Share News

బీఆర్‌ఎస్‌ వస్తే తెలంగాణ నం.1

ABN , First Publish Date - 2023-11-29T03:29:29+05:30 IST

‘‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని 9 ఏళ్లలోనే అనేక రంగాల్లో నంబర్‌వన్‌గా నిలిపింది. ఈసారి బీఆర్‌ఎస్‌ వస్తే భారత్‌లోనే తెలంగాణ నంబర్‌వన్‌ అవుతుంది.

బీఆర్‌ఎస్‌ వస్తే తెలంగాణ నం.1

కాంగ్రెస్‌ వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరే..

ప్రజలతో మాది పేగు బంధం.. వారిది ఓటుబంధం

‘రిస్క్‌ వద్దు.. కారుకు గద్దు’.. అన్నదే మా నినాదం

ఇవ్వని హామీలకే లక్ష కోట్లకుపైగా ఖర్చు చేశాం

కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రజలకిస్తున్న బాండ్‌ పేపర్లు

దివాలా తీసినోడు ఇచ్చే ప్రామిసరీనోట్లలాంటివి

కాంగ్రెస్‌ హయాంలో బాగుపడింది ఊరికిద్దరే

జీహెచ్‌ఎంసీ పరిధిలో కాంగ్రెస్‌ ఖాతా తెరవదు

ఇవ్వని హామీలకే లక్ష కోట్లకుపైగా ఖర్చు చేశాం

యాసంగికి యథాతథంగా కాళేశ్వరం నీళ్లు

కాంగ్రెస్‌ హయాంలో బాగుపడింది ఊరికిద్దరే

బీఆర్‌ఎస్‌ హయాంలో ఊరంతా బాగుపడింది

‘ఆంధ్రజ్యోతి’ ముఖాముఖిలో హరీశ్‌రావు

హైదరాబాద్‌, నవంబరు 28, (ఆంధ్రజ్యోతి): ‘‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని 9 ఏళ్లలోనే అనేక రంగాల్లో నంబర్‌వన్‌గా నిలిపింది. ఈసారి బీఆర్‌ఎస్‌ వస్తే భారత్‌లోనే తెలంగాణ నంబర్‌వన్‌ అవుతుంది. కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే మాత్రం కుక్కలు చింపిన విస్తరే అవుతుంది’’ అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. తెలంగాణ ప్రజలతో బీఆర్‌ఎ్‌సది పేగు బంధమైతే.. కాంగ్రెస్‌, బీజేపీలది ఓటు బంధమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో 80 సీట్లకు పైగా గెలిచి మూడోసారి అధికారంలోకి వస్తామంటున్న బీఆర్‌ఎస్‌ ట్రబుల్‌ షూటర్‌ హరీశ్‌రావుతో ‘ఆంధ్రజ్యోతి’ ముఖాముఖి..

తెలంగాణ వచ్చాక జరిగిన రెండు ఎన్నికలకు భిన్నంగా ఈసారి పరిస్థితి ఉంది. దీనికి కారణం ఏమిటి?

