Share News

IND vs AUS: ఊచకోత కోసిన టీమిండియా టాపార్డర్.. ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యం

ABN , First Publish Date - 2023-11-26T20:58:53+05:30 IST

తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. టాపార్డర్‌లో యశస్వీ జైస్వాల్ (53)..

IND vs AUS: ఊచకోత కోసిన టీమిండియా టాపార్డర్.. ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యం

తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. టాపార్డర్‌లో యశస్వీ జైస్వాల్ (53), ఇషాన్ కిషన్ (52), రుతురాజ్ గైక్వాడ్ (58) అర్థశతకాలతో ఊచకోత కోయడం.. చివర్లో రింకూ సింగ్ (8 బంతుల్లో 30) మెరుపులు మెరిపించడంతో.. భారత్ ఇంత భారీ స్కోరు చేయగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లు భారత ఆటగాళ్లను ఏమాత్రం నియంత్రించలేకపోయారు. ప్రతి ఒక్కరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. తప్పుడు షాట్లతో భారత ఆటగాళ్లు తమకు తామే వికెట్లు సమర్పించుకున్నారే తప్ప.. ఆస్ట్రేలియా బౌలర్లు కట్టడి చేయలేకపోయారు.


తొలుత భారత ఓపెనర్లు రావడం రావడంతోనే భారీ షాట్లతో ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా.. జైస్వాల్ ఎడాపెడా షాట్లతో ముచ్చెమటలు పట్టించాడు. 25 బంతుల్లోనే అర్థశతకం చేశాడంటే.. ఏ రేంజ్‌లో విజృంభించాడో మీరే అర్థం చేసుకోండి. తానూ ఏం తక్కువ తినలేదన్నట్టు.. ఇషాన్ కిషన్ కూడా చెలరేగి ఆడాడు. చిచ్చరపిడుగులాగా భారీ షాట్లు కొడుతూ, పరుగుల వర్షం కురిపించాడు. ఓవైపు రుతురాజ్ నిదానంగా రాణిస్తుంటే, మరోవైపు ఇషాన్ బౌండరీల మోత మోగించాడు. ఈసారి సూర్యకుమార్ (19) నుంచి భారీ ఇన్నింగ్స్ రాలేదు. చివర్లో వచ్చిన రింకూ సింగ్ మాత్రం.. దుమ్ముదులిపేశాడు. 9 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సుల సహకారంతో 31 పరుగులు చేశాడు. అటు.. తిలక్ వర్మ కూడా ఒక సిక్స్ కొట్టి సత్తా చాటాడు. ఇలా యువ ఆటగాళ్లు చితక్కొట్టడంతో భారత్ 235 పరుగులు చేయగలిగింది.

ఇక ఆస్ట్రేలియా బౌలర్ల విషయానికొస్తే.. సియాన్ అబాట్ అత్యంత ఖరీదైన బౌలర్‌గా నిలిచాడు. అతడు 3 ఓవర్లలోనే 56 పరుగులు ఇచ్చాడు. నతన్ ఎలిస్ మూడు వికెట్లు తీసినా, తన నాలుగు ఓవర్ల కోటాలో 45 పరుగులు సమర్పించుకున్నాడు. స్టోయినిస్ ఒక వికెట్ తీసి 27 పరుగులిచ్చాడు. ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ గెలుపొందాలంటే 236 పరుగులు చేయాల్సి ఉంటుంది. చూడ్డానికి స్కోరు భారీగానే ఉన్నా.. ఆస్ట్రేలియాలోనూ ఊచకోత కోసే బ్యాటర్లు ఉన్నారు. కాబట్టి.. బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయాల్సి ఉంటుంది.

Updated Date - 2023-11-26T20:59:19+05:30 IST