Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలనం.. అప్రూవర్‌గా మారిన వైసీపీ ఎంపీ.. టెన్షన్.. టెన్షన్
ABN , First Publish Date - 2023-09-08T17:28:48+05:30 IST
దేశ వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) మరో సంచలనం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ (ED) విచారణ ఎదుర్కొన్న వైసీపీ ఎంపీ ..
దేశ వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) మరో సంచలనం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ (ED) విచారణ ఎదుర్కొన్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి (Magunta Srinivasa Reddy) అప్రూవర్‌గా మారారు. శుక్రవారం సాయంత్రం అప్రూవర్‌గా మారిన ఎంపీ.. ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులకు కీలక సమాచారం అందించారు. నిజంగా ఇది ఊహించని పరిణామామేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే.. ఇప్పటి వరకూ అప్రూవర్‌గా మారిన వారిలో ఎక్కువ మంది సౌత్ గ్రూప్‌నకు సంబంధించిన వారే కావడం గమనార్హం. ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న ఇండో స్పిరిట్ కంపెనీలో కీలక భాగస్వామ్యం మాగుంటదే. అయితే.. అప్రూవర్‌గా మారిన మాగంటి ఈడీకి ఏమేం సమాచారం ఇచ్చారు..? ఎవరెవరి గురించి చెప్పారు..? అని సౌత్‌గ్రూప్ సభ్యులు, ఈ కేసులో ఆరోపణలు, విచారణలు ఎదుర్కొన్న వ్యక్తుల్లో టెన్షన్ మొదలైందట.
అందరూ సౌత్ గ్రూప్ వాళ్లే..?
కాగా.. ఇప్పటికే ఈ కేసులో ఎంపీ కుమారుడు రాఘవ రెడ్డి (Magunta Raghava Reddy) అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు శరత్ చంద్రారెడ్డి రెడ్డి కూడా అప్రూవర్‌గా మారారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ బెయిల్‌పైన బయటికొచ్చి ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి, రాఘవ రెడ్డి, శరత్ చంద్రారెడ్డిలు ఇచ్చిన సమాచారం ఆధారంగా అనేక మందిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా.. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నగదు బదిలీలపై ప్రధానంగా ఈడీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఫిబ్రవరి-10న రాఘవను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సౌత్ గ్రూప్‌లో కీలక పాత్రధారిగా రాఘవను ఈడీ పేర్కొంది. ఢిల్లీలో పలు జోన్లకు రాఘవ ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ ఆరోపించింది.
అసలు సినిమా అప్పుడే..?
ఢిల్లీలో ప్రారంభమైన జీ-20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit) ముగిశాక లిక్కర్ కేసులో అసలు కథ ప్రారంభం అవుతుందని దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ (ED, CBI) అంటున్నాయి. ప్రస్తుతం దర్యాప్తు సబ్దుగా ఉన్నట్లు కనిపిస్తున్నా అంతర్గతంగా జరగాల్సింది జరుగుతోందని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ (Delhi CM Kejriwal) టార్గెట్‌గా దూకుడు పెరుగుతుందని, తెలంగాణాకు (Telangana) సంబంధించి కీలక వ్యవహారాలు తెరమీదకు రానున్నాయని దర్యాప్తు సంస్థల వర్గాలు వెల్లడిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తెలంగాణాకు చెందిన ఓ కీలక నేతకు ఢిల్లీలో అత్యంత సన్నిహితంగా మెలిగే వ్యక్తిని ప్రశ్నంచి రాతపూర్వకంగా అన్ని వివరాలను ఈడీ అధికారులు రాబట్టినట్టి తెలిసింది. తెలంగాణాలో ప్రత్యేకించి హైదరాబాద్‌లో (Hyderabad) అక్రమ నగదు బదిలీల వ్యవహారాలపై ఈడీ దృష్టి పెట్టింది. మరోవైపు.. గత కొన్ని రోజులుగా హవాలా వ్యవహారాలు నడిపే 20 మందికి పైగా కీలక వ్యక్తులను పిలిపించి ఈడీ ప్రశ్నించింది.
ఇప్పటికే ఇలా..?
లిక్కర్ కేసును వీలైనంత త్వరలో కొలిక్కి తీసుకుని రవాలని భావిస్తున్న దర్యాప్తు సంస్థలు విచారణలో వేగం పెంచాయి. ఈ కేసులో తెలంగాణకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్, సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును మరోసారి ఈడీ (Enforcement Directorate) విచారించింది. ఆడిటర్ బుచ్చిబాబును (Auditor Buchibabu) బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 6.15 గంటల వరకూ ఈడీ అధికారులు విచారించారు. కాగా.. ఈ కేసు విచారణలో బుచ్చిబాబు వాంగ్మూలం అత్యంత కీలకంగా మారబోతోందని నిపుణులు చెబుతున్నారు. గత వారంలో ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురు తెలుగువారిని పిలిపించి ఈడీ ప్రశ్నించిన విషయం విదితమే. బుచ్చిబాబు తర్వాత ఈడీ ఎవర్ని విచారణకు పిలుస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కచ్చితంగా అతి త్వరలోనే కవితకు (BRS MLC Kavitha) ఈడీ నుంచి నోటీసులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే.. రాబోయే రోజుల్లో కీలక వ్యక్తులను ఈడీ ప్రశ్నించనున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.