Share News

Rahul Gandhi : బై బై కేసీఆర్‌!

ABN , First Publish Date - 2023-11-29T03:32:26+05:30 IST

‘‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ సునామీ వచ్చింది. ఈ సునామీలో బీఆర్‌ఎస్‌ కొట్టుకుపోవడం ఖాయం. కేసీఆర్‌ను ఫాంహౌజ్‌కు పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

Rahul Gandhi : బై బై కేసీఆర్‌!

ఆయన్ను ఫాంహౌస్‌కు పంపేందుకు ప్రజలు సిద్ధం

కాంగ్రెస్‌ సునామీలో బీఆర్‌ఎస్‌ కొట్టుకెళ్లడం ఖాయం

కేసీఆర్‌ దోపిడీ సొమ్మును ప్రజలకు పంచుతాం

నేను, నా సోదరి ప్రజలకు సిపాయిలుగా పని చేస్తాం

మీకు ఎప్పుడవసరమైతే అప్పుడు రాష్ట్రానికి వస్తాం

రాష్ట్రంతో మాది రాజకీయం కాదు.. కుటుంబ బంధం

కాంగ్రెస్‌ ఓటమికి కలిసి పనిచేస్తున్న మూడు పార్టీలు

బీజేపీ సూచనతోనే వివిధ రాష్ట్రాల్లో మజ్లిస్‌ పోటీ

పారిశుధ్య కార్మికులను పర్మినెంట్‌ చేస్తాం

ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు నెలకు రూ.1200 ఇస్తాం

గిగ్‌ వర్కర్లకు రాజస్థాన్‌ తరహా విధానం అమలు

నాంపల్లి, మల్కాజిగిరి రోడ్‌ షోల్లో రాహుల్‌

యూసుఫ్‌గూడ నుంచి నాంపల్లికి ఆటోలో ప్రయాణం

హైదరాబాద్‌ సిటీ, మంగళ్‌హాట్‌, మల్కాజిగిరి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ సునామీ వచ్చింది. ఈ సునామీలో బీఆర్‌ఎస్‌ కొట్టుకుపోవడం ఖాయం. కేసీఆర్‌ను ఫాంహౌజ్‌కు పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్‌కు ప్రజలు బైబై చెబుతున్నారు. ఆయనకు బైబై చెప్పాల్సిన సమయం వచ్చింది కూడా’’ అని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు ఆశించిన ఏ ఒక్క కోరిక నెరవేరలేదని, కేసీఆర్‌ కుటుంబంలో మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని, నిరుద్యోగులకు మాత్రం రాలేదని తప్పుబట్టారు. నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లో మంగళవారం నిర్వహించిన ఎన్నికల సభకు ఆయన ఆటోలో వచ్చారు. అలాగే, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎవరికి వారుగా వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేసిన రాహుల్‌, ప్రియాంక చివరి రోజు మల్కాజిగిరిలో ఒకే వేదికపై కనిపించారు. స్థానిక అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుకు మద్దతుగా ఆనంద్‌బాగ్‌ నుంచి మల్కాజిగిరి చౌరస్తా వరకు భారీ రోడ్‌ షో నిర్వహించారు.

రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు నవ్వుతూ అభివాదం చేస్తూ.. ఫ్లైయింగ్‌ కిస్‌లు ఇస్తూ.. విక్టరీ సింబల్‌ చూపుతూ రోడ్‌ షోను నిర్వహించారు. చిన్నారులకు రాహుల్‌ చాక్లెట్లను అందించారు. అలాగే, జూబ్లీ హిల్స్‌ నియోజకవర్గ పరిధిలోని యూస్‌ఫగూడలో ఓ ఫంక్షన్‌ హాల్లో పారిశుద్ధ్య కార్మికులు, ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు, గిగ్‌ వర్కర్లతో భేటీ అయ్యారు. ఆయా సందర్భాల్లో రాహుల్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విషపూరిత పాలన కొనసాగుతోందని, కేసీఆర్‌ కుటుంబాన్ని పారదోలేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల జేబుల నుంచి లాక్కున డబ్బును తిరిగి వారికే పంచేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసి అభివృద్ధే లక్ష్యంగా సాగుతామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ఖర్చును అమాంతం పెంచేసి తెలంగాణ ప్రజల డబ్బును కేసీఆర్‌ దండుకున్నారని, దీనితోపాటు అన్ని ప్రాజెక్టుల్లో అవినీతి రాజ్యమేలిందని ఆరోపించారు. ధరణి ద్వారా 30 లక్షల మంది భూములను లాక్కున్నారని విమర్శించారు. బీఆర్‌ఎ్‌సకు ఓటేస్తే దొరల తెలంగాణ.. కాంగ్రె్‌సకు ఓటేస్తే ప్రజా తెలంగాణ ఏర్పడుతుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వానికి ఈ నెల 30న ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్‌ చేస్తాం

