Joshimath Sinking: భయంలేదు, మాదీ భరోసా: సీఎం

ABN , First Publish Date - 2023-01-14T15:51:56+05:30 IST

ఛమోలీ జిల్లాలోని జోషిమఠ్ పట్టణం కుంగిపోతున్న సమస్యను పరిష్కరించేందుకు దశలవారీ చర్యలు తీసుకుంటున్నట్టు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి..

Joshimath Sinking: భయంలేదు, మాదీ భరోసా: సీఎం

డెహ్రాడూన్: ఛమోలీ జిల్లాలోని జోషిమఠ్ (Joshimath) పట్టణం కుంగిపోతున్న సమస్యను పరిష్కరించేందుకు దశలవారీ చర్యలు తీసుకుంటున్నట్టు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి (Pushkar singh Dhami) తెలిపారు. బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారిని తక్షణం ఆదుకునేందుకు తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.

''బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం. పగుళ్లబారిన పడిన భవంతుల డీమార్కేషన్ ప్రక్రియ నిరంతర ప్రక్రియగాసాగుతోంది. భూమి కుంగిపోవడానికి కారణాలపై జియాలజిస్టులు, నిపుణులు పరిశోధనలు చేస్తున్నారు. జిల్లా యంత్రాగం ఎప్పటికప్పుడు బాధిత ప్రజల అవసరాలను చూసుకుంటోంది. పునరావాస శిబిరాల్లో కనీస అవసరాలు కల్పిస్తున్నాం. రాష్ట్ర క్యాబినెట్ సైతం శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది'' అని పుష్కర్ సింగ్ థామి చెప్పారు. విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు ఆరు నెలలు చెల్లించనవసరం లేకుండా మినహాయించామని, బ్యాంకు రుణాలపై ఏడాది మారటోరింయం ఇస్తున్నామని చెప్పారు. ప్రకృతి వైపరీత్యం బారిన ప్రజలకు అన్ని విధాలా అండగా నిలుస్తామని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదని చెప్పారు. సహాయ, పునరావాస చర్యలు తీసుకుంటున్నామని, ప్రధానమంత్రి కార్యాలయం సైతం ఎప్పటికిప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోందని అన్నారు. కాగా, జోషిమఠ్ టౌన్ నుంచి ఇంతవరకూ 185 కుటుంబాలను రిలీఫ్ సెంటర్లకు తరలించారు. ఇళ్లు దెబ్బతిన్న బాధిత కుటుంబాలకు రూ.1.5 లక్షల చొప్పున తాత్కాలిక సహాయన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు.

Updated Date - 2023-01-14T15:51:57+05:30 IST