Share News

Kumaram Bheem Asifabad: ష్‌... గప్‌ చుప్‌!!

ABN , First Publish Date - 2023-11-28T22:29:47+05:30 IST

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌) పచారం ముగిసింది... ఇరవై ఐదు రోజులపాటు ఊరూ..వాడ మైకుల హోరు... ర్యాలీల జోరుకు మంగళవారం సాయంత్రం బ్రేక్‌పడింది. పోలింగ్‌కు మరో 24 గంటల గడువు మాత్రమే ఉండడంతో అభ్యర్థుల్లో దడ మొదలైంది. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్‌ఎస్‌.. తొమ్మిదిన్నర ఏళ్ల గులాబీ పాలనకు చరమగీతం పాడాలన్న కసితో కాంగ్రెస్‌, బీజేపీలు బ్యాలెట్‌ బరిలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి.

Kumaram Bheem Asifabad: ష్‌... గప్‌ చుప్‌!!

- ప్రచారం ముగిసింది

- ఇక మిగిలింది ఓటర్‌ నాడి పట్టడమే

- తాయిలాల పంపిణీయే తరువాయి

- అన్ని పార్టీల ఉరుకులు.. పరుగులు

- అభ్యర్థులందరికీ వచ్చే 24గంటలు కీలకం

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

పచారం ముగిసింది... ఇరవై ఐదు రోజులపాటు ఊరూ..వాడ మైకుల హోరు... ర్యాలీల జోరుకు మంగళవారం సాయంత్రం బ్రేక్‌పడింది. పోలింగ్‌కు మరో 24 గంటల గడువు మాత్రమే ఉండడంతో అభ్యర్థుల్లో దడ మొదలైంది. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్‌ఎస్‌.. తొమ్మిదిన్నర ఏళ్ల గులాబీ పాలనకు చరమగీతం పాడాలన్న కసితో కాంగ్రెస్‌, బీజేపీలు బ్యాలెట్‌ బరిలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి. ప్రచారపర్వంలో ఢీ అంటే ఢీ అని తలపడ్డ అభ్యర్థులంతా ఇక ఈవీఎంలపై ఆధిపత్యం కోసం ఓటర్లను మేనేజ్‌ చేసే పనిలో పడ్డాయి. దాంతో అభ్యర్థులంతా పల్లెబాట పట్టి ప్రలోభాల పర్వాన్ని ప్రారంభించారు. మందు, విందు, పచ్చనోట్లతో ఆకట్టుకునేందుకు ఆఖరి ప్రయత్నం చేస్తున్నారు. అన్ని పార్టీలకు వచ్చే24 గంటలు కీలకంగా మారడంతో సామాజికలెక్కల కాగితాలను పట్టుకొని అభ్యర్థులు, వారి అనుచరులు నియోజకవర్గాల్లో ప్రతి పల్లెనూ, ప్రతి ఓటర్‌ను తడుతున్నారు.

శాసనసభ ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. ఇక ఓటర్‌ నాడిని పసిగట్టి అందుకు తగ్గట్లు ప్రీ పోల్‌వ్యూహాలను అమలు చేయడమే మిగిలింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండబోతోందో అర్థం కాక తలపండిన రాజకీయ విశ్లేషకులే చెప్పలేకపోతున్నారు. అటు ప్రభుత్వ వ్యతిరేకగాలి బలంగా కనిపిస్తున్నా.. వ్యతిరేకతను ఓటుగా మార్చుకునే శక్తి విపక్షాలకు ఉందా లేదా అన్నది వచ్చే 24గంటల్లో తేలిపోనుంది. మరోవైపు అధికార పార్టీ అభ్యర్థులు కూడా సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో లబ్ధిదారులు ఓటు వేసినా చాలు తమ విజయం ఖాయమన్న ధీమాతో పైకి గంభీరంగా కనిపిస్తున్నా లో లోపల ఓటరు కరుణిస్తాడా? లేదా అన్న శంక పీడిస్తోంది. దాంతో పోల్‌ మేనేజ్మెంట్‌పై దృష్టి సారించి గుంభనంగా పని కానిచ్చేస్తున్నారు. మంగళవారం ఐదు గంటలకు ప్రచారపర్వం ముగిసిపోవడంతో ప్రధానపార్టీల అభ్యర్థులతోపాటు ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలు, ద్వితీయశ్రేణి నాయకులు ఉరుకులు పరుగులపై గ్రామాలకు చేరుకొని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల ఘట్టంలో గత 25రోజులు ఒక వంతయితే వచ్చే 24గంటలు అత్యంత కీలక సమయం కావడంతో ఎలాంటి హడావుడి లేకుండా అభ్యర్థు లంతా ఓటర్లను మనీ, మందు, విందులతో తమకు అనుకూలంగా ఉండేలా కట్టిపడేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం ఆసిఫాబాద్‌ జిల్లాలోని సిర్పూర్‌, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాల పరిధిలో ఈసారి దాదాపు 4,53,000మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ దఫా పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల యంత్రాంగం విశేషంగా కృషి చేసిన దరిమిలా పోలింగ్‌ శాతం కూడా భారీగా పెరిగే అవకాశాలున్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు కొత్త ఓటర్లను లక్ష్యంగా చేసుకొని వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఉన్న ఓటర్ల కంటే కొత్తగా నమోదైన ఓటర్ల ఓటింగ్‌ శాతం ఎటు ఎక్కువగా మొగ్గితే ఆ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్న నేపథ్యంలో అధికార విపక్షాల అభ్యర్థులు యువ ఓటర్లపై ఫోకస్‌ పెట్టాయి. వీరితోపాటు డబ్బుల పంపిణీ, ఓటర్లకు నజరానాల ప్రలోభాలకు గురిచేయడంలో అన్ని పార్టీలు పోటీపడుతుండడంతో మహిళా సంఘాలు, కుల సంఘాలకు కూడా అభ్యర్థులు ఎనలేని ప్రాముఖ్యత ఇస్తున్నారు. దాంతో పల్లెల్లో మూడు పచ్చనోట్లు.. ఆరు మద్యం సీసాలు అన్నట్లుగా ప్రలోభాల పర్వం జోరుగా సాగుతోందంటున్నారు.

