Train Accident: ఈ కుర్రాడిది అదృష్టమో..? లేక దురదృష్టమో..? సరిగ్గా ఏడాది క్రితమే పెళ్లయింది కానీ..!
ABN , First Publish Date - 2023-06-05T17:50:00+05:30 IST
ఒడిశా రైలు ప్రమాదం ఎందరికో కన్నీళ్లు మిగిల్చింది. మరికొందరి జీవితాల్లో చీకటి మిగిల్చింది. ఇలా ఎవర్నీ కదిలించినా అంతులేని
ఒడిశా రైలు ప్రమాదం (odisha train acciden)ఎందరికో కన్నీళ్లు మిగిల్చింది. మరికొందరి జీవితాల్లో చీకటి మిగిల్చింది. ఇలా ఎవర్నీ కదిలించినా అంతులేని గాధలున్నాయి. కొందరు అదే ట్రైన్లో ప్రయాణించాల్సి ఉండగా.. చివరి నిమిషంలో క్యాన్సిల్ అయి ప్రాణాలతో బయటపడగా.. మరికొందరు ఆప్తులను కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
గౌతమ్ దాస్ (Gautam Das) అనే యువకుడి గాధ కూడా కన్నీరు తెప్పిస్తోంది. తృటిలో అతడు ప్రమాదం నుంచీ తప్పించుకున్న.. భార్యతో పాటు అయిన వారిని కోల్పోయి ఒంటరి వాడయ్యాడు. అతడి ఆవేదన అందర్నీ కంటతడి పెట్టిస్తోంది.
గౌతమ్ దాస్ భార్య విష్ణుప్రియదాస్ (22) ఇటీవలే కటక్‌లోని ఓ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకుంది. మరోసారి తదుపరి వైద్యం కోసం ఆమె తల్లితో పాటు సోదరుడు హిమాన్ష్దాస్తో కలిసి కటక్ వెళ్లేందుకు బాలేశ్వర్‌లో (Baleshwar) కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ (coromandel express) ఎక్కారు. వారితో పాటే అదే రైలులో గౌతమ్ దాస్ కూడా ప్రయాణం చేయాల్సి ఉంది. అతడు కూడా అదే ట్రైన్‌కి టికెట్ కూడా తీసుకున్నాడు. కానీ చివరి నిమిషంలో అతడు ఆగిపోవల్సి వచ్చింది. అలా ప్రాణాలతో బయటపడ్డాడు.
గౌతమ్ దాస్‌కి అత్యవసర పని పడటంతో బాలేశ్వర్లోనే నిలిచిపోయాడు. ఆ తర్వాత వచ్చే రైల్లో కటక్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కానీ ఇంతలోనే జరగరాని ఘోరం జరిగిపోయింది. తన భార్య ప్రయాణం చేస్తున్న రైలు ప్రమాదానికి గురైందని తెలిసి భయాందోళన చెందాడు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బాలేశ్వర్ నుంచి బయల్దేరిన అరగంట వ్యవధిలోనే ప్రమాదానికి గురైందన్న సమాచారం అందటంతో ఆందోళనకు గురైన గౌతమ్ దాస్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ అప్పటికే అతని భార్య, అత్త, బావమరిది ముగ్గురూ విగతజీవులుగా కనిపించడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆదివారం ఆ ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని అంత్యక్రియలు నిర్వహించాడు. గౌతమ్ దాస్‌కు వివాహమై ఇటీవలే ఏడాది పూర్తయ్యింది. ఇంతలోనే భార్యను కోల్పోవడంతో ఆయన రోదిస్తున్న తీరు అక్కడున్న వారందరికీ కన్నీటిని తెప్పించింది.