Asia Cup 2023: ఛీ.. ఇలా జరిగిందేటి.. భారత్ vs పాకిస్థాన్‌ మ్యాచ్‌పై బ్యాడ్ న్యూస్ !

ABN , First Publish Date - 2023-09-02T22:09:08+05:30 IST

అనుకున్నదే జరిగింది. ఆసియా కప్ 2023లో భాగంగా భారత్ vs పాకిస్థాన్ మధ్య జరిగిన హవోల్టేజ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.

Asia Cup 2023: ఛీ.. ఇలా జరిగిందేటి.. భారత్ vs పాకిస్థాన్‌ మ్యాచ్‌పై బ్యాడ్ న్యూస్ !

కాండీ: అనుకున్నదే జరిగింది. ఆసియా కప్ 2023లో భాగంగా భారత్ vs పాకిస్థాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. మ్యాచ్ ఆరంభం నుంచి అతిథిలా వస్తూ పోతూ ఉన్న వరుణుడు.. భారత్ ఇన్నింగ్స్ తర్వాత ఎంతకీ ఆగలేదు. దీంతో చేసేదేమి లేక మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. చివరి వరకు హోరాహోరీగా జరుగుతుందనుకున్న మ్యాచ్ రద్దు కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో రెండు జట్లకు చెరో పాయింట్ దక్కింది. కాగా ఇప్పటికే తమ మొదటి మ్యాచ్‌‌లో నేపాల్‌పై నెగ్గిన పాకిస్థాన్ సూపర్ 4లో అడుగుపెట్టింది. ఇక టీమిండియా సూపర్ 4 చేరాలంటే ఈ నెల 4న నేపాల్‌తో జరగనున్న మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించిన కాసేపటికే వర్షం రావడంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 4 ఓవర్లలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. ఆ కాసేటికే వర్షం తగ్గడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. అయితే వర్షం తర్వాత పిచ్ బౌలింగ్‌కు అనుకూలించడంతో టీమిండియా వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. పాకిస్థాన్ పేసర్లు షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్ దెబ్బకు భారత జట్టు 66 పరుగులకే టాప్ 4 వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ(11), విరాట్ కోహ్లీ(4) దారుణంగా విఫలమయ్యారు. వీరిద్దరిని పాక్ లెఫ్టార్మ్ పేసర్ షాహీన్ ఆఫ్రిదినే పెవిలియన్ చేర్చాడు. ఇద్దరిని క్లీన్ బౌల్డ్ చేయడం గమనార్హం. ఆ తర్వాత కూడా వర్షం రెండు సార్లు అడ్డుపడింది. ఈ క్రమంలో పాక్ రైట్ హ్యాండ్ పేసర్ హరీస్ రవూఫ్ కూడా చెలరేగడంతో శుభ్‌మన్ గిల్(14), శ్రేయస్ అయ్యర్(10) కూడా తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. పరిస్థితి చూస్తుంటే టీమిండియా తక్కువ స్కోర్‌కే పరిమితం అవుతుందేమో అనిపించింది. ఇలాంటి సమయంలో టీమిండియాను వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. అద్భుతంగా ఆడిన వీరిద్దరు పాక్ బౌలర్ల దూకుడుకు అడ్డుకట్ట వేశారు. పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఆరంభం నుంచే ధాటిగా ఆడారు. ఐదో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వన్డే కెరీర్‌లో ఇషాన్ కిషన్‌కు ఇది 11వ హాఫ్ సెంచరీ కాగా.. హార్దిక్ పాండ్యాకు 7వ హాఫ్ సెంచరీ. హాఫ్ సెంచరీల అనంతరం కిషన్, హార్దిక్ దూకుడుగా ఆడారు. వారి విధ్వంసంకర ఆట తీరుతో జట్టు స్కోర్ 200 దాటింది.

ఈ క్రమంలో ఇద్దరు సెంచరీలు కొట్టేలానే కనిపించారు. అయితే ఈ భాగస్వామ్యాన్ని 38వ ఓవర్ మూడో బంతికి హరీస్ రవూఫ్ విడదీశాడు. 9 ఫోర్లు, 2 సిక్సులతో 81 బంతుల్లో 82 పరుగులు చేసిన కిషన్.. బాబర్ అజామ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 138 పరుగుల అద్భుత భాగస్వామ్యానికి తెరపడింది. ఈ క్రమంలో జడేజాతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లిన హార్దిక్ కూడా సెంచరీ దిశగా పయనించాడు. అయితే షాహీన్ ఆఫ్రిది వేసిన 44వ ఓవర్ మొదటి బంతికి హార్దిక్ పాండ్యా కూడా ఆఘా సల్మాన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 90 బంతులు ఎదుర్కొన్న పాండ్యా 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 87 పరుగులు చేశాడు. దీంతో 239 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. జడేజా(14), శార్దూల్ ఠాకూర్(3) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆ తర్వాత టేలెండర్లు కూడా తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యారు. కుల్దీప్ 4 పరుగులు చేశాడు. అయితే చివర్లో బుమ్రా 3 ఫోర్లు బాదడంతో జట్టు స్కోర్ 260 పరుగులు దాటింది. నసీమ్ షా వేసిన 49వ ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన బుమ్రా.. సల్మాన్‌కు క్యాచ్ ఔటయ్యాడు. దీంతో 48.5 ఓవర్లు బ్యాటింగ్ చేసిన భారత జట్టు 266 పరుగుల వద్ద ఆలౌటైంది. బుమ్రా 16 పరుగులు చేయగా.. సిరాజ్ ఒక పరుగు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పాక్ బౌలర్లలో షాహీన్ ఆఫ్రిది 4 వికెట్లు తీయగా, హరీస్ రవూఫ్, నసీమ్ షా మూడేసి వికెట్లు తీశారు. వికెట్లు మొత్తం పేసర్లే తీయడం గమనార్హం.

Updated Date - 2023-09-02T22:23:47+05:30 IST