Share News

CM KCR : ఇందిరమ్మ రాజ్యం.. తద్దినం భోజనం

ABN , First Publish Date - 2023-11-29T03:41:36+05:30 IST

ఎన్‌కౌంటర్లు, రక్తపాతం, ఎమర్జెన్సీ చీకటి రోజులు, ఆకలి చావులు, కాల్చివేతలు, కూల్చివేతలుండే ఇందిరమ్మ రాజ్యం అవసరమా? అని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు.

CM KCR : ఇందిరమ్మ రాజ్యం.. తద్దినం భోజనం

ఎన్‌కౌంటర్లు, ఎమర్జెన్సీ చీకట్ల పాలన అవసరమా?

ఏకదీక్షతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం

తెలంగాణ ఆచరిస్తుంటే.. దేశం అనుసరిస్తోంది

ధరణితో భూ హక్కులన్నీ రైతాంగానికే ధారపోశాం

ఆ పోర్టల్‌ లేకపోతే గ్రామాల్లో కొట్టుకు చచ్చేవాళ్లు

96 సభలు పెట్టా.. మంచి స్పందన.. మళ్లీ బీఆర్‌ఎస్సే

మానుకోటలో సమైక్య ముసుగులో

మనపై దాడి చేసినవారే ఈ ఎన్నికల్లో నిలబడ్డారు

హనుమకొండ, గజ్వేల్‌ సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌

సిద్దిపేట, హనుమకొండ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఎన్‌కౌంటర్లు, రక్తపాతం, ఎమర్జెన్సీ చీకటి రోజులు, ఆకలి చావులు, కాల్చివేతలు, కూల్చివేతలుండే ఇందిరమ్మ రాజ్యం అవసరమా? అని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని చెబుతూ ‘‘ఇందిరమ్మ రాజ్యం అంటే.. తద్దినం ఉందని భోజనానికి పిలిస్తే, రోజూ మీ ఇంట్లో ఇట్లనే ఉండాలె అని దీవించినట్లే ఉంటుంది’’ కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. నెహ్రూ, ఇందిరాగాంధీ దళితుల గురించి ఆలోచించి ఉంటే ఈ రోజు వారి బతుకులు ఇలా ఉండేవా? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ పాలన పేరుతో పాతచెత్త చరిత్రను మళ్లీ రుద్దే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. యాభై ఏళ్ల కాంగ్రెస్‌ పాలనను, పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనను బేరీజు వేసుకోవాలని పిలుపునిచ్చారు. రైతుబంధు కేసీఆర్‌ ఆలోచన్లోంచి పుట్టిన పథకం అని, ఉచిత విద్యుత్తూ ఇస్తున్నామని.. మరెన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెబుతూ ‘‘ఏకదీక్షతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం. పదేళ్లుగా తెలంగాణ ఆచరిస్తుంటే.. దేశం అనుసరిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రె్‌సకు ఓటు వేస్తే ఆగమవుతామని హెచ్చరించారు. కాంగ్రెస్‌ వచ్చేది లేదు.. చచ్చేది లేదు అని చెబుతూ తాను మొత్తంగా 96 సభలను నిర్వహించానని, అంతటా మంచి స్పందన లభించిందని, రాష్ట్రంలో పక్కాగా మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో.. హనుమకొండ జిల్లా కేంద్రంలో వరంగల్‌ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలను కలిపి అక్కడి బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్‌ ప్రసంగించారు. భూముల క్రయవిక్రయాల్లో పారదర్శకతను పెంపొందించేందుకే తాము ధరణిని తీసుకొచ్చామని, ధరణి లేకపోతే గ్రామాల్లో కొట్టుకొని చచ్చేవాళ్లని చెప్పారు. భూములపై ప్రభుత్వానికి ఉన్న అధికారాలను రైతులకు ఽధారపోశామని, రైతులు వేలిముద్ర వేయకుండా భూములు అటూ ఇటూ అయ్యే అవకాశమే ఉండదని, ధరణి అద్భుత ఫలితాలిస్తోందని వివరించారు. మూడు గంటల కరెంటు సరిపోతుందని, పది హెచ్‌పీ మోటార్లు పెట్టాలని ఒకరు.. రైతుబంధు పైసలు వృథా అని ఇంకొకరు.. ఇలా కాంగ్రెస్‌ నేతలు పథకాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల బోరు మోటార్లు ఉన్నాయని.. మూడు గంటల కరెంట్‌ ఇచ్చి, 10 హెచ్‌పీ మోటార్లు పెడితే అంతా ఒకేసారి స్టార్టర్‌ ఆన్‌ చేయగానే ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లు పటాకులా పేలిపోతాయని.. ఆ రకంగా కాంగ్రెస్‌ వస్తే మళ్లీ అంధకారం అలుముకుంటుందని హెచ్చరించారు. నీటితీరువా పన్నును ఎత్తివేసి.. ఉచితంగా సాగునీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. సాగునీరు సమృద్ధిగా అందుతుండటంతో రాష్ట్రంలో మూడు కోట్ల టన్నుల ధాన్యం పండుతోందని.. గతంలో 30లక్షల టన్నుల ధాన్యమే పండేదని చెప్పారు. రైతులు పండించిన పంటలను 7500 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బును జమ చేస్తున్నామన్నారు.

