అప్పుచేసి ఎడిటింగ్ నేర్చుకుని.. 7ఏళ్ళు ఉద్యోగం కోసం కాళ్శరిగేలా తిరిగాడు.. ఇప్పుడు ఆస్కార్ అవార్డ్ లో భాగమయ్యాడు..

ABN , First Publish Date - 2023-03-14T13:17:53+05:30 IST

ముక్కలు ముక్కలుగా ఉన్న అద్దం ముక్కలను తిరిగి అద్దంలా అతికించడం వంటిది ఎడిటింగ్ అంటే..

అప్పుచేసి ఎడిటింగ్ నేర్చుకుని.. 7ఏళ్ళు ఉద్యోగం కోసం కాళ్శరిగేలా తిరిగాడు..  ఇప్పుడు ఆస్కార్ అవార్డ్ లో భాగమయ్యాడు..

సినిమా తీయడం వేరు, దాన్ని ఒక ఫ్రేమ్ లో బందించడం వేరు. ముక్కలు ముక్కలుగా ఉన్న అద్దం ముక్కలను తిరిగి అద్దంలా అతికించడం వంటిది ఎడిటింగ్ అంటే.. అలాంటి ఎడిటింగ్ నే వృత్తిగా ఎంచుకుని కష్టపడ్డాడు అతను. అప్పు చేసి ఎడిటింగ్ నేర్చుకుని, 7ఏళ్ళు ఉద్యోగం కోసం కాళ్ళరిగేలా తిరిగాడు. రోజుకు 16గంటలు పనిచేసి ప్రపంచ సినిమా గర్వంగా ఫీలయ్యే ఆస్కార్ అవార్డ్ భారతదేశానికి తేవడంలో భాగమయ్యాడు. ప్రపంచం యావత్తు నాటు నాటు అని అరుస్తుంటే.. సైలెంట్ గా భారతదేశానికి ఆస్కార్ పట్టుకొచ్చిన The Elephant Whisperers అసోసియేట్ ఎడిటర్(Associate Editor) ఏకేశ్వర్ గురించి తెలుసుకుంటే ఎమోషన్ అవ్వడం పక్కా.. ఈయన గురించి వివరాల్లోకి వెళితే..

ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం మీరట్(Meerut) ఢిల్లీ రోడ్డులో ఐఆర్ఏ కాలనీలో ఏకేశ్వర్ కుటుంబం నివసిస్తోంది. ఈయన తండ్రి రైతు, తల్లి టీచర్. ఏకేశ్వర్ తల్లి కుటుంబ విషయాలన్ననీ చూసుకుంటుంది. ఏకేశ్వర్ మీరట్ లోని ట్రాన్స్ లెమ్ అకాడమీ(Translam Academy) లో ఆర్ట్స్ గ్రూప్ లో ఇంటర్ పూర్తి చేశాడు. ఇండోర్(Indore) లో గ్రాడ్యుయేషన్ చేశాడు. ఎంబియే(MBA) చేసి మంచి ఉద్యోగం చూసుకోవాలని అనుకున్నాడు కానీ అతనికి మీడియా మీద, రచనల మీద ఉన్న ఆసక్తి కారణంగా అటువైపు వెళ్ళలేదు. ఆ ఆసక్తితోనే మొదట్లో కొన్ని ఫోటోస్, వీడియోస్ ఎడిట్ చేసేవాడు. ఆ తరువాత సినిమా రంగంలోకి వెళ్ళాలని అనుకున్నాడు. కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయినా అతని తండ్రి మద్దతు ఇచ్చాడు. దీంతో ముంబైకి వెళ్ళి సినిమా రంగంలో ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7ఏళ్ళు సరైన ఉద్యోగం లేకుండా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కుటుంబ సభ్యుల దగ్గర ఎప్పుడూ చెయ్యి చాపలేదు.

