Narendra Modi : మోదీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-08-12T15:36:57+05:30 IST
గత ప్రభుత్వాల హయాంలో కొన్ని సైద్ధాంతిక కారణాల వల్ల దేశ ప్రయోజనాలను త్యాగం చేశారని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలో భారత దేశం ప్రపంచ దేశాలతో కలిసి పని చేస్తోందని, అయితే దేశ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తోందని చెప్పారు.
న్యూఢిల్లీ : గత ప్రభుత్వాల హయాంలో కొన్ని సైద్ధాంతిక కారణాల వల్ల దేశ ప్రయోజనాలను త్యాగం చేశారని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలో భారత దేశం ప్రపంచ దేశాలతో కలిసి పని చేస్తోందని, అయితే దేశ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తోందని చెప్పారు. ‘ఆకాశవాణి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలీన విధానాన్ని అవలంబించిన రోజుల నుంచి అత్యంత ఆత్మవిశ్వాసం నిండిన, దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చే వైఖరికి మారిన విషయాన్ని వివరించారు.
అలీన విధానానికిగల చారిత్రక ప్రాధాన్యాన్ని జైశంకర్ ధ్రువీకరించారు. దేశ శక్తి, సామర్థ్యాలు పరిమితంగా ఉన్నపుడు స్వాతంత్ర్యాన్ని బలంగా వ్యక్తీకరించే విధానంగా దీనిని అభివర్ణించారు. భారత దేశ విదేశాంగ విధానంలో ప్రత్యేక శకానికి అలీన విధానం ప్రాతినిధ్యం వహించిందని, అయితే దాని పరిమితులు దానికి ఉన్నాయని చెప్పారు.
‘‘అది మన సామర్థ్యాలు పరిమితంగా ఉన్న సమయం. అంతేకాకుండా మన దేశ ప్రయోజనాలకు ఎల్లప్పుడూ పెద్ద పీట వేయని సమయం. కొన్నిసార్లు మనకు దక్కవలసిన ప్రయోజనాలు మనం పొందలేకపోయాం. కానీ అది గతం’’ అని చెప్పారు. 1990వ దశకంలో ఆర్థిక సంస్కరణలు జరిగిన కాలాన్ని గుర్తు చేస్తూ, ఈ సంస్కరణలు దేశ విదేశాంగ విధానాన్ని మార్చుకోవలసిన అవసరాన్ని తీసుకొచ్చాయన్నారు. ఆర్థిక, దౌత్యపరమైన వ్యూహాల మధ్య విడదీయలేని లంకెను గుర్తిస్తూ ఈ మార్పులు చేయవలసిన అవసరం ఏర్పడిందన్నారు.
ఇవి కూడా చదవండి :
UP Assembly : నవ్వులు పూయించిన యోగి ఆదిత్యనాథ్, శివపాల్ యాదవ్ సంభాషణ