కేంద్రం ఒక్క వైద్య కాలేజీ ఇవ్వలే

దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 157 మెడికల్‌ కాలేజీలు ఇచ్చిందని, అయితే తెలంగాణకు ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా ఇవ్వలేదని కేసీఆర్‌ విమర్శించారు. చట్టం ప్రకారం జిల్లాకో నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలని, రాష్ట్ర సర్కారు వంద ఉత్తరాలు రాసినా ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. అందుకే బీజేపీకి ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలని ప్రశ్నిస్తూ ‘‘మనం ఏమైనా పిచ్చి గోషిగాళ్లమా? ఒక్క ఓటు వేసినా గొర్రెలం అనుకుంటారు’’ అని వ్యాఖ్యానించారు. పాలనా పరంగా కులం, మతం, జాతి తేడా లేకుండా ముందుకు పోతున్నామని, తెలంగాణలో ఒక్క మత కల్లోలం జరగలేదని, శాంతిభద్రతలు సరిగా ఉండటంతో ఐటీ పరిశ్రమలు తరలివస్తున్నాయని వివరించారు. హైదరాబాద్‌ చుట్టూ నాలుగు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తున్నాయని, అవి ఆరు నెలల్లో పూర్తవుతాయన్నారు. వరంగల్‌లో మల్లిస్పెషాలిటీ ఆస్పత్రి కట్టుకున్నామని, జిల్లాకో మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేసుకున్నామని, జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు. వైద్యం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని, కంటివెలుగు పథకం ద్వారా మూడు కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి, 80లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలను అందజేశామన్నారు.

ఏడిపించి మరీ తెలంగాణ ఇచ్చారు

తెలంగాణను అన్ని రంగాల్లోనూ అరిగోస పెట్టింది కాంగ్రెసేనని కేసీఆర్‌ దుమ్మెత్తిపోశారు. తొలి తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 400 మందిని కాల్చి చంపిందని ఆరోపించారు. మలిదశ ఉద్యమాన్ని తాము ప్రారంభిస్తే.. అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామని చెప్పి, పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చాక దగా చేసిందని విమర్శించారు. అన్ని వర్గాల ఆందోళనలు, తాను ఆమరణ నిరహార దీక్ష చేస్తే ఏడాదిన్నర ఏడిపించి తెలంగాణ ఇచ్చిందని పేర్కొన్నారు. మానుకోటలో సమైక్య వాదుల ముసుగులో తెలంగాణవాదులపై రాళ్లదాడి చేసినవాళ్లే ఇప్పుడు ఎన్నికల్లో నిలబడ్డారంటూ కొండా సురేఖపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

Updated Date - 2023-11-29T05:43:29+05:30 IST