ChatGPT : మాతో పోటీ పడే సత్తా భారతీయ కంపెనీలకు లేదు : చాట్‌జీపీటీ సృష్టికర్త

ABN , First Publish Date - 2023-06-10T13:41:33+05:30 IST

సాంకేతిక పరిజ్ఞానంలో దూసుకుపోతున్న భారతీయ యువతను చాట్‌జీపీటీ సృష్టికర్త, ఓపెన్ఏఐ వ్యవస్థాపకుడు శాం ఆల్ట్‌మాన్రె చ్చగొట్టారు.

ChatGPT : మాతో పోటీ పడే సత్తా భారతీయ కంపెనీలకు లేదు : చాట్‌జీపీటీ సృష్టికర్త
Sam Altman, chief executive officer of OpenAI.

న్యూఢిల్లీ : సాంకేతిక పరిజ్ఞానంలో దూసుకుపోతున్న భారతీయ యువతను చాట్‌జీపీటీ సృష్టికర్త, ఓపెన్ఏఐ వ్యవస్థాపకుడు శాం ఆల్ట్‌మాన్ (Sam Altman) రెచ్చగొట్టారు. చాట్‌జీపీటీ (ChatGPT) వంటి టూల్‌ను సృష్టించడం భారతీయ కంపెనీలకు అసాధ్యమని వ్యాఖ్యానించారు. ‘ది ఎకనమిక్ టైమ్స్’ గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయనను అడిగిన ఓ ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలను భారతీయులు సవాల్‌గా స్వీకరించారు.

శాం ఆల్ట్‌మాన్ భారత దేశ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తో కూడా సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘ది ఎకనమిక్ టైమ్స్’ గురువారం నిర్వహించిన కార్యక్రమంలో గూగుల్ ఇండియా మాజీ హెడ్, ప్రస్తుతం వెంచర్ కేపిటలిస్ట్ రాజన్ ఆనందన్ మాట్లాడుతూ, ‘‘శాం గారూ, భారత దేశంలో చాలా శక్తిమంతమైన ఎకోసిస్టమ్ ఉంది. అయితే ప్రత్యేకంగా కృత్రిమ మేధాశక్తి (AI-Artificial Intelligence)పై దృష్టిపెట్టినపుడు, భారత దేశానికి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఫౌండేషనల్ ఏఐ మోడల్స్‌ను తయారు చేయడానికి అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారా? దాని గురించి మనం ఏమనుకోవాలి? నిజంగా చెప్పుకోదగినదానిని వాస్తవంగా నిర్మించడానికి భారత దేశానికి చెందిన బృందం ఎక్కడి నుంచి ప్రారంభించాలంటారు?’’ అని అడిగారు.

ఈ ప్రశ్నపై శాం ఆల్ట్‌మాన్ స్పందిస్తూ, ఓపెన్ఏఐతో పోటీ పడటం అసాధ్యమని చెప్పారు. ఫౌండేషన్ మోడల్స్‌తో పోటీ పడే ప్రయత్నం చేయకూడదన్నారు. ‘‘ఏదో ఓ విధంగా ప్రయత్నించాలనుకుంటే అది మీరు చేయవలసిన పని’’ అన్నారు. అయితే ఈ రెండూ భారత దేశ కంపెనీలకు అసాధ్యమేనని చెప్పారు.

శాం ఆల్ట్‌మాన్ వ్యాఖ్యలపై భారతీయ నిపుణులు ఘాటుగా స్పందించారు. రాజన్ ఆనందన్ ఇచ్చిన ట్వీట్‌లో, స్పష్టమైన జవాబు చెప్పినందుకు శాం ఆల్ట్‌మాన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఇది అసాధ్యం. అయితే మీరు ఏదో విధంగా ప్రయత్నం చేయండి’’ అని మీరు (శాం) చెప్పారన్నారు. 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూవర్‌షిప్ మాకు చూపించినది ఏమిటంటే, ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూవర్‌షిప్‌ను మనం ఎన్నడూ చిన్నచూపు చూడకూడదు, తక్కువ అంచనా వేయకూడదు. ‘‘మేం ప్రయత్నం చేస్తాం’’ అని స్పష్టం చేశారు.

శాం విసిరిన సవాల్‌ను టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ కూడా స్వీకరించారు. తమతో పోటీ పడటం భారతీయ కంపెనీలకు అసాధ్యమని శాం చెప్పారని, ఒకరి తర్వాత మరొక సీఈఓ ఈ సవాలును స్వీకరిస్తున్నామని చెప్పారు.

భారతీయ చాట్‌జీపీటీ రాబోతోందా?

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కొద్ది నెలల క్రితం మాట్లాడుతూ, ప్రభుత్వం తన సొంత చాట్‌జీపీటీ వెర్షన్‌ను ప్రారంభించడంపై సంకేతాలు ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం మాట్లాడుతూ, యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏఐ-బేస్డ్ టూల్స్‌ను క్రమబద్ధీకరిస్తామన్నారు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఏ విధంగా క్రమబద్ధీకరిస్తామో కృత్రిమ మేధాశక్తికి సంబంధించినవాటిని కూడా అదేవిధంగా క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. యూజర్లకు నష్టం కలిగించే చర్యలను నిరోధించేందుకు, శిక్షించేందుకు తగిన నిబంధనలతో డిజిటల్ ఇండియా చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ఇవి కూడా చదవండి :

Donald Trump : ట్రంప్‌పై కేసు.. ఆయన ఏమేం దాచిపెట్టారంటే..

Amazon rainforest : కూలిన విమానం.. గల్లంతైన నలుగురు బాలలు.. 40 రోజుల తర్వాత సజీవంగా..

Updated Date - 2023-06-10T13:48:58+05:30 IST