Share News

TS Congress: 52 స్థానాల్లో రాత మారితేనే..!

ABN , First Publish Date - 2023-11-27T04:04:40+05:30 IST

గ్రామగ్రామానా పార్టీకి నిర్మాణం ఉంది. సంప్రదాయ ఓటుబ్యాంకూ ఉంది. దశాబ్దాలుగా పార్టీయే ప్రాణంగా పనిచేస్తున్న కార్యకర్తలు, శ్రేణులకు కొదవ లేదు.

TS Congress: 52 స్థానాల్లో రాత మారితేనే..!

  • 52 స్థానాల్లో 2009 నుంచి గెలవని కాంగ్రెస్‌..

  • ఈసారి గెలిచి తీరతామంటున్న హస్తం పార్టీ

  • ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నందున సాధ్యమేనని ధీమా..

  • 2004లో కూటమిగా కాంగ్రె్‌సకు మెజారిటీ సీట్లు

  • అప్పట్లో చీలని ప్రభుత్వ వ్యతిరేక ఓటు..

  • బీజేపీ డీలాతో ఇప్పుడూ చీలదంటున్న నేతలు

హైదరాబాద్‌- ఆంధ్రజ్యోతి : గ్రామగ్రామానా పార్టీకి నిర్మాణం ఉంది. సంప్రదాయ ఓటుబ్యాంకూ ఉంది. దశాబ్దాలుగా పార్టీయే ప్రాణంగా పనిచేస్తున్న కార్యకర్తలు, శ్రేణులకు కొదవ లేదు. అయినా.. తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రె్‌సకు విజయమన్నది అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. తెలంగాణ ఏర్పాటయ్యాక మాత్రమే కాదు.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచీ ఇదే పరిస్థితి. గత మూడు పర్యాయాలుగా 52 స్థానాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరేయలేకపోయింది. ఈసారి అధికారం తమదేనన్న ధీమాతో హస్తం నేతలు ఉన్న నేపథ్యంలో ఆ నియోజకవర్గాలు కీలకంగా మారాయి. మిగిలిన 67 సీట్లలో కనీసం ఒక్కసారైనా గెలిచిన చరిత్ర ఉన్నందున.. వీటిని నిలబెట్టుకుంటూ 52 స్థానాల్లో మెజారిటీ సీట్లను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో కూడా 2004 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ వరుసగా రెండుసార్లు ఓటమిపాలైంది. దీంతో రాష్ట్రంలో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన ఆ పార్టీకి 2004 ఎన్నికలు ఊపిరి పోశాయి. అప్పట్లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఆ వ్యతిరేక ఓటు చీలిపోకుండా అప్పటి ప్రతిపక్ష పార్టీలైన టీఆర్‌ఎస్‌, వామపక్షాలతో కాంగ్రెస్‌ కూటమి కట్టి పోటీ చేసింది. దీంతో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌కు సొంతంగా 48 సీట్లు మాత్రమే వచ్చినా.. మిత్రపక్షాలైన టీఆర్‌ఎ్‌సకు 26, వామపక్షాలకు పది సీట్లు వచ్చాయి. మొత్తంగా 84 సీట్లు కాంగ్రెస్‌ కూటమికి దక్కాయి. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్ల కూడా 2004 నాటి టీడీపీ ప్రభుత్వంపై ఉన్న స్థాయిలోనే ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఆనాడు కూటమిగా సాధించిన సీట్లను ఈసారి కూడా సాధించి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే టీడీపీ ఆవిర్భావం నుంచి జరిగిన ఏ సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ తెలంగాణ ప్రాంతంలో మెజారిటీ సీట్లు దక్కించుకోలేకపోయిన చరిత్ర మాత్రం దానిని వెంటాడుతోంది. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ కోస్తా, రాయలసీమ జిల్లాల నుంచే ఆ పార్టీకి మెజారిటీ సీట్లు వస్తుండేవి. వైఎస్‌ నేతృత్వంలో జరిగిన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. టీడీపీ నేతృత్వంలోని మహాకూటమి, పీఆర్పీ, బీజేపీ మధ్య చీలిపోయిన సంగతి తెలిసిందే. ఆ పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌కు 50 సీట్లు మాత్రమే వచ్చాయి. తెలంగాణలో మెజారిటీ సీట్లలో కాంగ్రెస్‌ ఓడినా.. కోస్తా, రాయలసీమల్లో వచ్చిన మెజారిటీతో వైఎ్‌సఆర్‌ రెండోసారి సీఎం కాగలిగారు.

రాత మారుతుందా!

ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 2009 ఎన్నికల్లో 50 సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 2014 ఎన్నికల్లో 21 సీట్లకు పడిపోయింది. ఇందులో 12 సిటింగ్‌ సీట్లు కాగా.. మిగిలినవి కొత్తగా గెలుచుకున్నవి. 2018 ఎన్నికల్లో టీడీపీ, టీజేఎస్‌, సీపీఐలతో జట్టు కట్టి పోటీ చేస్తే.. మరో రెండు సీట్లు తగ్గి 19 మాత్రమే గెలుచుకోగలిగింది. వీటిలో 15 సీట్లు కొత్తగా గెలిచింది. 2014, 2018 ఎన్నికలు రెండిటినీ కలుపుకొని 36 నియోజకవర్గాల్లో ప్రాతినిథ్యం దక్కించుకుంది. అంటే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 73 సీట్లలో బోణీయే కొట్టలేదు. ఈ ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ఆ 36 నియోజకవర్గాలను నిలబెట్టుకుని, బోణీ కొట్టని 73 నియోజకవర్గాల్లో కనీసం 25 సీట్లు దక్కించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నందున.. ఇది సాధ్యమేనని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.

cing.jpg

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - 2023-11-27T10:52:59+05:30 IST