Women's Health: అంత డేంజరా? మూడో వంతు మహిళలకు ఆ సమస్యలు..!

ABN , First Publish Date - 2023-03-22T12:11:29+05:30 IST

మహిళలు.. ఆకాశంలో సగం..! విద్య, ఉద్యోగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారు..! అయినా.. కొన్ని అనారోగ్య సమస్యల విషయంలో పురుషుల కంటే ఎక్కువ ఇబ్బందులను..

Women's Health: అంత డేంజరా? మూడో వంతు మహిళలకు ఆ సమస్యలు..!

మహిళలు.. ఆకాశంలో సగం..! విద్య, ఉద్యోగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారు..! అయినా.. కొన్ని అనారోగ్య సమస్యల విషయంలో పురుషుల కంటే ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా పలువురు మహిళలపై జిందాల్ నేచర్ కేర్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన ఓ సర్వేలో.. మూడోవంతు మహిళలు జీవనశైలి(Lifestyle), మానసిక సమస్యల(Mental Health Issues)తో బాధపడుతున్నట్లు తేలింది. ఈ రెండింటి వల్ల మహిళల్లో ఇతర రుగ్మతలకు ఆస్కారముంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు.. బెంగళూరు, కోల్‌కతా, సోనిపట్, నోయిడా, గురుగ్రామ్, అహ్మదాబాద్, డెహ్రాదూన్, ఫరీదాబాద్, ఘాజియాబాద్ తదితర నగరాలకు చెందిన 15 ఏళ్ల బాలికలు మొదలు.. 60 ఏళ్ల వయసున్న మహిళలపై ఈ సర్వే నిర్వహించారు.

డెస్క్‌-బౌండ్ లైఫ్‌స్టైల్

సర్వే నిర్వహించిన జిందాల్ నేచర్‌క్యూర్ ఇన్‌స్టిట్యూట్ నిపుణులు.. ప్రతికూల లైఫ్‌స్టైల్ వల్ల మహిళల్లో ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని, ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతుందని వివరించారు. కార్యాలయాల్లో డెస్కులకే పరిమితమయ్యే జీవనశైలి(Desk-Bound Lifestyle) లైఫ్‌స్టైల్ డిజార్డర్(Lifestyle Disorder)కు ప్రధాన కారణాల్లో ఒకటని వివరించారు. ఉద్యోగాలు చేసే మహిళలకు ఈ తరహా డిజార్డర్లతో ప్రమాదముందని చెప్పారు.

అయితే టీవీ.. లేకుంటే స్మార్ట్‌ఫోన్

తాము సర్వే నిర్వహించిన మహిళల్లో (గృహిణులు, ఉద్యోగులు) 25.5% మంది రోజులో దాదాపు పదిగంటల సమయాన్ని టీవీ చూడడానికో.. స్మార్ట్‌ఫోన్‌ను చూడడానికో.. ల్యాప్‌టాప్‌లో పనిచేసుకోవడానికో కేటాయిస్తున్నారని ఈ సర్వే వెల్లడించింది. వీరిలో 10% మంది ఎముకల సంబంధ రుగ్మతలు, 12% మంది మధుమేహం, అధికబరువు, PCOD (Polycystic Ovarian Disease), థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నట్లు ఈ సర్వే తేల్చింది.

జంక్‌ఫుడ్ మరీ డేంజర్..!

ఈ సర్వేలో పాల్గొన్న 36.2% మంది మహిళలు ఎక్కువగా జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్ తింటున్నట్లు గుర్తించారు. ఇలాంటి వారు బులిమియా(తరచూ ఏదో ఒకటి తింటూ ఉండడం.. తద్వారా వికారం వల్ల వాంతులు చేసుకోవడం), ఆకలి లేకపోవడం(Anorexia) వంటి రుగ్మతలను ఎదుర్కొంటున్నట్లు ఈ సర్వేను నిర్వహించిన పరిశోధకులు తేల్చారు. ఇలాంటి వారిలోనే మానసిక ఒత్తిడి(Mental depression) ఎక్కువగా కనిపిస్తుందని, హార్మోన్ల విడుదలలో సమతౌల్యత లోపిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.