కుల సంఘాలే కీలకం..

శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు మరో కొద్దిగంటల గడువే మిగిలి ఉండడంతో అన్నిపార్టీల అభ్యర్థులు కుల సంఘాలను బుట్టలో వేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ నియోజకవర్గాల పరిధిలో బీసీ, ఎస్సీ, మైనార్టీ ఓటర్లపాత్ర కీలకంగా మారడంతో అభ్యర్థులు కులసంఘాల పెద్దలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి సిర్పూర్‌ నియోజకవర్గంలో ఎన్నికలు హోరాహోరీగా జరుగు తున్న నేపథ్యంలో అక్కడ అత్యధికంగా ఓటు బ్యాంకు కలిగిన బీసీ సామాజికవర్గాల్లోని ఆరే, మాలి, మున్నూరు కాపు, పద్మశాలి, రజక, విశ్వబ్రాహ్మణ కులాల పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు భారీగా ఆఫర్లు ఇస్తున్నారు. ఇక్కడ ఈ సామాజిక వర్గాలు ఎవరిని ఆదరిస్తే ఆ పార్టీ అభ్యర్థికి విజయం ఖాయంగా మారిన కారణంగానే ఇక్కడ ఆ వర్గాల ఓట్లపై కన్నేసి ప్రధాన పార్టీల అభ్యర్థులంతా పంపకాల పర్వానికి శ్రీకారం చుట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటు ఆసిఫాబాద్‌ సెగ్మెంట్‌ పరిధిలోనూ మూడు ప్రధానపార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్య కొనసాగుతోంది. అయితే ఇక్కడ అధికార పార్టీ అభ్యర్థి అయిన కోవ లక్ష్మి సామాజిక వర్గానికి చెందిన గోండు ఓటర్లదే ఆధిపత్యం. అయితే ఇదే సామాజిక వర్గం నుంచి కోట్నాక విజయ్‌ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండి అధికార పార్టీని కలవరపెడుతున్నారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్‌ గోండు ఓటర్ల చీలికపైనే ఆశలు పెట్టుకుంది. మిగతా సామాజికవర్గాల్లో అధికార పార్టీ పట్ల కొంత వ్యతిరేకత కనిపిస్తున్న నేపథ్యంలో ఆదివాసీ ఓట్లు చీలితే తనకు లాభం జరుగవచ్చని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆశిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న సమన్వయలోపం, ఒంటెద్దు పోకడల వంటి అంశాలు ప్రతికూలంగా కనిపిస్తు న్నాయి. వచ్చే 24గంటల్లోగా ఈ పరిస్థితి చక్కబడకపోతే ఇబ్బందులు తప్పవని ఆ పార్టీ నేతలే చెబుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. మొత్తానికి ప్రచారం ముగిసిపోవడంతో అభ్యర్థులు పోల్‌ మేనేజ్మెంట్‌పై గుట్టుగా పనిచేసుకుంటున్నారు.

Updated Date - 2023-11-28T22:29:48+05:30 IST