Share News

Kumaram Bheem Asifabad: నేటితో ప్రచారానికి తెర

ABN , First Publish Date - 2023-11-27T22:49:57+05:30 IST

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌) దాదాపు 25రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారపర్వానికి నేటితో తెరపడనుంది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకల్లా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ముగియనుండటంతో ఇక అభ్యర్థులంతా పోల్‌ మెనేజ్‌మెంటు సెట్టింగ్‌ల ప్రక్రియలపై దృష్టి సారించనున్నారు.

 Kumaram Bheem Asifabad: నేటితో ప్రచారానికి తెర

- రెండు చోట్ల బరిలో 30మంది

- సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం సమాప్తం

- ఇప్పటికే గ్రామాల్లో జోరుగా మద్యం పంపకాలు

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

దాదాపు 25రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారపర్వానికి నేటితో తెరపడనుంది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకల్లా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ముగియనుండటంతో ఇక అభ్యర్థులంతా పోల్‌ మెనేజ్‌మెంటు సెట్టింగ్‌ల ప్రక్రియలపై దృష్టి సారించనున్నారు.

ఆసిఫాబాద్‌ జిల్లాలోని సిర్పూరు, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాల పరిధిలో ఈ దఫా జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో నాలుగు ప్రధానపార్టీలతో సహా మొత్తం 30మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు బరిలోకి దిగుతున్నారు. ఇందులో ఆసిఫాబాద్‌ నియోజకవర్గానికి సంబంధించి అత్యఽధికంగా 17మంది అభ్యర్థులు బరిలో ఉండగా సిర్పూరు నియోజకవర్గంలో 13మంది తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ కమిషన్‌ ప్రకారం 28వ తేదీ సాయంత్రం ఐదు గంటల కల్లా అభ్యర్థులు ప్రచారాన్ని ముగించాల్సి ఉండగా ఇప్పటికే ఈ విషయమై జిల్లా ఎన్నికల అధికారి అభ్యర్థులందరికీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్‌కు ముందు 36గంటల పాటు ఎలాంటి ప్రచార, రాజకీయ కార్యక్రమాలు నిర్వహించరాదు. అలాగే స్థానికేతరులు సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత నియోజకవర్గం వీడి వెళ్లి పోవాల్సి ఉంటుంది. దాంతో పాటు ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభ పెట్టే ఎలాంటి చర్యలపైనైనా నిషేధం అమల్లో ఉంటుంది. ముఖ్యంగా మద్యం దుకాణాల మూసివేత, పోలింగ్‌ ముందు బల్క్‌ ఎస్‌ఎంఎస్‌(మోబైల్‌ సంక్షిప్త సందేశాలు)పంపటం వంటి నిషేధం వంటి ఎలక్షన్‌ కమిషన్‌ మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రచారం ముగిసిన తర్వాత రాజకీయపార్టీలు డబ్బు, మద్యం పంపకాలకు తెరలేపే అవకాశాలుండటంతో నిఘా బృందాలను మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ కోసం సంబంధించి ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం, ఈవీఎం కమిషనింగ్‌, సిబ్బంది నియామకం వంటి ప్రక్రియను పూర్తిచేసింది. ఈ దఫా ఆసిఫాబాద్‌ సెగ్మెంటులో అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉన్నందున రెండు ఈవీఎంలను ఏర్పాటు చేయనున్నారు.

ఇక మిగిలింది పంపకాలే..

నేటితో ఎన్నికల ప్రచారానికి తెర పడుతుండటంతో అభ్యర్థులంతా పంపకాలకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పోల్‌ మేనేజ్‌మెంటు కమిటీలను ఏర్పాటు చేసుకున్న అభ్యర్థులు వారిని కార్యోన్ముకులను చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఆచితూచి ఖర్చు చేసిన అభ్యర్థులు రాబోయే 48గంటల్లో భారీ మొత్తంలో ఓటర్లకు తాయిళాల రూపంలో పంచే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే ఈ దిశగా కార్యచరణ ప్రారంభించినట్టు వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా సిర్పూరు నియోజకవర్గంలో ఈసారి ఆసక్తికరమైన పోరు సాగుతున్న దరమిలా అక్కడి పరిణామాలపై జిల్లా అధికార యంత్రాంగం చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. హేమాహేమీలు తలపడుతుండటంతో ఏ చిన్న పొరపాటుకు తావు లేకుండా అన్ని కదలికలను వీడియో కెమెరాల ద్వారా రికార్డింగ్‌ చేయిస్తున్నారు. ఇక్కడ పోలింగ్‌కు ముందు, పోలింగ్‌ సందర్భంగా ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టు నిఘావర్గాలు అంచనా వేస్తున్న దరమిలా పోలీస్‌ శాఖ కూడా అప్రమత్తమైంది. ప్రధానంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారే పరిస్థితి ఉందని భావిస్తుండటంతో ఎక్కడ ఎలాంటి సమాచారం అందినా వెంటనే స్పందించేలా క్విక్‌ రెస్పాన్స్‌ బృందాలను మోహరించనున్నారు. దాంతో పాటు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలకు సంబంధించి పౌరులు కూడా ఫిర్యాదు చేసే అవకాశాన్ని సీవిజిల్‌ ద్వారా కల్పించటంతో ఈ ఫిర్యాదులపై దృష్టి సారించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మూడు రోజులుగా జిల్లాలో రెండు సెగ్మెంటుల పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కూడా మద్యం పంపకాలు ప్రారంభించారు. సిర్పూరు నియోజకవర్గంలో ఓ జాతీయ పార్టీకి చెందిన అభ్యర్థి అనుచరులు రెండ్రోజులుగా దహెగాం, పెంచికల్‌పేట, బెజ్జూరు మండలాల్లో భారీ పరిమాణంలో మద్యం పంపకాలను నిర్వహిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. రాబోయే 48గంటల్లో మిగితా అభ్యర్థులు కూడా వారికి దీటుగా మద్యం, డబ్బులు పంపిణీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Updated Date - 2023-11-27T22:49:58+05:30 IST