VIZAG TDP vs YCP: టీడీపీలో దక్కినట్లుగా వైసీపీలో దక్కని ప్రాధాన్యం..ఆలోచనలో పడ్డ MLA వాసుపల్లి..!

ABN , First Publish Date - 2023-02-25T12:35:47+05:30 IST

విశాఖలో వైసీపీ పాలిటిక్స్‌ ఆసక్తిగా మారుతున్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌కు కష్టాలు తప్పడంలేదు. నిజానికి.. విశాఖ జిల్లాలో గణేశ్‌ గురించి ...

VIZAG TDP vs YCP: టీడీపీలో దక్కినట్లుగా వైసీపీలో దక్కని ప్రాధాన్యం..ఆలోచనలో పడ్డ MLA వాసుపల్లి..!

విశాఖ సిటీలో ఆ ఎమ్మెల్యేకి కష్టాలు పెరుగుతున్నాయా?.. తగ్గుతున్నాయా?.. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఆయనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదా?.. నాడు విజయసాయిరెడ్డి పక్కనబెడితే.. నేడు వైవీ సుబ్బారెడ్డి అక్కున చేర్చుకుంటున్నారా?.. గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన.. ఇప్పుడు జోష్‌లో మునిగితేలుతున్నారా?.. ఇంతకీ.. ఎవరా ఎమ్మెల్యే?.. ఆయన.. ఇప్పుడెందుకు ఖుషీ అవుతున్నారు?..మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-2745.jpg

విశాఖలోని ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు వైసీపీ గాలం

విశాఖలో వైసీపీ పాలిటిక్స్‌ ఆసక్తిగా మారుతున్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌కు కష్టాలు తప్పడంలేదు. నిజానికి.. విశాఖ జిల్లాలో గణేశ్‌ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. విశాఖ నగరంలో ఎక్కడున్నా.. తన మార్క్‌ చూపిస్తుంటారు. అందుకోసం.. గణేశ్‌ ఓ పంథాను ఎంచుకుంటారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస్‌పై వాసుప‌ల్లి గ‌ణేశ్‌ టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే.. జీవీఎంసీ ఎన్నికల ముందు విశాఖ నగరంలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ వైసీపీ గాలం వేసింది. ఆ క్రమంలో.. కుమారుల‌కు పార్టీ కండువా వేయించి, టీడీపీ నుండి వైసీపీలోకి వెళ్లారు.

Untitled-2944.jpg

వైసీపీలో ప్రాధాన్యం దక్కకపోవడంతో ఆలోచన

ఇదిలావుంటే... కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న గణేశ్‌.. ఆ తర్వాత వైసీపీ కండువా వేసుకుని, టీడీపీపై.. ఆ పార్టీ నేతలపై రాజకీయంగానే కాదు.. వ్యక్తిగతంగానూ విమర్శలు గుప్పించారు. కానీ.. క్రమంగా ఆయనలో మార్పులు మొదలయ్యాయి. టీడీపీలో దక్కినంతగా.. వైసీపీలో ప్రాధాన్యం దక్కకపోవడంతో ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. రాజకీయంగా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో.. ఆయన తిరిగి టీడీపీ గూటికి చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే ఉహాగానాలు మొదలయ్యాయి. అదే సమయంలో.. విజయసాయిరెడ్డిపై పరోక్షంగా విమర్శలు కూడా చేశారు.

Untitled-3154.jpg

అంతేకాదు.. నియోజకవర్గంలో ఆయనకు విపక్షం కన్నా.. అధికారపక్షం నుండే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, ఇండిపెండెంట్‌లుగా గెలిచి వైసీపీలో చేరిన కార్పొరేటర్లు, మాజీ ఎమ్మెల్యే రెహామాన్, మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్‌ కోలా గురువులు.. ఇలా.. సొంత పార్టీలోనే.. చాలా మంది నేతలు.. వాసుపల్లి గణేశ్‌కు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. ఆయన మాటకు అధికారులు కూడా విలువ ఇవ్వడం లేదంటే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గణేశ్‌ పరిస్థితి ఎంటో అర్థం చేసుకోవచ్చు.

