Share News

Story : తిట్ల మాటలు

ABN , First Publish Date - 2023-10-18T23:27:20+05:30 IST

ఎద్దు, దున్నపోతు, గాడిద ఒక చోట చేరాయి. ముగ్గురూ బాధపడుతున్నారు. ‘నేను పని చేస్తాను. నేను లేనిదే రైతులకు వ్యవసాయం లేదు. నా వల్లనే పంటలు పండుతున్నాయి.

Story : తిట్ల మాటలు

ఎద్దు, దున్నపోతు, గాడిద ఒక చోట చేరాయి. ముగ్గురూ బాధపడుతున్నారు. ‘నేను పని చేస్తాను. నేను లేనిదే రైతులకు వ్యవసాయం లేదు. నా వల్లనే పంటలు పండుతున్నాయి. అయితే నన్ను ‘‘ఎద్దు’’ అని తిడుతుంటారు. అయినా తిట్లకు నా పేరు ఎందుకు ఉపయోగించుకోవాలో’ అన్నది. ‘నీవయితే సరే. నన్ను మరీ ఘోరంగా తిట్టుకు ఉపయోగిస్తున్నారు. చివరికి చచ్చిన తర్వాత నా తోలుతో చెప్పులు కూడా కుట్టుకుంటున్నారు. అయితే నన్ను మాత్రం ఇలా ఎప్పుడూ తిడుతూనే ఉంటారు’ అన్నది. వెంటనే గాడిద కలుగ చేసుకుని ఇలా అన్నది.. ‘మీరు ఇద్దరు నయం. నా కత అది కాదు. నేను చాకిరీ ఎక్కువగా చేస్తాను. బట్టలు తీసుకురాకపోతే జనాలు శుభ్రంగా ఉండలేరు’. దీంతో ముగ్గురు ఇలా అన్నారు. ‘అయినా ఈ జనానికి మా పేర్లతో తిట్లు లేనిదే ప్రశాంతంగా ఉండలేరేమో’ నని. దీంతో ముగ్గురూ బ్రహ్మ దేవుడు దగ్గరకు వెళ్లాలని అనుకున్నారు.

బ్రహ్మ దేవుడు దగ్గరకు మూడు జంతువులు వెళ్లాయి. తమ బాధను వెళ్లబోసుకున్నాయి. బాధతో కన్నీళ్లు కార్చాయి. నందీశ్వరుడు శివుడికి వాహనం. యముడికి దున్నపోతు వాహనం. వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్లు పట్టుకున్నాడు. ఇలా మంచి విషయాలు చెప్పాడు బ్రహ్మ. కాసేపు మూడు జంతువులు ఆనందపడ్డాయి. అయితే వాటి బాధమాత్రం పోలేదు. మా మాటలకు సమాధానం ఇవ్వండి అన్నాయి. దీంతో వెంటనే బ్రహ్మ ఇలా అన్నాడు.. ‘ముందు మీ బుద్ధులు మార్చుకోండి’ అన్నాడు. ఇక వెళ్లిపోండని ఆజ్ఞాపించాడు.

మూడు జంతువులు ఒకే చోట గుమికూడాయి. ఈ దేవుడు కూడా మనకు న్యాయం చేయలేకపోతున్నాడు. మన గుణాలు బాగలేవట.. అంటూ ముగ్గురూ బ్రహ్మను తిట్టుకున్నాయి. ‘ఈ దున్నపోతుకు మనుషులంటే పక్షపాతం’ అన్నది గాడిద. ‘మనం చెప్పింది వినకుండా ఇంకోటేదో చెబుతాడు మొద్దు ఎద్దు’ అన్నది దున్నపోతు. ‘అసలీ గాడిద దగ్గరకు వెళ్లి మొరపెట్టుకోవటం. ఇది ఒట్టి గాడిద’ అంటూ ఎద్దు కోప్పడ్డది.

ఇలా ఆ మూడు జంతువులు తమ పేరుతో తిట్లు తిట్టుకుంటున్న జనాలను చూసి బాధపడుతున్నాయి కానీ.. వాటి క్రమశిక్షణ, గుణాల్లో మాత్రం మార్పు రాలేదు. అందుకే అవి ఎద్దు, దున్నపోతు, గాడిద.. అయ్యాయి.

Updated Date - 2023-10-18T23:27:20+05:30 IST