G20 summit dinner: ఒకే దెబ్బకు రెండు పిట్టలు..నితీష్ చాణక్యం..!

ABN , First Publish Date - 2023-09-12T18:01:47+05:30 IST

విపక్ష కూటమి 'ఇండియా' ఏర్పాటుకు అనుసంధానకర్తగా వ్యవహరించిన బీహార్ సీఎం నితీష్ కుమార్ అనూహ్యంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత శనివారంనాడు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన జి-20 ) విందు సమావేశానికి హాజరయ్యారు. ఈ చర్య నితీష్ చాణక్య నీతికి నిదర్శనమని, 'ఒకే దెబ్బకు రెండు పిట్టలు' కొట్టారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

G20 summit dinner: ఒకే దెబ్బకు రెండు పిట్టలు..నితీష్ చాణక్యం..!

పాట్నా: బీజేపీతో ముఖాముఖీ పోరుగా కొత్తగా ఏర్పడిన 'ఇండియా' (I.N.D.I.A.) కూటమి 2024 లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకాలకు సంబంధించిన కీలకాంశంపై ఈ వారంలోనే సమావేశమవుతోంది. ఈ క్రమంలోనే విపక్ష కూటమి ఏర్పాటుకు అనుసంధానకర్తగా వ్యవహరించిన బీహార్ సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar) అనూహ్యంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత శనివారంనాడు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన జి-20 (G-20) విందు సమావేశానికి హాజరయ్యారు. ఈ చర్య నితీష్ చాణక్య నీతికి నిదర్శనమని, 'ఒకే దెబ్బకు రెండు పిట్టలు' కొట్టారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


బీహార్‌లో బీజేపీతో గత ఏడాది ఆగస్టులో నితీష్ తెగతెంపులు చేసుకున్న తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన కలవడం ఇదే మొదటిసారి. నితీష్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రధానమంత్రి పరిచయం చేశారు. బీజేపీని ఓడించేందుకు సర్వశక్తులూ ఒడ్డాలని నిర్ణయించుకున్న 'ఇండియా కూటమి' నేతలకు సహజంగానే ఇది మింగుడుపడని వ్యవహరమే. నీతీష్ మంచి రాజనీతిజ్ఞుడని, సమయానికి తగు నిర్ణయాలు తీసుకోవడంలో కాకలు తీరిన నేత అని అందరికీ తెలిసిన విషయమే. జి-20 డిన్నర్‌కు హాజరుకావడం ద్వారా సొంత నిర్ణయాలు తీసుకోగలిగిన సామర్థ్యం తనకు ఉందని ఆయన చెప్పకనే చెప్పినట్టు అయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


జి-20 మెగా షో‌తో దేశానికి ఒరిగేదేమీ లేదని బీహార్‌లో నితీష్ భాగస్వామ పార్టీ ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ గత సోమవారంనాడు పెదవి విరిచారు. బీహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో మహాకూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విపక్ష ఐక్య కూటమి యత్నాలకు నితీష్ సారథ్యం వహిస్తూ వచ్చారు. ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తేవడమే తన లక్ష్యమని నితీష్ చెబుతూ వచ్చారు. అయితే విపక్ష గ్రూపునకు (I.N.D.I.A.) సారథ్యం వహించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేరును లాలూ ప్రసాద్ ఇటీవల ప్రతిపాదించడం జేడీయూకు మింగుడు పడటం లేదు. జేడీయూ అగ్రనేతలు కొందరు విపక్ష కూటమి పీఎం అభ్యర్థిగా నితీష్ పేరును ప్రతిపాదించాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, ఈ ముచ్చట ఏదీ ముంబై సమావేశంలో చోటుచేసుకోలేదు. కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయడం, సీట్ షేరింగ్ అంశాన్ని సాధ్యమైనంత త్వరగా కొలిక్కి తీసుకురావాలని మాత్రమే సమావేశంలో నిర్ణయించారు.


మరోవైపు బీహార్ గ్రాండ్ అలయెన్స్‌లో కీలక పార్టీలైన ఆర్జేడీ, జేడీయూలు లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలు ఇప్పటికే మొదలుపెట్టేశారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఆఫీసు బేరర్లు సమావేశమవుతూ వ్యూహరచన సాగిస్తున్నారు. సీట్ల షేరింగ్ విషయంపై మాత్రం పెదవి విప్పడం లేదు. కీలకమైన యూపీ, బీహార్, పశ్చిమబెంగాల్‌లో 'ఇండియా బ్లాక్‌' చెందిన నేతలు సీట్ల పంపకాలు, బేరసారాల వ్యవహరంపై గుంభనగా వ్యవహరిస్తున్నారు.


నితీష్ చాణక్యంతో...రాష్ట్రానికి రూ.1,942 కోట్లు

జి-20 విందుకు హాజరుకావడం ద్వారా నితీష్ ప్రదర్శించిన చాణక్య నీతికి ఫలితం కూడా దక్కింది. నితీష్-మోదీ సమావేశమైన మరుసటి రోజే బీహార్‌కు రూ.1,942 కోట్ల నిధులను కేంద్రం రిలీజ్ చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పంచాయతీ రాజ్ సంస్థలు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ నిధులు విడుదల చేశారు. 2023-24 సంవత్సరానికి 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేసిన రూ.3.884 కోట్లు కేంద్రం విడుదల చేయడం లేదంటూ బీహార్ ప్రభుత్వం ఇటీవల విమర్శనాస్త్రాలు కూడా ఎక్కుపెట్టింది. ఈ నేపథ్యంలో నితీష్ ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టారని, జి-20 సమావేశానికి వెళ్లడం ద్వారా సొంత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తనకు ఉందని చాటుకోవడం, ఇదే సమయంలో కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడానికి మార్గం సుగమం చేసుకున్నారని విశ్లేషకులు అంటున్నారు.

Updated Date - 2023-09-12T18:01:47+05:30 IST