ఇదంతా కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా చేస్తున్న ప్రచారమే తప్ప క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. మేము పర్యటిస్తున్నప్పుడు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన, ప్రజామోదం లభిస్తోంది. 2018లో కూడా కాంగ్రెస్‌ పార్టీ ఇలాంటి ప్రచారమే చేసింది. వారు అధికారంలోకి వచ్చేదాకా ఒకాయన గడ్డం తీయనని, మరొకాయన సన్యాసం తీసుకుంటానని పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు. ఫలితాలు వచ్చేవరకూ వాళ్లు ఆ మాటలే మాట్లాడారు. కానీ మాకు 88 సీట్లు వచ్చాయి. ప్రజలు రిస్క్‌ తీసుకోరు. కేసీఆర్‌ వచ్చాక ప్రజలు గుణాత్మక మార్పును చూస్తున్నారు. కేసీఆర్‌ సర్కారు రాష్ట్రంలో తాగునీటి సమస్యను సంపూర్ణంగా పరిష్కరించడం ద్వారా మహిళల హృదయాలను గెలిచింది. అలాగే.. వ్యవసాయంలో నాటికి, నేటికిజమీన్‌ ఆస్మాన్‌ ఫరక్‌ ఉంది. గతంలో రైతులు ఎరువులు, పెట్టుబడి సాయం, కరెంట్‌, సాగునీరు కోసం, పంట అమ్ముకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడేవాళ్లు. ఈ సమస్యలన్నింటినీ మేం పరిష్కరించగలిగాం. నీళ్లు లేక కరెంట్‌ రాక పంట ఎండిపోయే పరిస్థితులు తెలంగాణలో ఇప్పుడు లేవు. 69 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇస్తున్నాం. మద్దతు ధరకు ధాన్యాన్ని కొంటున్నాం. వారు కేసీఆర్‌ను వదులుకుంటారని మేము అనుకోవట్లేదు. కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు మూడు గంటల కరెంటు.. ఐదు గంటల కరెంటు సరిపోతాయని, 10హెచ్‌పీ మోటార్లు అని.. గందరగోళ ప్రకటనలు చేస్తున్నారు. ఇటీవలే వాళ్లు గెలిచిన కర్ణాటకలో ఏం జరుగుతున్నదో ప్రజలు గమనిస్తున్నారు. కరెంట్‌ విషయంలో అక్కడి రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించాక తెలంగాణ రైతులు రిస్క్‌ తీసుకుంటారని మేమనుకోవట్లేదు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు 24 లక్షల పెన్షన్లు ఉంటే.. మేము 47 లక్షల ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం. మళ్లీ ఐదువేలకు పెంచుతామన్నాం. కాంగ్రెస్‌ నాలుగు వేలు ఇస్తామన్నా నమ్మరు. తమ జీవితానికి భద్రత ఇచ్చిన కేసీఆర్‌ వెంటే జనం ఉంటారు.

సాగునీరు, విద్యుత్‌, ధరణితో చాలా చేశాం అని మీరంటున్నారు. కానీ వీటిపైనే కాంగ్రెస్‌ విమర్శలు చేస్తోంది?

సాగునీరు, విద్యుత్‌, ధరణి మా బలం అని కాంగ్రెస్‌ వాళ్లకు తెలుసు. వాటిపై ప్రజలకు అనుమానం, అపోహలు కలిగించడం ద్వారా మా బలాన్ని తగ్గించేందుకు చేస్తున్న కుట్ర ఇది. మేడిగడ్డలో రెండు పిల్లర్లు మునిగిపోయినంత మాత్రాన కాళేశ్వరం మునిగిపోయిందని అంటున్నారు. దాని నిర్మాణానికే 90 వేల కోట్లు కాలేదు. కానీ లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. రైతులు ఐదు పంటలు తీశారనేది నిజం. కాళేశ్వరం అంటే.. 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 22 పంప్‌హౌజ్‌లు, 204 కిలోమీటర్ల గ్రావిటీ టన్నెల్‌, 98 కిలోమీటర్ల ప్రెషర్‌ మైన్స్‌, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్‌. కాంగ్రెస్‌ దేవాదుల ప్రాజెక్టును కట్టి ప్రారంభించిన మరుసటిరోజే పైపులన్నీ ఆకాశమంత ఎత్తుకు ఎగిరి పేలిపోయాయి. కానీ, అంతటితోనే దేవాదుల మునిగిపోయి, పనికిరాకుండా పోలేదు. దేవాదుల అయినా, కాళేశ్వరమైనా చిన్న చిన్న సమస్యలు రావచ్చు. అంతే తప్ప మొత్తం ప్రాజెక్ట్‌లో సమస్య రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కట్టిన ఎల్‌ అండ్‌ టీ దేశంలోనే ఉత్తమ కంపెనీ. ప్రభుత్వంపై భారం లేకుండా వారంటీలో భాగంగా రెండు, మూడు మాసాల్లో పూర్తి చేసి ఇస్తామని వారే చెప్పారు.

