Share News

Honest worker : నిజాయితీ పనివాడు

ABN , First Publish Date - 2023-11-21T22:51:12+05:30 IST

ఒక ఊరిలో రంగయ్య అనే పెద్దాయన ఉండేవాడు. అతనికి తన మనమడు చరణ్‌ అంటే ఇష్టం. చరణ్‌కు ఎప్పుడూ కథలు చెప్పేవాడు. అయితే ఒక రోజు ..

Honest worker : నిజాయితీ పనివాడు

ఒక ఊరిలో రంగయ్య అనే పెద్దాయన ఉండేవాడు. అతనికి తన మనమడు చరణ్‌ అంటే ఇష్టం. చరణ్‌కు ఎప్పుడూ కథలు చెప్పేవాడు. అయితే ఒక రోజు నిజాయితీ, నీతి ఉండే ఓ కట్టెల కొట్టేవాడు గురించి చెప్పాలనుకున్నాడు. నిద్రకు ముందు చరణ్‌ ‘కథ’ చెప్పమని అడిగాడు. రంగయ్య కథను ప్రారంభించాడు.

‘అనగనగా ఒక నిజాయితీ ఉండే ఓ వ్యక్తి ఉండేవాడు. అతని పేరు రామయ్య. నీతి కలవాడు. ఆడిన మాట జవదాటడు. తప్పు చేయడు. అతను అడవికి వెళ్లి కట్టెలు కొట్టేవాడు. కొట్టిన చెట్లను ఒకచోట పేర్చి కాల్చి బొగ్గులు చేసేవాడు. ఆ బొగ్గులను సంచుల్లో వేసి పట్టణానికి వెళ్లి అమ్మి.. వచ్చిన ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషించేవాడు. ఎలాంటి రాజకీయాలు, ఏ గొడవలు పట్టించుకునేవాడు కాదు. తన పని తాను చేసుకుని వెళ్లేవాడు.

ఒక రోజు అడవిలోని కొండ పక్కన ఉండే వాగు దగ్గర కట్టెలు కొడుతున్నాడు. మధ్యాహ్నం ఎండలో పని చేస్తున్నాడు. ఎండ సెగ తగిలి అలసి పోయిన రామయ్య చేతిలో నుంచి గొడ్డలి ఎగిరి నీళ్లలో పడింది. సరిగ్గా గొడ్డలి పడిన చోట లోతైన బావి ఉందని రామయ్యకు తెలుసు. దీంతో గొడ్డలి పోయెనే.. అంటూ ఏడ్వటం ప్రారంభించాడు. నీటిలో నుంచి దేవత ప్రత్యక్షమైంది. ఏమయ్యింది? అని అడిగింది. విషయం చెప్పాడు రామయ్య. వెంటనే దేవత అదృశ్యమై బంగారు గొడ్డలిని తీసుకొచ్చింది. ఇది నీదేనా? అని అడిగింది. ‘కాదు’ అన్నాడు రామయ్య. మళ్లీ అదృష్టమై వెండి గొడ్డలిని తీసుకొచ్చింది. ‘ఆ గొడ్డలి నాదే కాదు’ అన్నాడు కోపంగా రామయ్య. ఈసారి తన గొడ్డలినే తీసుకొచ్చింది నీటి దేవత. ‘ఆ.. ఇదే నా చెక్క గొడ్డలి. హమ్మయ్య దొరికింది’ అనుకుంటూ ఆశ్చర్యపోయాడు. ఆనందపడ్డాడు. రామయ్య మంచితనం, నిజాయితీకి మెచ్చి మిగిలిన బంగారు, వెండి గొడ్డలిని కూడా ఇచ్చింది. వెంటనే ఆ దేవత అదృశ్యమైంది’ అంటూ రంగయ్య తన మనవడికి చెప్పాడు. చరణ్‌ ఊ.. కొడుతూ ఎంత మంచివాడో.. భలే భలే దేవత.. అంటూ నిద్రలోకి జారుకున్నాడు.

Updated Date - 2023-11-21T22:51:14+05:30 IST