Share News

కామారెడ్డి భూములు కేసీఆర్‌కు ఎందుకు?

ABN , First Publish Date - 2023-11-29T03:44:16+05:30 IST

కామారెడ్డిలో కేసీఆర్‌ గెలిస్తే రైతులు, ప్రజల భూములు కబ్జా చేస్తారంటూ ప్రతిపక్షాలు చిల్లర మాటలతో చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి.

కామారెడ్డి భూములు  కేసీఆర్‌కు ఎందుకు?

కాంగ్రెస్‌, బీజేపీవి చిల్లర రాజకీయాలు

కామారెడ్డి రైతుల బతుకులు మారాలి

భూములను సస్యశ్యామలం చేయాలి

కేసీఆర్‌ తెలంగాణ మొత్తానికే లోకల్‌

ఆయన ఎక్కడ్నుంచైనా పోటీ చేయొచ్చు

ఢిల్లీ గులాములకు ఓటుతో బుద్ధి చెప్పాలి

కామారెడ్డి, సిరిసిల్ల రోడ్‌షోల్లో కేటీఆర్‌

కామారెడ్డి/సిరిసిల్ల, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డిలో కేసీఆర్‌ గెలిస్తే రైతులు, ప్రజల భూములు కబ్జా చేస్తారంటూ ప్రతిపక్షాలు చిల్లర మాటలతో చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి. కామారెడ్డి రైతుల భూములతో కేసీఆర్‌కు ఏమి అవసరం. కేసీఆర్‌కు భూములు లేవా..? కామారెడ్డి భూముల్లో ఏమైనా లంకెబిందెలు ఉన్నాయా!? అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు వీధుల్లో, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్‌ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా, సిరిసిల్ల జిల్లా బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో, తెలంగాణ భవన్‌లోనూ విలేకరులతో ఆయన మాట్లాడారు. కామారెడ్డి రైతుల బతుకులు మార్చాలి, ఇక్కడి ప్రాంతంలో నెర్రెలు బారిన భూములకు గోదావరి నీళ్లు అందించి సస్యశ్యామలం చేయడమే కేసీఆర్‌ తాపత్రయమని చెప్పారు. ఇక్కడి రైతుల భూముల్లో బంగారం పండించేందుకే కేసీఆర్‌ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజలు కేసీఆర్‌ను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కేసీఆర్‌ కామారెడ్డికి నాన్‌ లోకల్‌ అంటూ కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, తెలంగాణను సాధించిన కేసీఆర్‌కు లోకల్‌, నాన్‌ లోకల్‌ ఉంటుందా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ తెలంగాణ మొత్తానికే లోకల్‌ అని ఆయన ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చన్నారు. కామారెడ్డి నియోజకవర్గం బీబీపేట మండలంలోని కోనాపూర్‌ కేసీఆర్‌ అమ్మగారి సొంత ఊరని గుర్తు చేశారు. కేసీఆర్‌ గజ్వేల్‌ను అద్భుతంగా అభివృద్ధి చేశారని చెప్పారు. కామారెడ్డిలో కేసీఆర్‌ గెలిస్తే ఇక్కడ కూడా పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, బీజేపీఅసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు. కామారెడ్డితో పాటు గజ్వేల్‌లోను కేసీఆర్‌ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

పొరపాట్లను సరిదిద్దుకుంటాం

‘మా బలం, బలగం తెలంగాణ ప్రజలు. ఢిల్లీ కుట్రలు, ఢిల్లీ గులాములు, తొత్తులకు ఓటుతో బుద్ధి చెప్పాలి’ అని కేటీఆర్‌ కోరారు. తెలంగాణలో చాలా సాధించామని, ఇంకా సాధించాల్సింది ఉందన్నారు. పొరపాట్లు జరగలేదని అనట్లేదని, తాము మనుషులమేనని, దేవుళ్లం కాదని చెప్పారు. సరిదిద్దుకొంటామని పేర్కొన్నారు. నూటికి 90 పనులు చేసినవాళ్లం, 10ు పనులు చేయలేమా? అనేది ఆలోచించాలన్నారు. తమకంటే మెరుగైన వాళ్లు, మంచిగా పనిచేసేవాళ్లు ఎవరు ఉన్నారో? ఆలోచించాలని కోరారు. ఇటు పక్క సర్వ సమర్థుడు, దమ్మున్నవాడు, దార్శనికుడు, మొనగాడు కేసీఆర్‌ సీఎం అభ్యర్థిగా ఉన్నారని, అటువైపు జోకర్లు, బ్రోకర్లు, బఫూన్లు, మోసగాళ్లు ఉన్నారని పేర్కొన్నారు. వాళ్లకు ఒక లీడర్‌ లేడని, సీఎం స్థాయి నాయకుడే లేడని, వాళ్లకు పాలించే సత్తా లేదని విమర్శించారు. స్థిరమైన ప్రభుత్వం, బలమైన నాయకుడు లేకపోతే తెలంగాణ తెర్లైపోతుందన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ ముఖచిత్రం ఎంత మారిపోయిందో గమనించాలని కోరారు. గూగుల్‌, యాపిల్‌, అమెజాన్‌, ఫాక్స్‌కాన్‌గ్లోబల్‌ కంపెనీలన్నీ హైదరాబాద్‌కు తరలివచ్చాయని, రజనీకాంత్‌ హైదరాబాద్‌ న్యూయార్క్‌ను మించేలా తయారైందని ప్రశంసించారని చెప్పారు. ఎన్నికల ప్రచారాల్లో కోట్లమందిని నేరుగా కలుసుకున్నామని, వాళ్ల మనసు తెలుసుకున్నామని చెప్పారు. ప్రజల్లో గులాబీ ప్రభంజనం ఖాయమని, ముచ్చటగా మూడోసారి గెలుపు తథ్యమని, సీఎంగా కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టడం పక్కా అని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-29T03:44:18+05:30 IST