Chess Ranks: చరిత్ర సృష్టించిన యువ సంచలనం.. 37 ఏళ్ల తర్వాత రికార్డు బ్రేక్
ABN , First Publish Date - 2023-09-01T18:25:36+05:30 IST
యువ గ్రాండ్ మాస్టర్ 17 ఏళ్ల గుకేష్ చరిత్ర సృష్టించాడు. 37 ఏళ్లుగా భారత్ తరఫున అగ్రస్థానంలో కొనసాగుతున్న విశ్వనాథన్ ఆనంద్‌ను గుకేష్ అధిగమించాడు.
ప్రపంచ చెస్ క్రీడలో యువ గ్రాండ్ మాస్టర్ 17 ఏళ్ల గుకేష్ చరిత్ర సృష్టించాడు. 37 ఏళ్లుగా భారత్ తరఫున అగ్రస్థానంలో కొనసాగుతున్న విశ్వనాథన్ ఆనంద్‌ను గుకేష్ అధిగమించాడు. జూలై 1, 1986న టాప్ ర్యాంక్‌కు చేరుకున్న విశ్వనాథన్ ఆనంద్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే స్థానంలో కొనసాగుతూ వచ్చాడు. అయితే 37 ఏళ్ల రెండు నెలల తర్వాత ఈ రికార్డును 17 ఏళ్ల గుకేష్ బద్దలు కొట్టి తాజాగా టాప్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. తాజాగా ఫిడే ప్రకటించిన ర్యాంకుల ప్రకారం గుకేష్ 2,758 పాయింట్లతో భారత్ తరఫున అగ్రస్థానానికి చేరాడు. ఓవరాల్‌గా గుకేష్ 8వ స్థానంలో కొనసాగుతుండగా.. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన విశ్వనాథన్ ఆనంద్ మాత్రం 2,754 పాయింట్లతో 9వ స్థానానికి పడిపోయాడు. నార్వే ఆటగాడు, చెస్ ప్రపంచకప్ విజేత మాగ్నస్ కార్ల్‌సన్ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో 2,839 పాయింట్లు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: IND Vs PAK: అభిమానులకు నిరాశ తప్పదా? దాయాదుల పోరుకు వర్షం ముప్పు
కాగా గత ఏడాది ఆగస్టు నుంచి గుకేష్ ఫిడే ర్యాంకుల్లో తన స్థానాన్ని మెరుగు పరుచుకుంటున్నాడు. దీంతో తాజాగా భారత్ తరఫున అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. గుకేష్, విశ్వనాథన్ ఆనంద్ తర్వాత భారత్ తరఫున మూడో ర్యాంకులో మరో యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ఉన్నాడు. అతడు ఇటీవల ప్రపంచకప్ చెస్ టోర్నీలో ఫైనల్‌కు చేరాడు. ఫైనల్లో టై బ్రేకర్‌లో మాగ్నస్ కార్ల్‌సన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. అటు లైవ్ రేటింగ్స్‌లో మార్చి 2016లో కాండిడేట్స్ టోర్నమెంట్ 4వ రౌండ్‌లో సెర్గీ కర్జాకిన్ చేతిలో ఓడిపోయి స్వదేశీయుడైన హరికృష్ణ కంటే విశ్వనాథన్ ఆనంద్ వెనుకబడిపోయాడు. ఈ ఓటమి ఆనంద్ లైవ్ రేటింగ్‌ను 2,763కి తగ్గించింది. హరికృష్ణ ఖాతాలో 2,763 పాయింట్లు ఉన్నాయి. దీంతో ఫిడే ర్యాంకుల్లో 31వ స్థానంలో నిలిచాడు. టాప్-30 ర్యాంకుల్లో గుకేష్, ఆనంద్, ప్రజ్ఞానందతో పాటు విదిత్ సంతోష్ (27), అర్జున్ ఇరిగైసి (29) ఉన్నారు. ప్రస్తుతం విశ్వనాథన్ ఆనంద్ FIDE డిప్యూటీ ప్రెసిడెంట్‌గా, వ్యాఖ్యాతగానే కాకుండా కొత్త ఆటగాళ్ళకు మార్గదర్శకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.