Share News

ప్రలోభ పర్వం

ABN , First Publish Date - 2023-11-29T00:07:30+05:30 IST

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. ఇక తెరచాటు ప్రలోభాలకు నాయకులు తెరతీస్తున్నారు.

ప్రలోభ పర్వం

డబ్బు, మద్యం పంపకాలతో క్యాడర్‌ బిజీ

ఓట్ల కోసం సర్వ శక్తులూ ఒడ్డుతున్న పార్టీలు

ఇబ్రహీంపట్నం/షాద్‌నగర్‌/మేడ్చల్‌(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/పరిగి/ఆమనగల్లు, నవంబరు 28: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. ఇక తెరచాటు ప్రలోభాలకు నాయకులు తెరతీస్తున్నారు. ముఖ్యంగా కాలనీల అసోసియేషన్లు, కుల సంఘాల నాయకులతో మంతనాలు ప్రారంభించారు. మంగళవారం రాత్రి నుంచి లోలోపల మీటింగ్‌లు పెడుతూ సమూహ ఓట్లకు గాలం వేస్తున్నారు. ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, తుర్కయంజాల్‌, యాచారం వంటి పట్టణాల్లో గంప గుత్తుగా ఓట్లు సాధించేందుకు కమ్యూనిటీ, మహిళా సంఘాలతో చర్చిస్తున్నారు. అలాగే వ్యక్తిగతంగా ఇంటికి ఇంత అని ముట్టుజెబుతున్నారు. ఐదారు, అంతకంటే ఎక్కువ ఓట్లు ఉన్న ఇళ్లపై నాయకులు దృష్టిపెట్టారు. పల్లె, పట్నం అనే తేడా లేకుండా అంతటా పంపకాలకు తెరలేపారు. చాలా చోట్ల ఓటుకు రూ.వెయ్యికి తక్కువ కాకుండా ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఈ ఒక్క రోజు కీలకం

ఇది బుధవారం మరింత ఊపందుకోనుంది. పోలింగ్‌కు కొన్ని గంటలముందు రాజకీయ నాయకులు ఎక్కువగా డబ్బు, మద్యం పంపిణీ చేయడం పరిపాటిగా మారింది. నెల రోజులు ఎంత ప్రచారం చేసినా చివరి గంటల్లో ఓటర్లకు ఇచ్చే నగదు, నజరానాలతోనే ఓట్లు రాలుతాయని నేతల విశ్వాసం. అందుకనే నెల రోజుల ఖర్చు ఒకెత్తయితే రేపు పోలింగ్‌ ఉందనగా ఒక్క రోజులో పెట్టే ఖర్చు ఒకెత్తని అంతా భావిస్తారు. ఇందుకు అనుగునంగా ఆర్థిక వనరులు సమకరూర్చుకుంటున్నారు. కాలనీల అసోసియేషన్లు, కుల సంఘాలకు విందులు ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రధాన పోటీ బీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సల మధ్యే ఉంది. పార్టీల తరపున ఓటరు స్లిప్పులు పంచుతూనే ఏ పార్టీకి ఎలా ఉందనే కూపీ లాగుతున్నారు. ఫలానా వారి ఓట్లు తమకు పడవనే అనుమానం ఉన్న చోట్ల బంధు మిత్రులతో మాట్లాడిస్తున్నారు. వార్డు లీడరుకో, ప్రజాప్రతినిధులకో చెప్పి ఓట్లు పడేలా చూసుకుంటున్నారు. ఓట్ల కోసం క్యాడర్‌ను రేయింబవళ్లూ ఓటర్ల చుట్టూ తిరుగుతున్నారు. షాద్‌నగర్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీ ఓటుకు రూ.1,000, బీఆర్‌ఎస్‌ రూ.1,500, బీజేపీ రూ.500 వరకు ఇస్తున్నట్టు సమాచారం. ప్రత్యర్టి పార్టీలు ఇచ్చేదానిపై ఎంతివ్వాలనే దానిపై ఆయా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో లక్షలు వెచ్చించి ఆయా పార్టీల్లోని ప్రధానమైన కార్యకర్తలను కొనుగోలు చేశారు. మేడ్చల్‌లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలని బీఆర్‌ఎస్‌, ఆరుగ్యారంటీలతో కాంగ్రెస్‌, బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బీజేపీ ప్రచారంలో హోరెత్తించాయి. పోలింగ్‌కు మిగిలిన కొద్ది గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అభ్యర్ధులు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. మంగళవారం సాయంత్ర ం నుండే 144 సెక్షన్‌ అమలులోకి వచ్చింది. 48గంటల పాటు మద్యం షాపులు మూసి ఉంటాయి. పార్టీలు ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీకి కసరత్తు చేస్తున్నాయి. ప్రధాన పార్టీకి చెందిన ఓ అభ్యర్ధి ఓటుకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేశారు. ప్రలోభాలనుఏ అరికట్టడంతో మేడ్చల్‌ జిల్లాలో ఎన్నికల అధికారులు విఫలమయ్యారని పార్టీల అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు. పరిగి నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో అభ్యర్థులు చీరలు, బ్లౌజులు, బొట్టు బిల్లల పంపిణీకి సిద్ధం అవుతున్నారు. ఓటర్లను మద్యం మత్తులో ముంచేందుకు భారీగా నిల్వలు చేసుకున్నారు. నాయకులు అవసరమైన డబ్బును సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో గుప్త ప్రచారానికి తెరతీశారు. అభ్యర్థులు పగలు, రాత్రి తేడా లేకుండా నెల రోజులు ప్రచారాలు సాగించారు. పోటీ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీల మధ్య ఉంది. మహిళా, కుల సంఘాల, యువకుల, వలస ఓటర్లపై పార్టీల నాయకులు దృష్టి సారించారు. ఓటు బ్యాంకు కలిగిన నాయకులకు ఎంతో కొంత డబ్బు ముట్టజెప్పి తమకు అనుకూలంగా మలచుకోవడానికి అభ్యర్థులు ఎత్తులు వేస్తున్నారు. ఒక్కో అభ్యర్థి మద్యానికే రూ.3కోట్ల నుంచి 5కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.

Updated Date - 2023-11-29T00:07:32+05:30 IST