‘‘మీ సమస్యలకు పరిష్కారం చూపుతాం. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక మీతో కలిసి సీఎం, మంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం’’ అని రాహుల్‌ హామీ ఇచ్చారు. యూస్‌ఫగూడలోని ఓ ఫంక్షన్‌ హాల్లో మంగళవారం పారిశుద్ధ్య కార్మికులు, ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు, గిగ్‌ వర్కర్లతో భేటీ అయ్యారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. పలువురు డెలివరీ బాయ్స్‌ రాహుల్‌తో మాట్లాడుతూ.. సంపాదనలో రోజుకు రూ.400 పెట్రోల్‌కే పెట్టాల్సి వస్తోందని, పీఎఫ్‌, ఈఎ్‌సఐ, యాక్సిడెంట్‌ పాలసీలు కూడా లేవన్నారు. డెలివరీ సమయంలో వివిధ యాప్‌ సంస్థలు, కస్టమర్ల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను వివరించారు. అనంతరం, రాహుల్‌ మీకు రాజస్థాన్‌ గిగ్‌ వర్కర్స్‌ పాలసీ తెలుసా? వెహికల్‌ మీదేనా? లోన్‌ తీసుకుంటే ఎంతవుతుంది? మీకు ఏదైనా సంఘం ఉందా? యాక్సిడెంట్లు అవుతాయా? బీమా ఉందా!? అని అడిగారు. రాజస్థాన్‌లో గిగ్‌ వర్కర్లను ఒక కేటగిరీలో ఉంచామని, కంపెనీ నుంచి కొంత శాతం పెన్షన్‌, సోషల్‌ సెక్యూరిటీ, బీమా కోసం వసూలు చేస్తామని, కార్మికులు సంస్థ మారినా వారి పేరిట జమయిన మొత్తం బదిలీ అవుతుందని వివరించారు. తెలంగాణలోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తామని హామీనిచ్చారు. ఏళ్ల తరబడి పని చేసినా జీతాలు పెరగడం లేదని, పర్మినెంట్‌ చేయడం లేదని పారిశుద్ధ్య కార్మికులు రాహుల్‌కు విన్నవించారు. ఆరోగ్యం బాగోలేక సెలవు పెట్టినా జీతం కట్‌ చేస్తారని, పనికి గుర్తింపు లేదని, తక్కువ చేసి చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన రాహుల్‌.. ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయడంతోపాటు సర్వీ్‌సకు తగిన విధంగా వేతనం పెంచుతామని హామీ ఇచ్చారు.

ఒవైసీ, కేసీఆర్‌పై కేసుల్లేవేం!?

