Share News

Deepfake: సోషల్ మీడియా సంస్థలపై కేంద్రం కొరడా.. వారం రోజుల డెడ్‌లైన్

ABN , First Publish Date - 2023-11-24T17:21:42+05:30 IST

సోషల్ మీడియాలో వరుస డీప్‌ఫేక్ వీడియోల ఉదంతాలు ఆందోళన కలిగిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. త్వరలోనే వీటి నియంత్రణ, తగిన చర్యలు తీసుకునేందుకు ఒక అధికారిని నియమిస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారంనాడు తెలిపారు.

Deepfake: సోషల్ మీడియా సంస్థలపై కేంద్రం కొరడా.. వారం రోజుల డెడ్‌లైన్

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో వరుస డీప్‌ఫేక్ (Deepfake) వీడియోల ఉదంతాలు ఆందోళన కలిగిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. త్వరలోనే వీటి నియంత్రణ, తగిన చర్యలు తీసుకునేందుకు ఒక అధికారిని నియమిస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (Rajeev Chandrasekhar) శుక్రవారంనాడు తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఒక వెబ్‌సైట్ రూపొందిస్తామని, ఐటీ నిబంధనలు ఉల్లంఘించే సామాజిక మాధ్యమాలపై ప్రజలు ఇందులో తమ ఫిర్యాదును నమోదు చేయవచ్చని చెప్పారు. డీప్‌ఫేక్‌కు పాల్పడిన బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదుకు ప్రభుత్వం ప్రజలకు సహకరిస్తుందన్నారు.


తొలుత సామాజిక మాధ్యమాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని, సామాజిక మాధ్యమాలు సహకరించి కంటెంట్ సోర్స్ వివారాలు అధికారులకు అందజేస్తే బాధ్యతలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.


ఏడు రోజుల గడువు..

డీప్‌ఫేక్‌లను అరికట్టేందుకు సామాజిక మధ్యమాలు తప్పనిసరిగా తమ టర్మ్స్ ఆఫ్ యూజ్‌ను ఐటీ నిబంధనలకు అనుగుణంగా మార్చాలని, ఇందుకోసం వారికి వారం రోజులు గడువు ఇస్తున్నామని మంత్రి చెప్పారు. ఈరోజు నుంచి ఐటీ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఎలాంటి ఉపేక్ష చూపించే ప్రసక్తే లేదన్నారు.


డీప్‌ఫేక్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతవారంలో ఆందోళన వ్యక్తం చేశారు. డీప్‌ఫేక్ వీడియోలు సృష్టిస్తూ కృత్రిమ మేధను దుర్వినియోగం చేస్తున్నారని, టెక్నాలజీని బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ అంశంపై ఇతర దేశాలతో కలిసి పనిచేసేందుకు కూడా భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. కాగా, డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించడం, సర్క్యులేషన్ చేస్తే రూ.లక్ష వరకూ జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని కేంద్రం చెబుతోంది. సంఘంలోని ప్రముఖ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని డీప్‌ఫేక్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వస్తుండటం ప్రపంచ దేశాలను సైతం ఆందోళనకు గురిచేస్తోంది.

Updated Date - 2023-11-24T17:21:44+05:30 IST