Saudi Arabia : మహమ్మద్ బిన్ సల్మాన్ హయాంలో రికార్డు స్థాయిలో ఉరితీతలు

ABN , First Publish Date - 2023-02-02T16:49:47+05:30 IST

సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ (Mohammed bin Salman or MBS) నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో

Saudi Arabia : మహమ్మద్ బిన్ సల్మాన్ హయాంలో రికార్డు స్థాయిలో ఉరితీతలు
Mohammed bin Salman

న్యూఢిల్లీ : సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ (Mohammed bin Salman or MBS) నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో ఉరిశిక్షల అమలు రికార్డు స్థాయిలో కనిపిస్తోంది. ఈ దేశపు ఆధునిక చరిత్రలో గడచిన ఆరేళ్ళు రక్తపు మరకల అధ్యాయాలే కనిపిస్తున్నాయి. ఎంబీఎస్ హయాంలో ఉరితీతల రేటు అంతకుముందు కన్నా రెట్టింపు అయింది. ఈ వివరాలను ప్రముఖ అమెరికన్ మీడియా వెల్లడించింది.

రాజకీయ ప్రత్యర్థులపై ఎంబీఎస్ ప్రభుత్వం అత్యంత దారుణంగా విరుచుకుపడుతోందని ఈ పత్రిక వెల్లడించింది. అసమ్మతిని ఏమాత్రం సహించడం లేదని పేర్కొంది. 2015 నుంచి 2022 వరకు ప్రతి సంవత్సరం సగటున 129 మంది చొప్పున ఉరిశిక్షకు బలైపోయినట్లు తెలిపింది. ఉరి శిక్షలు 2010-14 మధ్య కాలంలో 82 శాతం పెరిగాయని, గత ఏడాది 147 మందిని ఉరి తీశారని పేర్కొంది.

యూరోపియన్ సౌదీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ రిప్రైవ్ రూపొందించిన నివేదికలో ఈ మరణ శిక్షలను వివక్షతో అన్యాయంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. హత్యా నేరానికి పాల్పడినవారికి మాత్రమే మరణ శిక్ష విధిస్తామని ఎంబీఎస్ హామీ ఇచ్చినప్పటికీ, హింస లేని నేరాలకు పాల్పడినవారికి కూడా మరణ శిక్ష విధిస్తుండటంతో ఆయన హామీలు నీటి మూటలేనని తేటతెల్లమవుతోంది.

ఓ పాత్రికేయుడి హత్యకు ఎంబీఎస్ ఆమోదం తెలిపారని అమెరికన్ ఇంటెలిజెన్స్ నివేదిక తెలిపింది. ఎంబీఎస్ సౌదీ అరేబియాలో ఆర్థిక, సాంఘిక, మతపరమైన సంస్కరణలను అమలు చేశారని తెలిపింది.

ఎంబీఎస్ సౌదీ అరేబియా ఆధునిక చరిత్రలో మౌలిక పరివర్తన తీసుకొచ్చారు. 2017 జూన్‌లో క్రౌన్ ప్రిన్స్ అయిన తర్వాత ఆయన తన ప్రత్యర్థులందరినీ పక్కనపడేశారు. విమర్శకులపై విరుచుకుపడ్డారు. ప్రముఖ మత పెద్దలు, యాక్టివిస్టులు, రాజవంశీకులను సైతం ఆయన వదిలిపెట్టలేదు. 2018 అక్టోబరులో సౌదీ పాత్రికేయుడు జమాల్ ఖషోగ్గీ హత్యతో తీవ్ర విమర్శలపాలయ్యారు.

Updated Date - 2023-02-02T16:50:01+05:30 IST