కాబట్టి యాసంగి పంటకు యథావిధిగా నీళ్లిస్తాం. ఇక కరెంట్‌ విషయానికొస్తే.. కరెంటు రాలేదని విపక్ష శాసనసభ్యులు ఒక్క రోజయినా అసెంబ్లీలో మాట్లాడారా? సమస్య ఉండుంటే పదేళ్లలో ఒక్కసారైనా మాట్లాడేవారు కదా? కాంగ్రెస్‌ హయాంలో రోజూ ధర్నాలే. ఈ తొమ్మిదిన్నర ఏళ్లలో కరెంట్‌ కోసం ఏ రోజైనా రైతులు ధర్నాలు చేశారా? తెలంగాణ వచ్చినప్పుడు కోటి మెట్రిక్‌ టన్నుల వడ్లు పండితే, ప్రస్తుతం మూడున్నర కోట్ల మెట్రిక్‌ టన్నులు పండుతున్నాయి. కాళేశ్వరం నిర్మించక ముందు కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట, పరకాల, భూపాలపల్లి, మహబూబాబాద్‌, డోర్నకల్‌, పాలకుర్తికి నీళ్లు పోయినయా? కాళేశ్వరం కట్టాక ఈ ప్రాంతాల్లో రెండు పంటలకు నీళ్లిచ్చాం. రెండు పంటలకు నీళ్లు వస్తేనే బీఆర్‌ఎ్‌సకు ఓటు వేయండి. మెదక్‌ జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు కాళేశ్వరం ఫలితాలు అందుతున్నాయి. ఎస్‌ఆర్‌ఎ్‌సపీ వరద కాలువ రివర్స్‌ పంపింగ్‌ పెట్టి రిజర్వాయర్‌గా మార్చడం వల్ల కరీంనగర్‌, చొప్పదండి, మెట్‌పల్లి, జగిత్యాల, ఆర్మూర్‌, బాల్కొండ నియోజకవర్గాలకు కూడా నీళ్లు అందుతున్నాయి. ఇదంతా రైతులకు తెలుసు.ధరణి వచ్చాక భూ క్రయ, విక్రయాలు 15 నిమిషాల్లోనే జరుగుతున్నాయి. లక్షలాది మంది భూముల క్రయవిక్రయాల్లో ఎక్కడా సమస్య రాలేదు.

కుటుంబ పాలన అన్న విమర్శలకు మీ సమాధానం?

