Srikrishna Devaraya's Jail: దొంగలను మించిన దొంగ

ABN , First Publish Date - 2023-09-08T23:17:28+05:30 IST

ఒకనాడు శ్రీకృష్ణ దేవరాయల వారు కారాగారంలోని వ్యక్తులు ఏమి చేస్తున్నారో అని ఆసక్తితో అక్కడకు వెళ్లారు. ఆ ఖైదీలను చూసి వెళ్తోంటే అందరూ నమస్కరిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు మాత్రం ‘రాయలవారూ.. మా మాట వినండి మహా ప్రభో’ అన్నాడు.

Srikrishna Devaraya's Jail: దొంగలను మించిన దొంగ

ఒకనాడు శ్రీకృష్ణ దేవరాయల వారు కారాగారంలోని వ్యక్తులు ఏమి చేస్తున్నారో అని ఆసక్తితో అక్కడకు వెళ్లారు. ఆ ఖైదీలను చూసి వెళ్తోంటే అందరూ నమస్కరిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు మాత్రం ‘రాయలవారూ.. మా మాట వినండి మహా ప్రభో’ అన్నాడు. ఖైదీలను భటులు కొట్టబోతే వద్దని వారించారు రాయలు. చెప్పమన్నట్లు చేత్తో సైగ చేశారు. ‘మేము దొంగలం. చోర కళలో నైపుణ్యం ఉంది. మాకు పరీక్ష పెట్టండి. నెగ్గితే మాత్రం మమ్మలని వదిలేయండి. మీరు మా సవాల్‌ను స్వీకరించేంత ధైర్యం మీకు ఉందని నమ్ముతున్నాం’ అన్నారు. ఇదేదో తిరకాసు అనుకున్నారు పక్కన ఉండే మంత్రులు. ‘ఫర్వాలేదు.. మీరు మాత్రం మీ చోరకళను ప్రదర్శిస్తానంటే.. వొప్పుకోకుంటే ఎలా? మా రామలింగ కవి ఇంట్లో మీరు దొంగతనం చేసి వస్తే మాత్రం తప్పకుండా మిమ్మలను నేను విడుదల చేస్తాను’ అన్నాడు రాయలు. దొంగలిద్దరూ ఎగిరి గంతేశారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయమని ఇది ఎవరికీ తెలియకూడదని భటులకు, సైనికాధిపతికి చెప్పారు.

ఆ రాత్రి ఆ దొంగలను బయటకు విడుదల చేశారు భటులు. దొంగలకు రామలింగ కవి చిరునామా కూడా చెప్పారు. అర్ధరాత్రి అయ్యాక దొంగలు గోడ దూకి రామలింగ కవి ఇంట్లోకి వెళ్లారు. ఏదో శబ్దం వచ్చిన రామలింగ కవి బయటకు వచ్చాడు. తేరిపార చూశాక. ఎవరో వచ్చారని మాత్రం గ్రహించారు. ఇంతలో దొంగలు చెట్లలో దాక్కున్నారు. ‘ఒసేయ్‌.. మన ఇంట్లో బంగారం ఉంది అది తీసుకునిరా. అసలే దొంగల బెడద’ అన్నాడు. కొంపదీసి సమాచారం రామలింగకవికి అందిచారా? అని దొంగలు సందేహ పడ్డారు. ఆ తర్వాత ‘ఆ వెండిని కూడా తీసుకురా’ అన్నాడు గట్టిగా. రెండింటిని మూటకట్టి ఒక బావిలో వేశాడు రామలింగకవి. కష్టం తగ్గిపోయిందని దొంగలు సంతోషించారు.

రామలింగకవి తన భార్యతో ఇంట్లోకి వెళ్లాడు. వెంటనే దొంగలిద్దరూ బావిలోకి చూశారు. ఉన్ననీళ్లు సగం తోడేసిన తర్వాత బంగారం, వెండి మూట తీసుకోవచ్చని అనుకున్నారు. పాత్రతో నీళ్లు తోడటం ప్రారంభించారు. తోడిన నీళ్లను చెట్లకు పంపిస్తూ మెల్లగా తన పని చేసుకున్నారు రామలింగడు. తన చెట్లకు నీళ్లు సరిపోతాయని నిర్ధారణకు వచ్చాక.. ‘అరే నీళ్లు ఎలా వచ్చాయి. బావి దగ్గర ఏమైంది?’ అంటూ గట్టిగా అరిచాడు. ఇంతలో దొంగలిద్దరూ గోడ దూకారు. వెంటనే అక్కడ ఉండే భటులు దొంగలను పట్టుకెళ్లారు. ఖైదు చేశారు. మరుసటి రోజు ఉదయం రామలింగకవి రాజ్యానికి వెళ్లిన తర్వాత రాయలు తానే పంపించానని దొంగల గురించి చెప్పాడు. ఇది తెలీదు అయితే తాను వాళ్లతో పని చేయించానని చెప్పారు. అంతలో రాయలవారు ‘దొంగలకే దొంగవు’ అన్నారు. సభ అంతా గట్టిగా ఒక్కటే నవ్వులు. జైలులో దొంగలు మాత్రం ఇలా దొరికామేంటీ? అంటూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.

Updated Date - 2023-09-08T23:17:28+05:30 IST