మగవారితో పోలిస్తే..

లైఫ్‌స్టైల్ సమస్యలతో బాధపడే మగవారితో పోలిస్తే.. వాటి ప్రభావానికి మహిళలే ఎక్కువగా లోనవుతారని ఈ సర్వే నిర్వహించిన పరిశోధకులు నిగ్గుతేల్చారు. ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలపై ఈ ప్రభావం ఎక్కువ అని చెబుతున్నారు. ఇక మహిళలు ఎదుర్కొనే నెలసరి సమస్యలు, వయసు పైబడుతున్నప్పుడు ఎదురయ్యే ఎముకల వ్యాధుల పట్ల వారికి కుటుంబ సభ్యుల సానుభూతి ఉండడం లేదని, కుటుంబంలోని మగవారు వీటిని సమస్యలుగానే చూడరని, ఈ తరహా చర్యలు కూడా మహిళల్లో మానసిక ఆందోళనకు దారితీస్తాయని చెప్పారు. గృహిణులే కాకుండా.. ఉద్యోగిణులు కూడా పిల్లల బాధ్యతలు మొదలు.. కుటుంబ సమస్యలను భుజాలకెత్తుకుంటారని, ఈ కారణంతో సమయానికి తినకపోవడం, అసలు భోజనమే చేయకపోవడం, నిద్రకు సమయం కేటాయించకపోవడం, ఒత్తిడి(Stress)కి గురవ్వడం, ఆందోళన(Anxiety) బారిన పడడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు పరిశోధకులు తెలిపారు. శారీరక వ్యాయామం లేకపోవడం, నిత్యం ఏదో ఒక పనికి అలవాటుపడడం(Addictive Behaviours) కూడా పరిస్థితిని మరింత జటిలంగా మారుస్తోందని పేర్కొన్నారు.

పరిస్థితి తీవ్రమే..

ఈ సర్వేలో పాల్గొన్న 17% మంది మహిళలకు వెంటనే లైఫ్‌స్టైల్ డిజార్డర్‌కు చికిత్స అవసరమని వెల్లడించారు. మరో 22% మంది మహిళలు ఈ డిజార్డర్‌కు చేరువయ్యారని పేర్కొన్నారు. చాలా మందిలో ఇవి సమస్యలు/రుగ్మతలని, వీటికి చికిత్స తీసుకోవాలనే అవగాహనే లేదన్నారు.

పరిష్కార మార్గాలేంటి?

టీవీ, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లకు కేటాయించే సమయాన్ని చాలా వరకు తగ్గించడం, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండడం ఈ సమస్యలకు ప్రధాన పరిష్కారమని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోవడం, పోషకాహారాలను ఎక్కువగా తీసుకోవడం తప్పనిసరి అని సూచించారు. ఈ సర్వేలో పాల్గొన్న 87.2% మంది మహిళలు తమ సమస్య పరిష్కారానికి చికిత్సావిధానాలకు బదులుగా యోగా, మెడిటేషన్‌పై ఆసక్తి కనబరిచారని తెలిపారు.

జిందాల్ నేచర్‌క్యూర్ పరిశోధకులు సూచిస్తున్న మరికొన్ని జాగ్రత్తలు..

1. క్రమం తప్పకుండా యోగా, ధ్యానం వంటివి చేయడం.. ఇందుకోసం రోజులో కొంత సమయాన్ని కేటాయించడం

2. శ్వాసపై దృష్టి సారించాలి. శ్వాస సంబంధిత ఎక్సర్‌సైజులు (Breath Exercises) చేయాలి

3. శారీరక వ్యాయామం, నడక తప్పనిసరి

4. డెస్క్ వర్క్ చేసేవారు ప్రతి 20 నిమిషాలకోసారి తమ దృష్టిని మరల్చి, కొంత దూరం నడవాలి

5. వీలైనంతగా జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి

Updated Date - 2023-03-22T12:11:35+05:30 IST