ఆ ప్రచారం కాంగ్రెస్‌ చేస్తోంది. వారికి నైతికత లేదు. ఇందిరా గాంధీ నుంచి రాహుల్‌గాంధీ దాకా.. వారిలాగా మేం నామినేటెడ్‌గా వచ్చిన వాళ్లం కాదు. రాష్ట్ర సాధన కోసం కుటుంబమంతా మా భవిష్యత్‌ను పణంగా పెట్టి 14 ఏళ్ల పాటు ఉద్యమం చేశాం, అరెస్టయ్యాం, జైలుకు వెళ్లాం. మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు. వారికోసం పనిచేస్తున్నాం. బీజేపీకి చెందిన అమిత్‌షా కుమారుడు బీసీసీఐ అధ్యక్షుడు కావచ్చు, ఎంతో మంది బీజేపీ ముఖ్యమంత్రులు, నాయకుల పిల్లలు మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వాళ్ల పిల్లలు ఉంటే ఒప్పు. మా పార్టీలో ఉంటే తప్పా. ప్రజలకు మెరుగైన పాలన ఎవరు అందిస్తున్నారనేది ముఖ్యం. కాంగ్రె్‌స-బీజేపీల వ్యవహారం ఎలా ఉందంటే.. చివరకు దీక్షా దివస్‌ చేయడంపైనా ఈసీకి ఫిర్యాదు చేశాయి. మా నాయకుడు ప్రాణాలను పణంగా పెట్టి ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ చచ్చుడో’ అని దీక్ష చేశారు. ‘అయితే తెలంగాణ జైత్రయాత్ర.. లేదంటే నా శవయాత్ర’ అంటూ బయల్దేరి కేసీఆర్‌ ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ రోజు నవంబరు 29. ఆయన 11రోజుల దీక్ష వల్ల.. ప్రజలంతా రోడ్లపైకి వచ్చి పోరాడడం వల్ల..ఢిల్లీ దిగివచ్చి తెలంగాణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకోవడం తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజలను అవమాన పరచడమే. కాంగ్రెస్‌ పార్టీకి ఉద్యమం మీద, ఉద్యమకారుల మీద ప్రేమ లేదు. ‘జై తెలంగాణ అంటే కాల్చేస్తా’ అని తుపాకి పట్టుకుని బయల్దేరిన వ్యక్తి రేవంత్‌. తెలంగాణ నినాదాన్ని పుట్టించింది జయశంకర్‌ దాన్ని నిజం చేసింది కేసీఆర్‌.

‘మార్పు కావాలి.. కాంగ్రెస్‌ రావాలి’ అన్నది హస్తం పార్టీ ట్యాగ్‌ లైన్‌. మరి మీ నినాదం ఏంటి?

మార్పు అంటే.. ఎందులో రావాలి. 24గంటల కరెంటు నుంచి 3 గంటలు ఇవ్వడం మార్పా. మేము ఎకరానికి రూ.15 వేలు ఇస్తామంటే వాళ్లు రైతుకు రూ.15 వేలు అంటున్నారు. మార్పంటే.. పేదల జీవితాల్లో, రైతుల జీవితాల్లో రావాలి. ఆ మార్పు మేము చూపించాం. కర్ణాటకలో ఏం మార్పు జరిగింది. అక్కడ కాంగ్రెస్‌ గెలిచాక కరెంటును తగ్గించారు. రైతులకిచ్చే నగదు బదిలీ పథకాన్ని రద్దు చేశారు. విద్యుత్‌ చార్జీలను రెట్టింపు చేశారు. ఉచితం అని చెప్పిన బస్సులు చాలా చోట్ల రద్దయ్యాయి. స్కాలర్‌షి్‌పలో కోత పెట్టారు. గెలిచాక కోతలు పెట్టారు తప్ప ఏం మార్పు సాధించారు. గెలిచాక వందరోజుల్లో నియామకాలు చేపడతామని రాహుల్‌ హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటివరకూ ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. ఇపుడు తెలంగాణలో చెప్పే ఆరు హామీల పరిస్థితి కూడా ఇంతే ఉంటుంది. కాంగ్రెస్‌ అభ్యర్థులు ఆరు హామీలు అమలుచేస్తామంటూ బాండ్‌ పేపర్లు ఇస్తున్నారు, కానీ అవి దివాలా తీసినోడు ఇచ్చే ప్రామిసరీ నోట్లలాంటివి. అందుకే.. ‘‘ రిస్క్‌ వద్దు.. కారుకు గుద్దు’’ అనేది మా నినాదం. బీజేపీ చెప్పగానే కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌లో బోరుబావులకు మీటర్లు పెట్టి, బిల్లులు ఇస్తున్నారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన కర్ణాటకలో కూడా ఆ షరతుకు అంగీకరిస్తూ అసెంబ్లీలో బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. రేపు తెలంగాణలో కూడా గ్యారెంటీగా మోటార్లకు మీటర్లు పెడతారు. రైతుల విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌.. దొందూ దొందే. వాళ్లొస్తే కచ్చితంగా మీటర్లు వస్తాయి.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకటేనని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది?

