Rs2000: రెండు వేల నోటు చెల్లదా?.. జనాల్లో అయోమయం!

ABN , First Publish Date - 2023-02-14T21:31:47+05:30 IST

‘‘ రూ.2000 నోట్లు తీసుకోబడవ్’’ అంటూ హైదరాబాద్‌‌లోని (Hyderabad) ఇందిరాపార్క్ ఏరియాలో ఫేమస్ అయిన ‘ప్రమద’ (pramada) అనే స్వీట్ షాప్ పేపర్ నోటీస్ అంటించడం చర్చనీయాంశమైంది.

Rs2000: రెండు వేల నోటు చెల్లదా?.. జనాల్లో అయోమయం!

ఔను..! రూ.2000 నోటు (RS. 2000 note) చెల్లదా?. ఈ నోటును స్వీకరించొద్దని దుకాణదారులు భావిస్తున్నారా? అప్రకటిత నిషేధం ఏమైనా కొనసాగుతోందా? చలామణిలో ఉన్న పెద్ద నోటుపై ఈ మేరకు జనాల్లో అమోమయం నెలకొందా? ఆర్థిక లావాదేవీల్లో ఈ నోటు పెద్దగా కనిపించకపోవడానికి కారణాలేమిటి? కనీసం బ్యాంకులు, ఏటీఎంల్లోనైనా ఎందుకు దర్శనమివ్వడం లేదు!?.. మరి కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐల వైఖరి ఏమిటి?.. ‘‘ రూ.2000 నోట్లు తీసుకోబడవ్’’ అంటూ హైదరాబాద్‌‌లోని (Hyderabad) ఇందిరాపార్క్ ఏరియాలో ఫేమస్ అయిన ‘ప్రమద’ (pramada) అనే స్వీట్ షాప్ పేపర్ నోటీస్ అంటించడం ఈ సందేహాలకు కారణమైంది. ‘‘ ప్రస్తుతానికి మేము రూ.2000 నోట్లు తీసుకోవడం లేదు’’ అని రాసుకొచ్చింది. పోనీ కారణం ఏంటని అడిగితే కనీసం సమాధానం కూడా చెప్పలేదు. ఏదో చిన్నాచితకా షాప్ ఇలాంటి బోర్డ్ పెట్టిందంటే అవగాహన లేదేమోనని భావించవచ్చు. కానీ ఓ ఫేమస్ షాప్ ఇలా వ్యవహరించడంతో మరోసారి రెండు వేల నోటు చెలామణీ, చెల్లుబాటు అంశాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో రూ.2000 నోటుకు సంబంధించిన పరిణామాలను ఒకసారి గమనిద్దాం..

Untitled-6.jpg

అంతా అమోమయం!

త్వరలోనే రూ.2000 నోటు రద్దవ్వబోతోందంటూ కొంతకాలం ప్రచారం జరిగింది. ఈ దిశ కేంద్రప్రభుత్వం అడుగులు వేస్తోందంటూ మీడియాతోపాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పైనా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్టు బ్యాంకులు, ఏటీఎంలు సహా ఎక్కడా ఈ నోటు చెలామణీలో కనిపించకపోవడంతో జనాల్లో గందరగోళం నెలకొంది. ఇటు ఆర్బీఐ.. అటు కేంద్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రకటనా చేయకపోయినప్పటికీ నోట్లు కనుమరుగవ్వడం ఈ సందేహాలను మరింత పెంచింది. వాస్తవానికి రూ.2000 నోటు ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇదే విధమైన గందరగోళం నెలకొంది. 2016లో పెద్దనోట్ల రద్దులో (demonitisation) భాగంగా పాత రూ.1000, రూ.500 నోట్ల రద్దవ్వగా... కొత్తగా రూ.2000 నోటును కేంద్రం తీసుకొచ్చింది. అయితే రూ.1000 నోటును రద్దు చేసి రెట్టింపు వ్యాల్యూ కలిగిన రూ.2 వేల నోటు ప్రవేశపెట్టడంతో అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. పలువురు రాజకీయ, ఆర్థికరంగ నిపుణులు ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇక నోట్లు చెలామణీలోకి వచ్చాక కూడా అవినీతికి ఆజ్యం పోస్తున్నాయనే విమర్శలు వచ్చాయి. స్వయానా బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ ఈ అంశాన్ని రాజ్యసభ సాక్షిగా కేంద్రానికి సూచన చేశారు. ‘‘రూ.2 వేల నోటు బ్లాక్‌ మనీకి పర్యాయపదంగా మారింది. మెల్లమెల్లగా చలామణీ నుంచి తొలగించాలి’’ అని అన్నారు. ఈ పరిణామాలన్ని రూ.2000 నోటుపై జనాల్లో గందరగోళాన్ని పెంచుతూనే ఉన్నాయి. ఈ పర్యవసనాలు ఇటు జనాలతోపాటు దుకాణదారుల్లోనూ అనుమానాలు పెంచాయి.

ఆర్బీఐ, కేంద్రం ఏం చెబుతున్నాయ్..

వాస్తవిక పరిస్థితులా లేక విమర్శలా కారణం ఏంటో తెలియదు గానీ దాదాపు మూడునాలుగేళ్లుగా కొత్తగా రూ.2000 నోట్ల ముద్రణ నిలిచిపోయింది. 2019-2022 మధ్య కొత్త నోట్లు ముద్రించలేదని నవంబర్ 2022లో ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తికి ఆర్బీఐ సమాధానం ఇచ్చింది. అయితే ఏటీఎంలలో ఈ నోట్లు లోడ్ చేయడంలేదని అందులో పేర్కొనలేదు. ఇక చెలామణీలో ఉన్న నోట్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయిందని ఆర్థిక శాఖా సహాయమంత్రిగా ఉన్నప్పుడు అనురాగ్ థాకూర్ పార్లమెంట్‌కు సమాధానం ఇచ్చారు. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా ఎన్ని నోట్లు ముద్రించాలనేది ఆర్బీఐని సంప్రదించి కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఈ మేరకు ఓ చట్టసభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా... అధికారికంగా ఎలాంటి నిషేధం, ఆంక్షలు, ఆదేశాలు లేకపోయినా రూ.2000 నోట్లు కనుమరుగవ్వడంతో జనాల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్వీట్ షాప్ ‘ప్రమద’లో బోర్డ్‌ ఏర్పాటుకు కూడా ఈ పరిస్థితులే కారణమయ్యాయి. ఈ నోటుపై కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐల సమాలోచనలు ఏవిధంగా ఉన్నా జనాలకు స్పష్టత ఇవ్వడ చాలా ముఖ్యం. మరి రెండు వేల నోటుపై కేంద్రం లేదా ఆర్బీఐ ఎప్పటికి స్పందిస్తాయో ఎలాంటి క్లారిటీ ఇస్తాయో వేచిచూడాల్సిందే.

Updated Date - 2023-02-14T21:40:50+05:30 IST