ICC Womens T20 World Cup 2023: టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాదే.. ఫైనల్లో ఓడిన సఫారీలు
ABN , First Publish Date - 2023-02-26T21:47:58+05:30 IST
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ మరోమారు ఆస్ట్రేలియా(Australia) సొంతమైంది
కేప్‌టౌన్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ మరోమారు ఆస్ట్రేలియా(Australia) సొంతమైంది. దక్షిణాఫ్రికా(South Africa)తో కేప్‌టౌన్‌లో జరిగిన ఫైనల్లో 19 పరుగుల తేడాతో విజయం సాధించి సగర్వంగా ఆరోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు సాధించింది. అనంతరం 157 పరుగుల ఓ మాదిరి లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా జట్టు బోల్తా పడింది. ఓపెనర్ లారా వోల్వార్డ్ చివరి వరకు నిలిచి 61 పరుగులతో జట్టును విజయ తీరాలకు చేర్చే ప్రయత్నం చేసినప్పటికీ సహచరుల నుంచి మద్దతు లభించకపోవడంతో జట్టు ఓటమి పాలైంది. 48 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసిన లారా టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆ తర్వాత చోలే ట్రయాన్ చేసిన 25 పరుగులే రెండో అత్యధికం.
ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడం, పరుగులు పొదుపుగా ఇవ్వడంతో చివర్లో బంతులకు, చేయాల్సిన పరుగులకు మధ్య బాగా అంతరం ఏర్పడింది. దీంతో చివర్లో ఒత్తిడికి గురైన బ్యాటర్లు వికెట్లు సమర్పించుకున్నారు.
అంతకుముందు ఓపెనర్ బెత్ మూనీ (74) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 156 పరుగులు చేయగలిగింది. గార్డనర్ 29 పరుగులు, హీలీ 18 పరుగులు చేశారు. సఫారీ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, మరిజానే కాప్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.