Rahul Gandhi: రాహుల్‌కి రాజకీయ చతురత వారసత్వంగా అబ్బలేదు.. మాజీ రాష్ట్రపతి జీవిత పుస్తకంలో ఆసక్తికర విషయాలు
ABN , First Publish Date - 2023-12-06T16:44:30+05:30 IST
కాంగ్రెస్ అగ్రనేతకు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ తన తండ్రిపై ఒక పుస్తకాన్ని రాశారు.
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేతకు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ తన తండ్రిపై ఒక పుస్తకాన్ని రాశారు. ‘ఇన్ ప్రణబ్, మై ఫాదర్: ఏ డాటర్ రిమెంబర్స్’ పేరుతో పుస్తకాన్ని విడుదల చేశారు. ఇందులో రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి సంబంధించిన పొలిటికల్ విశేషాలను శర్మిష్ఠ పంచుకున్నారు. ప్రణబ్ ముఖర్జీ (Pranab Mukherjee) తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను రాహుల్ చెత్త బుట్టలో పడేసినందుకు తన తండ్రి కలత చెందారని ఆమె అందులో పేర్కొంది.
గాంధీజీ- జవహర్ లాల్ నెహ్రూల కుటుంబాల నుంచి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టినా రాహుల్ కి మాత్రం రాజకీయ చతురత అబ్బలేదని ప్రణబ్ ముఖర్జీ అన్నారట. ఇదే విషయాన్ని ఆయన డైరీలో రాసుకున్నారు. ఈ అంశాల మేళవింపుతో ఆయన కుమార్తె రాసిన పుస్తకంలో ప్రణబ్ డైరీ, గాంధీ - నెహ్రూల పట్ల ఆయనకున్న వ్యక్తిగత ఇష్టం, రాహుల్ రాజకీయ భవిష్యత్తు.. సోనియా గాంధీ గురించి ఆసక్తికర విషయాలను ఆ డైరీలో ప్రస్తావించారు.
‘రాహుల్ గాంధీ మర్యాదగా ప్రవర్తిస్తారు. అనేక ప్రశ్నలు సంధిస్తారు. కానీ, రాజకీయాల్లో ఆయన అనుభవం సాధించలేదు. 2013 జులైలో రాహుల్ ఓ సారి మా ఇంటికి వచ్చారు. పార్టీ పునరుద్ధరణకు సంబంధించి తన ప్రణాళికలను చెప్పారు. ఆయన సవాళ్లను ఎదుర్కోగలరని అనిపించింది. ముందు కేబినెట్‌లో చేరి పాలనాపరమైన అంశాల్లో అనుభవం గడించాలని చెప్పాను. కానీ నా సలహాను రాహుల్ వినిపించుకోలేదు’’ అని ప్రణబ్ అప్పటి ఘటనల్ని డైరీలో రాసుకున్నారు.
కేబినెట్ ప్రతులు చించేయడంపై ఆగ్రహించిన ప్రణబ్..
2013లో యూపీఏ(UPA) ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్ ప్రతులను రాహుల్ మీడియా ముందు చించేసిన ఘటనను శర్మిష్ఠ తన పుస్తకంలో ప్రస్తావించారు. ఆ విషయంలో ప్రణబ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారట. ‘‘రాహుల్ కేబినెట్ సభ్యుడు కాదు. కేబినెట్ ప్రతులను చించేయడానికి ఆయనెవరు? ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) విదేశాల్లో ఉన్నారు. రాహుల్ చర్యలు ప్రధానిపై, ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది తెలుసా? గాంధీ- నెహ్రూ కుటుంబాలనుంచి వచ్చిన వాడిగా కొన్ని విషయాలు సంగ్రహించినప్పటికీ వారి రాజకీయ చతురతే రాహుల్ కి అబ్బలేదు. రాహుల్ ప్రతులు చించేయడంతో యూపీఏ కూటమి మరింతగా పతనమైంది. 2014 ఎన్నికల్లో ఓటమికి అదీ ఒక కారణమే. ప్రధానిని గౌరవించనివారికి ఎవరైనా ఎందుకు ఓటేస్తారు. ’’ అని ప్రణబ్ అన్నట్లు శర్మిష్ఠ తన పుస్తకంలో ప్రస్తావించారు.