రైతుబంధు ఇవ్వడానికి ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇవ్వగానే.. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎలక్షన్‌ కమిషన్‌ కలిసి కుమ్మక్కై ఎన్నికలకు నాలుగు రోజుల ముందు ఎలా ఇస్తారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ పథకంపై నేను మాట్లాడానంటూ ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేయగానే ఈసీఐ అనుమతిని వెనక్కి తీసుకుంది. మరి ఇపుడు ఏమనాలి. కాంగ్రెస్‌, బీజేపీ, ఎలక్షన్‌ కమిషన్‌ ఒకటే అయినట్టా. అనుమతి వస్తే ఒకలా, రాకపోతే మరోలా మాట్లాడడం వారి అవకాశవాద రాజకీయానికి మచ్చు తునక. మోదీ వచ్చి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒకటే అంటారు. రాహుల్‌ వచ్చి బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకటే అంటున్నారు. కానీ మేము ఎవరితో లేము, మేము తెలంగాణ ప్రజలతో ఉన్నాం. మాకు ప్రజలే హైకమాండ్‌. మా రిమోట్‌ తెలంగాణ ప్రజల చేతుల్లో ఉంది. కాంగ్రెస్‌, బీజేపీల రిమోట్‌ ఢిల్లీలో ఉంటుంది. మ్యానిఫెస్టోలో చెప్పని విషయాలను కూడా కేసీఆర్‌ అమలుచేశారు. చెప్పిన విషయాలను కూడా అమలు చేయని పార్టీ కాంగ్రెస్‌. కల్యాణ లక్ష్మి కోసం మేము రూ.13 వేల కోట్లు ఖర్చుచేశాం. రైతు బంధు కోసం రూ.73 వేల కోట్లు వెచ్చించాం. చెప్పకుండానే.. అభివృద్ధి కోసం దాదాపు లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిన చరిత్ర బీఆర్‌ఎ్‌సది. తెలంగాణ ప్రజలతో కాంగ్రెస్‌, బీజేపీలది ఓటు బంధం. మాది పేగు బంధం.

రైతు బంధు డబ్బును నిరుడు డిసెంబరులో ఇచ్చి.. ఇప్పుడు నవంబర్‌లోనే ఇవ్వడమేంటి?

అసలు ఈ అంశాన్ని లేవనెత్తింది కాంగ్రెస్‌. ఆ పార్టీ ఇన్‌చార్జి ఠాక్రే.. యాసంగి రైతుబంధు సొమ్మును రైతు ఖాతాల్లో వెయ్యొద్దంటూ అక్టోబర్‌ 23న ఎన్నికల కమిషన్‌కు లేఖ ఇచ్చారు. రేవంత్‌, ఉత్తమ్‌ కలిసి ఢిల్లీలో ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ.. యాసంగి రైతుబంధు ఆపాల్సిందిగా ఈసీఐకు లేఖ ఇచ్చామని చెప్పారు. దాంతో ఈ పథకం డబ్బులు ఇవ్వొద్దు అని కమిషన్‌ లెటర్‌ ఇచ్చింది. మేం స్పందించి లేఖ రాస్తే.. వేయడానికి అనుమతినిచ్చింది. ఆ విషయమే నేను చెప్పాను. . కానీ మళ్లీ ఇదే విషయంపై కాంగ్రెస్‌ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు ఇచ్చింది. అదే కాంగ్రెస్‌ ఫిర్యాదు ఇవ్వకపోతే అసలు సమస్యే ఉండకపోయేది కదా.

ఉత్తర తెలంగాణలో మీది బలమైన పార్టీ. కానీ ఈసారి హోరాహోరీ నెలకొంది?

నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల్లో మెజారిటీ స్థానాల్లో మేమే గెలుస్తాం. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రజలకు కూడా మాపై నమ్మకం పెరిగింది. కేసీఆర్‌ వచ్చాక శాంతిభద్రతల సమస్యలు లేవు. తాగునీరు వచ్చింది. అభివృద్ధి జరిగింది. భూముల ధరలు పెరిగాయి. ప్రజల ఆస్తుల విలువ పెరిగింది. ఎంతో మంది లబ్ధిపొందారు. హైదరాబాద్‌ అభివృద్ధి చెందుతోంది. పెట్టుబడులు వస్తున్నాయి. అదే.. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రియల్‌ ఎస్టేట్‌ 30శాతం పడిపోయింది. కాబట్టి కేసీఆర్‌ ఉంటేనే మంచిదని ప్రజలు భావిస్తున్నారు.

సీఎం ప్రజలకు దూరంగా ఉన్నారనే, మీ ఎమ్మెల్యేలపై కొంత అసంతృప్తి ఉందనే వాదనపై ఏమంటారు?

దేశంలోనే ఎక్కడా లేని విధంగా నియోజకవర్గ కేంద్రాల్లో క్యాంపు కార్యాలయాలు కట్టించి ఎమ్మెల్యేలను ప్రజలకు దగ్గర చేసిందే కేసీఆర్‌. ప్రతి నియోజకవర్గంలో 10 వేల మందికి వైద్యం కోసం ఎల్‌వోసీలు ఇచ్చాం. ఆపన్నులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా సాయం చేశాం. ప్రతి ఎమ్మెల్యే 15 వేల మందికి కల్యాణలక్ష్మి చెక్కులను ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలో ఊరికిద్దరు నేతలు బాగుపడేవారు. వారు చెబితేనే, లంచం ఇస్తేనే పని జరిగేది. బీఆర్‌ఎస్‌ హయాంలో ఊరంతా బాగుపడింది. అంతా ఆన్‌లైన్‌లోనే. సీఎం కేసీఆర్‌ దళారి వ్యవస్థను కూకటివేళ్లతో పెకలించివేశారు.

బీజేపీ 15 సీట్లు సాధిస్తుందని, రాష్ట్రంలో హంగ్‌ వస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. దీనికి మీరేమంటారు?

అది వారి ఆలోచన. తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. వారు పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చుపెడుతున్నారు. ప్రధాని సహా వారి ముఖ్యమంత్రులు కూడా వచ్చి ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదల ఉండదు. ఇంతకుముందు జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ డిపాజిట్‌ గల్లంతయ్యింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ ఒకటి, రెండు సీట్లకే పరిమితమై బీజేపీకి సహకరించడం వల్లనే కొన్ని వార్డులను వాళ్లు గెలుచుకున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ హంగ్‌ రాదు. బీజేపీ బలంగా ఉన్న స్థానాల్లో కాంగ్రెస్‌ బలహీనమైన అభ్యర్థులను బరిలో ఉంచింది. కానీ ముస్లిం, క్రిస్టియన్‌ మైనారిటీలు మావైపే ఉన్నారు. బీజేపీ రెండు, మూడు సీట్లకే పరిమితం అవుతుంది. హంగ్‌ వచ్చే అవకాశమే లేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 29 సీట్లలో కాంగ్రెస్‌ ఖాతా తెరవదు. మెదక్‌లో మేం 9 సీట్లు గెలుస్తాం. నిజామాబాద్‌లో బీజేపీతో మాకు పోటీ నడుస్తోంది. ఆదిలాబాద్‌లో కాంగ్రె స్‌ అడ్రస్‌ లేదు. మహబూబ్‌నగర్‌లో కూడా మంచి ఫలితాలు సాధిస్తాం. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఏకపక్షంగానే ఉన్నారు. ఈసారి కూడా కచ్చితంగా 80కి అటుఇటుగా సీట్లతో మేం ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న నమ్మకం ఉంది.

Updated Date - 2023-11-29T03:29:31+05:30 IST