్వడం వల్లే 296 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని చెప్పింది. ప్రస్తుతమున్న వివరాల ఆధారంగా.. ఈ ఘోర ప్రమాదానికి మహంతనే ప్రధాన కారకుడని కోర్టు భావిస్తోందని తెలుపుతూ.. బెయిల్‌ను తిరస్కరించింది.

Updated Date - 2023-08-25T20:39:53+05:30 IST