Share News

ODI World Cup: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం

ABN , First Publish Date - 2023-11-01T19:42:38+05:30 IST

శనివారం ఇంగ్లండ్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ దూరమయ్యాడు. సరదా కోసం గోల్ఫ్ ఆడేందుకు వెళ్లిన మ్యాక్స్‌వెల్ గాయపడ్డాడు.

ODI World Cup: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం

వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ కోసం తీవ్రంగా కష్టపడుతోంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓడినా తర్వాత హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ రేసులోకి వచ్చింది. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ భీకర ఫామ్‌లో ఉండటం ఆసీస్‌కు ప్లస్ పాయింట్‌గా నిలుస్తోంది. మరోవైపు ఆల్‌రౌండర్‌గా మ్యాక్స్‌వెల్ రాణిస్తుండటం ఆ జట్టుకు బోనస్ అనే చెప్పాలి. అయితే శనివారం ఇంగ్లండ్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు మ్యాక్స్‌వెల్ దూరమయ్యాడు. సరదా కోసం గోల్ఫ్ ఆడేందుకు వెళ్లిన మ్యాక్స్‌వెల్ గాయపడ్డాడు. గోల్ఫ్ కార్ట్‌పై నుంచి అతడు జారి పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మ్యాక్స్‌వెల్ తలకు గాయమైందని.. వైద్యులు కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇటు బ్యాటింగ్‌లోనే కాకుండా అటు బౌలింగ్‌లోనూ మ్యాక్స్‌వెల్ అనూహ్య రీతిలో రాణిస్తున్నాడు.

కాగా మ్యాక్స్‌వెల్ తలకు గాయమైన నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం అతడిని 6 నుంచి 8 రోజుల పాటు మెడికల్ పర్యవేక్షణలో ఉంచనున్నారు. దీంతో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కే కాకుండా నవంబర్ 7న ఆప్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌కు కూడా మ్యాక్స్‌వెల్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాక్స్‌వెల్ స్థానంలో ఆస్ట్రేలియా మార్కస్ స్టోయినీస్ లేదా కామెరూన్ గ్రీన్‌ను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఆస్ట్రేలియాకు ప్రస్తుతం ఒక్కడే స్పిన్నర్ ఉన్నాడు. ఆడం జంపాతో పాటు పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా మ్యాక్స్‌వెల్ రాణిస్తున్నాడు. ఇప్పుడు అతడి గైర్హాజరీలో ట్రావిస్ హెడ్ స్పిన్ బాధ్యతలు పంచుకోవాల్సి ఉంటుంది. న్యూజిలాండ్‌తో జరిగిన గత మ్యాచ్‌తోనే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన ట్రావిస్ హెడ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

Updated Date - 2023-11-01T19:42:38+05:30 IST