‘‘భారత్‌ జోడో యాత్ర కంటే ముందు రాజకీయాల్లో ప్రేమ అనే పదం గురించి మాట్లాడేవారు లేరు. అందుకే ఆ యాత్ర ద్వారా మళ్లీ ప్రేమతో కూడిన దేశాన్ని నిర్మించేందుకు ప్రయత్నించాను. దానికి ఎంతో ఆదరణ లభించింది. దాంతో, వివిధ రాష్ట్రాల్లో నాపై 26 కేసులు నమోదు చేశారు. ఓ కేసులో రెండేళ్లు శిక్ష పడింది కూడా. దాంతో, నా పార్లమెంట్‌ సభ్యత్వం రద్దు చేశారు. ఈడీ, సీబీఐ, ఐటీ పేరుతో 24 గంటలూ అధికారులను, ఏజెన్సీలను నా వెంటే ఉంచారు. ప్రభుత్వం కేటాయించిన ఇంటినీ లాక్కున్నారు’’ అని రాహుల్‌ గాంధీ గుర్తు చేశారు. ప్రతి పేదవాడి గుండెల్లో తనకు స్థానం ఉందని, తనకు ఇక ఇల్లు ఎందుకని ప్రశ్నించారు. మరి, అసదుద్దీన్‌ ఒవైసీపై ఏదైనా కేసు పెట్టారా!? అని రాహుల్‌ ప్రశ్నించారు. ఏజెన్సీల ద్వారా ఆయనపై విచారణ జరిపారా అని అడిగారు. సీఎం కేసీఆర్‌ విషయంలోనూ ఎలాంటి కేసులు, విచారణ లేవని వివరించారు. ‘‘ఎందుకంటే వీరంతా బీజేపీకి మద్దతుదారులు. రైతు చట్టాలు, నోట్ల రద్దు, జీఎస్టీ విషయంలో వీరు మద్దతు ఇవ్వలేదా? అసోం, ఛత్తీ్‌సగఢ్‌, గోవా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మజ్లిస్‌ పోటీ చేస్తుంది. కాంగ్రెస్‌ ఓట్లు చీల్చేలా బీజేపీ సూచనతో పోటీ పెడుతుంది. బీజేపీకి ఒవైసీ మొదటి నుంచీ మద్దతు ఇస్తున్నారు’’ అని ఆరోపించారు. దేశంలో ప్రేమను నింపేందుకు కేంద్రంలో మోదీని; రాష్ట్రంలో కేసీఆర్‌ను పారదోలాల్సిన అవసరం ఉందని, అందుకే, తెలంగాణ నుంచే శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం తాను, తన సోదరి ఢిల్లీలో సిపాయిలుగా ఉన్నామని, మీకు ఏదైనా కావాలన్న వెంటనే హాజరవుతామని భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రజలతో తమది రాజకీయ సంబంధం కాదని, కుటుంబ సంబంధమని పునరుద్ఘాటించారు.

ఆటో డ్రైవర్లకు నెలకు రూ.1200, వెల్ఫేర్‌ బోర్డు

హైదరాబాద్‌లో 15 లక్షల ఆటోలు, క్యాబ్‌లు ఉన్నాయని, క్యాబ్‌ డ్రైవర్లు దాదాపు 7 లక్షల మంది ఉన్నారని, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి తమ కష్టాలు వినేందుకు ఎవరూ ముందుకు రాలేదని రాహుల్‌ ఎదుట వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఓలా, ఉబర్‌ సంస్థలు రావడంతో తమకు పని తగ్గిపోయిందని, బీమా కూడా లేదని, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లూ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే వచ్చాయని తెలిపారు. దాంతో, వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేస్తామని తాము మేనిఫెస్టోలో పెట్టామని, దానిని కచ్చితంగా అమలు చేస్తామని రాహుల్‌ వారికి హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.1200 ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ఉందని, సింగిల్‌ పర్మిట్‌ పాలసీ, పెండింగ్‌ చలాన్లలో 50 శాతం రాయితీ ఇస్తామని భరోసా కల్పించారు. ఖాకీ షర్ట్‌ వేసుకొని ఆటో డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు, గిగ్‌ వర్కర్ల మధ్యలో కూర్చొని ఫొటోలు దిగారు. అనంతరం, అక్కడే ఉన్న ఓ ఆటో కార్మికుడిని తనను నాంపల్లిలో జరిగే సభ వద్దకు తీసుకెళ్లాలని కోరారు. తన భద్రతా వాహనాలను ముందు పంపించి.. ఓ సామాన్యుడిలా ఆటో ఎక్కి యూస్‌ఫగూడ చెక్‌పోస్టు మీదుగా నాంపల్లి వెళ్లారు. ఆయా మార్గాల్లో రాహుల్‌ ఆటోలో ప్రయాణించడాన్ని చూసిన వాహనదారులు చేతులు ఊపుతూ రాహుల్‌.. రాహుల్‌ అంటూ నినదించారు.

Updated Date - 2023-11-29T05:44:27+05:30 IST