Share News

Kumaram Bheem Asifabad: తుది దశకు ప్రచార పోరు..

ABN , First Publish Date - 2023-11-26T22:56:41+05:30 IST

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌) శాసనసభ ఎన్నికల ప్రచార ఘట్టం తుది అంకానికి చేరింది. మరో 48 గంటల్లో ప్రచార గడువు పరిసమాప్తం కానుండడంతో అన్ని పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో తలమునకలయ్యాయి. ఎన్నికల పర్వంలో ఇప్పటి దాకా జరిగింది ఒకేత్తయితే ఇకపై 48గంటలు మరోఎత్తు కావడంతో అన్ని పార్టీలు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యాయి.

Kumaram Bheem Asifabad:   తుది దశకు ప్రచార పోరు..

- లెక్కలతో కుస్తీ పడుతున్న అభ్యర్థులు

- తాయిలాల పంపిణీకి కసరత్తు షురూ

- కుల సంఘాల పైనే అందరి కన్ను

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

శాసనసభ ఎన్నికల ప్రచార ఘట్టం తుది అంకానికి చేరింది. మరో 48 గంటల్లో ప్రచార గడువు పరిసమాప్తం కానుండడంతో అన్ని పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో తలమునకలయ్యాయి. ఎన్నికల పర్వంలో ఇప్పటి దాకా జరిగింది ఒకేత్తయితే ఇకపై 48గంటలు మరోఎత్తు కావడంతో అన్ని పార్టీలు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యాయి. అభ్యర్థులంతా గడచిన 20 రోజుల్లో తాము చేసిన ప్రచార క్యాంపెయిన్లలో వెలుగులోకి వచ్చిన తమ బలాలు, బలహీనతలను బేరిజు వేసుకుంటూ లెక్కలతో కుస్తీ ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకఓటు ప్రభావం అధికంగా కనిపిస్తున్న నేప థ్యంలో అధికార, విపక్షపార్టీల అభ్యర్థులు వ్యతిరేక ఓటును చేజారి పోనీకుండా చూసుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా అధికారపార్టీ నేతలు వ్యతిరేక ఓటు ప్రభావాన్ని తగ్గించి విజయవకాశాలను మెరుగుపరుచుకునేందుకు రెండు నియోజకవర్గాల్లోనూ అటు ప్రచారంలో పాల్గొంటూనే సమయం ముగిసిన తర్వాత తమకు వ్యతిరేకంగా ఓటింగ్‌ చేసే ప్రాంతాలపై దృష్టి సారించి సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు. అటు ప్రధాన విపక్షమైన కాంగ్రెస్‌, బీజేపీల అభ్యర్థులు కూడా హడావుడి లేకుండా చాపకింద నీరులా పోల్‌ మేనేజ్మెంట్‌ ప్రక్రియను అత్యంత లాఘవంగా కానిచ్చేస్తున్నారు. సిర్పూర్‌లో బీఎస్పీ కూడా ప్రధానపార్టీల అభ్యర్థులకు దీటుగా పోల్‌ మేనేజ్మెంట్‌ ప్రాసెస్‌ను ప్రారంభించడం రాజకీయ పరిశీలకులనే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దాంతో ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ రెండు నియోజకవర్గాలలోనూ ప్రస్తుతం అన్ని పార్టీల క్యాండిడేట్లు పోల్‌ మేనేజ్మెంట్‌పై ఫోకస్‌ పెట్టి రాత్రిళ్ళు గుట్టుగా ఓటర్లను కలిసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఎన్నికల ఓటింగ్‌ ప్రక్రియలో మహిళా సంఘాలు, కుల సంఘాలు, యువజన సంఘాల పాత్ర కీలకంగా మారడంతో ప్రస్తుతం అభ్యర్థులంతా ఆయా ప్రాంతాల్లో క్రియాశీలకంగా ఉన్న ఆయా సంఘాల బాధ్యులను బుట్టలో వేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మహిళా సంఘాల విషయానికే వస్తే ఒక్కో మహిళా సంఘంలో 15మంది సభ్యులు ఉండటం 15:4ఓట్ల చొప్పున లెక్కగట్టి తాయిలాల పంపిణీ బాధ్యతలను వారికే అప్పగించడం వంటివి చేస్తున్నారు. వీటికి సంబంధించి పార్టీల వారీగా అభ్యర్థులంతా గ్రామస్థాయి ఓటర్ల జాబితాను పట్టుకొని తమకు సన్నిహితంగా ఉండే సంఘాల నేతలతో మంతనాలు సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు యువజన సంఘాలతో ఇప్పటికే బేరసారాలు పూర్తిచేసి ఒప్పందాలు చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా గ్రామస్థాయిలో తమకు అనుకూల, వ్యతిరేక ఓటింగ్‌కు పాల్పడే వర్గాలను గుర్తించి సామ, దాన, భేద. దండోపాయాల వంటి మార్గాలలో వ్యతిరేక ఓటర్లను తమకు అనుకూలంగా మలచుకునే దిశగా భారీ నజరానాలను ఆఫర్‌ చేస్తున్నట్లు ప్రచారం జరుగు తోంది. ఇక కుల సంఘాల విషయానికి వస్తే ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో ఇప్పటికే అభ్యర్థుల సామాజిక వర్గాల వారీగా ఓటర్ల పోలరైజేషన్‌ దాదాపుగా పూర్తయిందనీ చెబుతున్నారు. ప్రస్తుతం అభ్యర్థులంతా తటస్థంగా ఉండే సామాజికవర్గాల కుల పెద్దలను తమవైపు తిప్పుకునే పనిలోపడ్డారు. దాంతోపాటు గత ఎన్నికల్లో పార్టీల వారీగా బూత్‌స్థాయిలో నమోదైన ఓట్ల ఫలితాల లెక్కలను చేత పట్టుకొని గతంలో బలహీనంగా ఉన్న ప్రాంతాలపై ఫోకస్‌ పెట్టి వారిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎటోచ్చి సిర్పూర్‌ నియోజకవర్గంలోనే రాజకీయ ముఖచిత్రంలో చిత్ర, విచిత్ర కూర్పులు, సామాజిక చేర్పులు వేగంగా మారిపోతున్నాయి. మొదట్లో ఒక పార్టీ అభ్యర్థి విజయవకాశాలపై జోరుగా ఊహగానాలు వినిపిస్తే, తాజాగా మారిన సమీకరణలతో ఇన్నాళ్లు రేసులోనే లేని అభ్యర్థిపేరు బలంగా వినిపిస్తోంది. గతంలో గెలుపు నల్లేరుపై నడకేనని ప్రచారం సాగిన అభ్యర్థి మధ్యలో వెనుకబడినా మారిన సామాజిక సమీకరణలతో మళ్లీ పైచేయి సాధించినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పోలింగ్‌కు మరో 48గంటలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఇక్కడ సమీకరణలు మరింతగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రమంలో అభ్యర్థు లంతా ఓటర్‌ జాబితాలను పట్టుకొని తమ బలాలు, బలహీనతలను సమీక్షించుకుంటూ బలహీనంగా ఉన్నచోట అనుసరించాల్సిన వ్యూహాలు... బలంగా ఉన్నచోట ప్రత్యర్థిని రానివ్వకుండా ఏం చేయాలన్న అంశాలపై లెక్కలతో కుస్తీ ప్రారంభించారు.