Untitled-3055.jpg

ఆశావహుల్లో ఇద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం

మరోవైపు... ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా విజయసాయిరెడ్డిని తొలగించి, ఆయన స్థానంలో వైవీ సుబ్బారెడ్డిని నియమించింది. అప్పటినుండి వాసుపల్లిపై వ్యతిరేకత ఉన్నప్పటికీ బయటకు పొక్కకుండా ఆయనకు వైవీ సుబ్బారెడ్డి కాపు కాశారని ప్రచారం జరుగుతోంది. విజయసాయిరెడ్డి వర్గం బలం తగ్గించడం కోసమో.. వైవీ సుబ్బారెడ్డి.. తన బలాన్ని పెంచుకోవడం కోసమో ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దాంతోపాటు.. అనధికారిక ఎమ్మెల్యేగా.. వాసుపల్లికి పోటీగా ఉన్న సీతంరాజు సుధాకర్‌ను పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయనకు లైన్‌క్లియర్ అయిందనుకున్నారు. మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న కోలా గురువులు కూడా ఎమ్మెల్యే సీటు ఆశించడంతో.. ఆయనకు నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ కట్టబెట్టడం ఇంకాస్త ఊరటనిచ్చింది. తద్వారా.. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని ఆశావహుల్లో ఇద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించినట్లు అయింది. అలాగే.. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వ్యవహరించిన ఓ కార్పొరేటర్ జనసేనలో చేరిపోవడం ప్లస్‌ అయింది.

Untitled-2854.jpg

ఓడితే మాత్రం ఎమ్మెల్యే టిక్కెట్‌కు పోటీ వస్తారు!

ఇక.. వ్యతిరేకంగా ఉన్నవారు, టిక్కెట్‌ పోటీదారులు క్రమంగా తగ్గిపోతుండడం, వైవీ సుబ్బారెడ్డి ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో వాసుపల్లి గణేశ్‌ ఆనందంలో మునిగితేలుతున్నారు. అందరికీ.. రకరకాల అవకాశాలు ఇవ్వడంతో.. ఇకపై.. ఎమ్మెల్యే టిక్కెట్‌ ఊసెత్తరని, అధిష్టానం కూడా అంగీకరించదనే ఆలోచనలో ఉన్నారు. అయితే.. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ పోటీలో ఉన్న సుధాకర్, వ్యక్తిగతంగా గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తున్నారు. కానీ.. వైసీపీ పుణ్యమా అని గెలుపు కష్టమే అన్న టాక్‌ వినిపిస్తోంది. ఆయన ఓటమి చెందితే మాత్రం.. ఎమ్మెల్యే టిక్కెట్‌కు మళ్లీ పోటీ వస్తారని వైసీపీ వర్గాలే అంటున్నాయి. దాంతోపాటు.. మాజీ ఎమ్మెల్యే రెహమాన్, వాసుపల్లికి మధ్య ఎప్పటినుండో కోల్డ్ వార్ నడుస్తుండడం ఇబ్బంది మారుతోంది. మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్‌తోపాటు.. గ్రంధాలయ చైర్మన్, కొంతమంది కార్పొరేటర్లు కూడా గణేశ్‌కు వ్యతిరేకంగా ఉన్నారు.

Untitled-3254.jpg

మొత్తంగా.. విశాఖ సౌత్‌ నియోజకవర్గంలో వాసుపల్లి గణేశ్‌కి వరుస కష్టాలు మాత్రం తప్పడంలేదు. ప్రధాన పోటీదారులైన ఇద్దరితో ఇబ్బందులు తొలిగి పోతాయనుకుంటే.. మళ్లీ కొత్తగా పోటీదారులు లైన్‌లోకి వస్తుండడం మైనస్‌ అవుతోంది. అయితే.. ఎన్ని ఇబ్బందులున్నా.. గణేశ్‌.. కూల్‌గా వ్యవహరిస్తుండడం వెనకున్న ఆంతర్యమేంటో అర్థం కాక వైసీపీ తలలు పట్టుకుంటున్నారు. అందుకే.. గణేశ్‌.. పైకి నవ్వుతున్నప్పటికీ.. లోలోన మాత్రం టెన్షన్‌ పడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. రాబోయే ఎన్నికల నాటికి.. విశాఖ సౌత్‌లో గణేశ్‌ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి...

Updated Date - 2023-02-25T12:43:27+05:30 IST