KCR Govt : ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం.. రేపు ఉత్తర్వులు..!
ABN , First Publish Date - 2023-07-23T22:08:00+05:30 IST
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (CM KCR) పలు కీలక నిర్ణయాలు, అన్ని వర్గాల వారికి సంతృప్తి పరచడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (CM KCR) పలు కీలక నిర్ణయాలు, అన్ని వర్గాల వారికి సంతృప్తి పరచడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం ఒక్కరోజే దివ్యాంగులకు వెయ్యి రూపాయిలు పెన్షన్ (Pension) పెంచడం, విద్యార్థులకు డైట్ చార్జీలు (Diet Charges) పెంచడం లాంటి శుభవార్త (Good News) చెప్పారు కేసీఆర్. అతి త్వరలోనే.. పీఆర్సీపై (PRC) కీలక నిర్ణయమే తీసుకోబోతున్నారు. ఆదివారం నాడు కేసీఆర్ చారిత్రక నిర్ణయం (KCR Historic Decision) తీసుకున్నారు. శని, ఆదివారాల్లో వరుసగా కేబినెట్ సబ్ కమిటీ భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
ఇంతకీ ఏమిటా నిర్ణయం..!
ఆదివారం నాడు వీఆర్ఏలతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సుమారు రెండు గంటలకు పైగానే జరిగింది. సుదీర్ఘ సమావేశం అనంతరం.. తెలంగాణలో వీఆర్ఏ (VRA) వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు సీఎం తెలిపారు. మంత్రుల సబ్ కమిటీ సిఫారసుల మేరకు, నిబంధనలను అనుసరించి వీఆర్ఏల అర్హతలను ప్రకారం, మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తున్నామని సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. కాగా.. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం నాడు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం ఆదేశించారు. కేసీఆర్ నిర్ణయంతో వీఆర్ఏలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. గులాబీ బాస్ తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రక నిర్ణయమని బీఆర్ఎస్ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.
సర్దుబాటు ఎలా..?
తెలంగాణలో వీఆర్ఏల సంఖ్య 20,555 ఉండగా.. ఇందులో నిరక్షరాస్యులు, ఏడో తరగతి పాసైనవారు, పది పాసైనవారు, ఇంటర్మీడియేట్ వరకు మాత్రమే చదివి పాసైనవారు, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదివినవారు ఉన్నారు. అయితే.. వీరికున్న విద్యార్హతలను బట్టి ఉద్యోగ కేటగిరిని నిర్ధారించాలని.. నిబంధనలకు అనుగుణంగా ఆయా శాఖల్లో భర్తీ చేయాలని సమావేశంలో కేసీఆర్ నిర్ణయించారు. అంతేకాదు.. ఉన్నత చదువులు చదవి ప్రమోషన్లకు అర్హులైన వారికి పోస్టుల్లో భర్తీ చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. అయితే..61 ఏండ్లు పైబడిన, సర్వీసులో మరణించిన వీఆర్ఏల వారసులకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు సీఎం నిర్ణయించారు. ఇందుకు సంబంధించి వివరాలు, వీఆర్ఏల వారసుల విద్యార్హతలకు సంబంధిచిన వివరాలను సేకరించాలని ఉన్నతాధికారులను కేసీఆర్ ఆదేశించారు. మొత్తానికి చూస్తే.. చాలారోజులు నడుస్తున్న వీఆర్ఏల వ్యవహారానికి ఆదివారంతో ఫుల్ స్టాప్ పడినట్లయ్యింది. అయితే సర్దుబాటులో అసంతృప్తికి చోటివ్వకుండా ఏ మాత్రం సర్దుతారో వేచి చూడాల్సిందే మరి.