తాయిలాల పంపిణీకీ కసరత్తు

ఎవరు.. అవునన్నా కాదన్నా పోలింగ్‌ ప్రక్రియలో ఓటర్లకు పంచే తాయిలాలే కచ్చితంగా ప్రభావం చూపుతున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల గట్టి నమ్మకం. ప్రతి నియోజకవర్గంలో ఐదు నుంచి ఎనిమిది శాతం వరకు ఓటర్లు అభ్యర్థులు పంచే నగదు, నజరానాలను ఆశించే ఓటింగ్‌లో పాల్గొంటారన్నది ఒక అంచనా. ఇందులో కూడా ఏ పార్టీ అభ్యర్థి ఎక్కువ ఇస్తే ఆ అభ్యర్థికి అనుకూలంగా ఓటింగ్‌ జరిగే పరిస్థితి ఉండడంతో పోలింగ్‌కు ముందు 24గంటల సమయం అన్ని పార్టీలకు అత్యంత కీలకంగా మారింది. సరిగ్గా ఈ 24గంటల్లోనే అభ్యర్థుల భవితవ్యాలు తారుమారయ్యే అవకాశం అధికంగా ఉండడంతో అన్నిపార్టీలు అప్రమత్తమయ్యాయి. 28,29తేదీల్లో భారీగా డబ్బు, మద్యం పంపిణీకి అభ్యర్థులు ప్రత్యేకంగా కార్యచరణ అమలు చేస్తారనీ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఆసిఫాబాద్‌ జిల్లాలో తాయిలాల పంపిణీకి సంబంధించి ఇప్పటికే ప్రధానపార్టీల అభ్యర్థులు కార్యచరణ ప్రారంభించారని అంటున్నారు. రెండు నియోజకవర్గాల్లోనూ 28వ తేదీ రాత్రి నుంచి 30న ఉదయం పోలింగ్‌ ప్రారంభమయ్యే వరకు పంపిణీ ప్రక్రియ ఉధృతంగా జరిగే అవకాశం ఉందంటున్నారు.

Updated Date - 2023-11-26T22:56:43+05:30 IST