Share News

No Holidays : సంక్రాంతి, రాఖీ, కృష్ణాష్టమికి సెలవుల్లేవ్‌

ABN , First Publish Date - 2023-11-28T23:47:45+05:30 IST

బిహార్‌లోని నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం విడుదల చేసిన విద్యాసంస్థల సెలవుల క్యాలెండర్‌ వివాదాస్పదంగా మారింది. 2024 విద్యాసంవత్సరానికి

No Holidays : సంక్రాంతి, రాఖీ, కృష్ణాష్టమికి సెలవుల్లేవ్‌

శ్రీరామనవమి, శివరాత్రి, భాయ్‌దూజ్‌కు కూడా.. రంజాన్‌, బక్రీద్‌లకు మూడేసి రోజుల సెలవులు

ఉర్దూ స్కూళ్లకు ఆదివారం బదులు శుక్రవారం సెలవు

బిహార్‌ విద్యాశాఖ సెలవుల క్యాలెండర్‌ వివాదాస్పదం

ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ బిహార్‌గా మార్చేశారు: బీజేపీ

నితీశ్‌ సర్కారుపై కేంద్రమంత్రులు గిరిరాజ్‌, చౌబే ధ్వజం

పట్నా, నవంబరు 28: బిహార్‌లోని నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం విడుదల చేసిన విద్యాసంస్థల సెలవుల క్యాలెండర్‌ వివాదాస్పదంగా మారింది. 2024 విద్యాసంవత్సరానికి సంబంధించిన సెలవుల క్యాలెండర్‌ను బిహార్‌ విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది. అందులో పలు హిందూ పండగల సెలవులను ఎత్తివేసింది. ముస్లిం పండగల సెలవులను పెంచేసింది. హిందువుల ముఖ్యమైన పండగలైన సంక్రాంతి, రాఖీ, సరస్వతీ పూజ, కృష్ణాష్టమి, శ్రీరామనవమి, భాయ్‌దూజ్‌, శివరాత్రిలను అసలు ఆ క్యాలెండర్‌లో ప్రస్తావించనే లేదు. హిందువులకు సంబంధించి నాలుగు పండగలను మాత్రమే క్యాలెండర్‌లో ప్రస్తావించారు. దీపావళికి ఒక్కరోజు, హోలీకి రెండు రోజులు, దుర్గాపూజ, ఛత్‌ పూజలకు మూడేసి రోజులు చొప్పున మొత్తం 9 రోజులు మాత్రమే హిందూ పండగలకు సెలవులు ఇచ్చారు. కాగా, ముస్లింలకు చెందిన ఆరు పండగలకు మొత్తంగా 11 సెలవులు ఇచ్చారు. వీటిలో షబే బరాత్‌, చెహల్లుం, మీలాద్‌-ఉన్‌-నబీలకు ఒక్కొక్క రోజు, రంజాన్‌, బక్రీద్‌లకు మూడేసి రోజులు, మొహర్రం 2 రోజులు ఉన్నాయి. ఇక ఉర్దూ స్కూళ్లకు సెలవును ఆదివారం బదులు శుక్రవారంగా మార్చారు.

వేసవి సెలవులను 20 రోజుల నుంచి 30 రోజులకు పెంచారు. దీనిపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ బిహార్‌గా మార్చేశారంటూ ట్వీట్‌ చేసింది. కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ కూడా అదే ట్వీట్‌ చేశారు. మరో కేంద్రమంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే ‘బుజ్జగింపుల రాజు, కుర్చీ కుమార్‌’ అంటూ నితీశ్‌కుమార్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘మామ-మేనల్లుడి ప్రభుత్వం మరోసారి హిందూ వ్యతిరేక వైఖరిని బయటపెట్టుకుంది. ముస్లిం ఓటు బ్యాంకు కోసం సనాతన ధర్మాన్ని విమర్శిస్తున్న ప్రభుత్వం సిగ్గుపడాలి’ అని చౌబే ట్వీట్‌ చేశారు. గతంలోనే హిందూ పండగలకు ఉండే 23 సెలవులను ప్రభుత్వం 11కు కుదించింది. దుర్గాపూజకు 6 రోజులను 3 రోజులకు తగ్గించింది. దీపావళి నుంచి ఛత్‌పూజ వరకు ఉండే తొమ్మిది సెలవులను నాలుగుకు తగ్గించింది. అప్పట్లో తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం తాజాగా మరోసారి హిందూ పండగల సెలవుల తగ్గింపునకు శ్రీకారం చుట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం స్కూళ్లలో కాషాయ విధానాలు అమలు చేస్తోందని బిహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ విమర్శించిన తర్వాతి రోజే బిహార్‌ విద్యాశాఖ వివాదాస్పద సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేయడం గమనార్హం.

Updated Date - 2023-11-29T07:13:42+05:30 IST