Reynolds 045 Ball Pen: ఎందుకు బ్రో.. ఇలా ఎమోషన్స్‌తో ఆడుకుంటారు.. ఒక్క పోస్ట్‌తో 90s Kids ఎంత బాధపడ్డారో..!

ABN , First Publish Date - 2023-08-26T15:20:05+05:30 IST

రెనాల్డ్స్ 045 బాల్ పెన్ తయారీని సదరు సంస్థ నిలిపివేస్తుందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయింది. ఆ పోస్ట్ చూసినవాళ్లంతా ఆ పెన్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ట్విటర్ సాక్షిగా ఆవేదనను వెలిబుచ్చారు. రెనాల్డ్స్ 045 పెన్ ఇక కనుమరుగవుతోందన్న ఆ పోస్ట్ చూసి ‘90s kids’ బాధపడ్డారు. తమ స్కూల్ డేస్‌ను, ఆ పెన్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ట్విటర్‌లో పోస్టుల వర్షం కురిపించారు.

Reynolds 045 Ball Pen: ఎందుకు బ్రో.. ఇలా ఎమోషన్స్‌తో ఆడుకుంటారు.. ఒక్క పోస్ట్‌తో 90s Kids ఎంత బాధపడ్డారో..!

ప్రతీ మనిషి జీవితంలో స్కూల్ డేస్‌ ఎంతో అపురూపమైనవి. బోలెడన్ని జ్ఞాపకాలు పోగేసుకునే రోజులవి. స్వార్థం అంటే ఏంటో అర్థం కూడా తెలియని ఆ వయసులో తోటి స్నేహితులపైనే కాదు కొన్ని వస్తువులపై కూడా మక్కువ పెంచుకుంటుంటాం. అలాంటి వాటిల్లో నటరాజ్ పెన్సిల్, అప్సర పెన్సిల్, రెనాల్డ్స్ పెన్ లాంటివి విద్యార్థి జీవితంలో తప్పకుండా ఉంటాయి. జీవితంలో ఒక స్థాయికి వచ్చాక ఆ వస్తువులు కనిపిస్తే ఆ స్కూల్ డేస్ కచ్చితంగా కళ్ల ముందు మెదులుతాయి. ఎందుకంటే.. అవి కేవలం వస్తువులు మాత్రమే కాదు ఒక ఎమోషన్. విద్యార్థి దశలో అలాంటి భావోద్వేగ బంధం పెనవేసుకున్న వాటిల్లో రెనాల్డ్స్ పెన్ కూడా ఒకటి. అంతటి ఎమోషనల్ బాండింగ్ ముడిపడి ఉన్న ఆ రెనాల్డ్స్ 045 బాల్ పెన్ తయారీని సదరు సంస్థ నిలిపివేస్తుందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయింది. ఆ పోస్ట్ చూసినవాళ్లంతా ఆ పెన్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ట్విటర్ సాక్షిగా ఆవేదనను వెలిబుచ్చారు. రెనాల్డ్స్ 045 పెన్ ఇక కనుమరుగవుతోందన్న ఆ పోస్ట్ చూసి ‘90s kids’ బాధపడ్డారు. తమ స్కూల్ డేస్‌ను, ఆ పెన్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ట్విటర్‌లో పోస్టుల వర్షం కురిపించారు.


90skid అనే ట్విటర్ పేజ్‌లో Reynolds 045 Fine Carbure will no longer be available in market, end of an era..💔 అని ఒక పోస్ట్ కనిపించింది. లక్ష మందికి పైగా ఫాలోవర్స్‌ ఉన్న ఆ పేజ్‌లో పెట్టిన ఈ పోస్ట్‌కు ఇప్పటిదాకా 2.7 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే 90s Kids ఈ పోస్ట్‌కు ఎలా కనెక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. 5,719 Reposts, 1,128 Quotes, 52.7K Likes, 1,269 Bookmarks. ఆ పోస్ట్ సృష్టించిన పెను దుమారం ఇది. ఈ పెన్‌ను ఇప్పటికీ సెంటిమెంట్‌గా భావించే కొందరైతే ఇక దొరకదేమోనని ఆందోళన చెంది ఏకంగా ఆన్‌లైన్‌లో గంపగుత్తగా ఆర్డర్ పెట్టేశారు.

కానీ.. ఫ్యాక్ట్ చెక్‌లో తెలిసిందేంటంటే.. రెనాల్డ్ 045 పెన్ తయారీని నిలిపివేస్తున్నట్లు వచ్చిన వార్తలు కేవలం పుకార్లు మాత్రమే. ఇందులో ఎలాంటి నిజం లేదని రెనాల్డ్స్ కంపెనీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టి మరీ స్పష్టం చేసింది. ఇది కేవలం తప్పుదోవ పట్టించే పుకారే తప్ప ఇందులో ఏమాత్రం నిజం లేదని పేర్కొంది. 45 సంవత్సరాలుగా ఇండియన్ మార్కెట్‌లో తమ ఉత్పత్తులను ఆదరిస్తున్నారని, ఈ ప్రోత్సాహంతో మరింత మెరుగైన వస్తువులను అందించేందుకు కృషి చేస్తామని రెనాల్డ్స్ కంపెనీ పోస్ట్ చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. రెనాల్డ్స్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఈ పెన్ ఏడు రూపాయలకు అందుబాటులో ఉంది. రెనాల్డ్స్ 045 పెన్ 1990ల్లో పుట్టిన వారి స్టూడెంట్ లైఫ్‌లో ఏ స్థాయి ముద్ర వేసుకుందో ఈ ట్విటర్ పోస్ట్‌ల్లో ఒక్కసారి చూసేయండి.

Updated Date - 2023-08-26T15:26:52+05:30 IST