ఈ క్రమంలోనే సినిమా రంగంలోకి వెళ్ళాలంటే తనకున్న ట్యాలెంట్, తనలో ఉన్న నైపుణ్యం సినిమా రంగానికి సరిపోదని అర్థం చేసుకున్నాడు.మంచి ఇన్స్టిట్యూట్ లో ఎడిటింగ్ నేర్చుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ముంబైలోని సుభాష్ ఘాయ్ ఇన్స్టిట్యూట్(Subhash Ghai Institute) లో ఎడిటింగ్ కోర్స్ చేయాలనే ఆలోచన వచ్చింది. కానీ ఆర్థిక స్తోమత సహకరించలేదు. అతని నిర్ణయం విన్న కుటుంబ సభ్యులు భయపడ్డారు. కారణమేంటంటే.. అక్కడ ఎడిటింగ్ కోర్సు చెయ్యాలంటే 16లక్షలు ఖర్చవుతుంది. ఆర్థిక స్థోమత సరిగా లేని కుటుంబం 16లక్షలంటే కళ్లు తేలేసింది. తల్లి అయితే అంత పెద్ద ప్రయత్నాలు ఎందుకని చెప్పింది. కానీ ఏకేశ్వర్ తండ్రి అతనికి మద్దతుగా నిలిచాడు. దీంతో 16లక్షలు అప్పు చేసి ఎడిటింగ్ లో క్రియేటివ్ డైరెక్టర్ కోర్సు(Editing in Creative Director)లో అడ్మిషన్ తీసుకున్నాడు. అంత అప్పు తీసుకుని కొడుకు కోర్స్ చేస్తున్నాడని సంతోషించాలో.. లేక అది సక్సెస్ కాకపోతే ఆ అప్పు తీర్చేదారి ఎలా అని బాధపడాలో కుటుంబ సభ్యులకు అర్థం కాలేదు. ఏకేశ్వర్ మాత్రం మూడేళ్ళ కోర్స్ విజయవంతంగా పూర్తి చేశాడు. సొంతంగా ఒక సినిమా తీయడంతో పాటు, కొన్ని ప్రాజెక్ట్ లు కూడా చేశాడు.

ఏకేశ్వర్ కు అడవి, పువ్వులు, ఆకులు, నీరుతో కూడిన పచ్చని ప్రకృతి ప్రదేశాలంటే చాలా ఇష్టం. ఈక్రమంలో The Elephant Whisperers కు పనిచేసే అవకాశం వచ్చింది. ఏనుగు చుట్టూ ప్రకృతి మధ్య సాగే ఈ డాక్యుమెంటరీ ఎడిటింగ్ లో ఇతను లీనమైపోయేవాడు. రోజుకు 16గంటలు ఎడిటింగ్ కోసం పనిచేసేవాడు. కుటుంబాన్ని కలిస్తే పని పరంగా తనకు మైండ్ డైవర్ట్ అవుతుందని కుటుంబాన్ని కలవడానికి కూడా వెళ్ళలేదు. ఇతని కష్టం ఫలితంగా ఈ చిన్నచిత్రం చిత్రమే చేసింది. ఈ సినిమా టాప్ 5లోకి వెళ్ళినప్పటినుండి టీమ్ మొత్తం ఒత్తిడి అనుభవించిందని చెప్పుకొచ్చారు. చివరికి ఆస్కార్ వేడుక కోసం లాస్ ఏంజిల్స్ వెళ్ళాల్సి వచ్చినా ఈయనకు వీసా సమస్య కారణంగా వెళ్లడానికి కుదరలేదు. తన చేతులతో ఆస్కార్ అందుకోలేక పోయానని కొంచెం బాధపడినా తన కష్టానికి తగిన ఫలితం లభించిందని సంతోషం వ్యక్తం చేశాడు. ఒకప్పటి ఈ కామన్ మ్యాన్ ఇప్పుడు ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు.

Read also: అమ్మాయికి ఇంటర్లో తక్కువ మార్కులొచ్చాయి నాకు ఈ పెళ్ళొద్దంటూ గొడవకు దిగిన వరుడు.. ఆరా తీస్తే బయటపడిన నిజం ఇదీ..


Updated Date - 2023-03-14T13:17:53+05:30 IST