Share News

BJP: ముషీరాబాద్‌ బీజేపీ సీటు బీసీలకే..

ABN , First Publish Date - 2023-10-27T09:15:44+05:30 IST

ముషీరాబాద్‌(Mushirabad) నియోజకవర్గం బీజేపీ(BJP) అభ్యర్థి ఎంపికపై అధిష్టానం చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చినట్లు

BJP: ముషీరాబాద్‌ బీజేపీ సీటు బీసీలకే..

- పరిశీలనలో ఐదుగురి పేర్లు

- టికెట్‌ రేసులో బండారు విజయలక్ష్మి, పూస రాజు, భరత్‌గౌడ్‌

రాంనగర్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): ముషీరాబాద్‌(Mushirabad) నియోజకవర్గం బీజేపీ(BJP) అభ్యర్థి ఎంపికపై అధిష్టానం చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు బీసీలకు టికెట్‌ ఇవ్వడంతో బీజేపీ కూడా బీసీలకే ఇవ్వడానికి నిర్ణయించినట్టు సమాచారం. బీజేపీ ప్రకటించిన తొలిజాబితాలో గ్రేటర్‌ హైదరాబాద్‌(Greater Hyderabad)లో ఒక సీటులో కూడా బీసీలకు అవకాశం కల్పించ లేదు. ఈ నేపథ్యంలో ముషీరాబాద్‌ స్థానాన్ని బీసీలకు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ నియోజకవర్గానికి బీజేపీకి పెద్దదిక్కుగా ఉన్న డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ కూడా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతుండటం, నియోజకవర్గంలోని 2 లక్షల 94 వేల ఓట్ల పై చిలుకులో యాబై నుంచి 60 శాతం బీసీల ఓట్లు ఉన్న నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ సీటు బీసీకి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నియోజకవర్గం నుంచి 28 మంది ఆశావహులు టికెట్‌ కోసం దరకాస్తు చేసుకున్న విషయం విధితమే అయితే, ఇక్కడ నుంచి డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ పోటీ నుంచి తప్పుకోవడంతో నియోజకవర్గంలో వారికి అవకాశం ఇచ్చే అంశంపై ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె లక్ష్మణ్‌ టికెట్‌ ఆశిస్తున్న ఆశావహులతో సమావేశం నిర్వహించి పార్టీ భవిష్యత్‌ దృష్టా ఎవరికి టికెట్‌ ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపించాలని సూచించారు. ఈ నేపథ్యంలో బీసీ సామాజికవర్గం నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారిలో హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి, పార్టీ సికింద్రాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సీకేశంకర్‌, ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గసభ్యులు పూస రాజు, బీజేవైఎం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గుండగోని భరత్‌గౌడ్‌, ఓబీసీ మోర్చా మహంకాళి జిల్లా అధ్యక్షుడు సలంద్రి శ్రీనివా్‌సయాదవ్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ ఐదుగురిలో ప్రముఖంగా బండారు విజయలక్ష్మి, పూసరాజు, భరత్‌గౌడ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి.

- కార్పొరేటర్లకు నో..

ముషీరాబాద్‌ నియోజకవర్గం నుంచి గెలిచిన కార్పొరేటర్లలో ఎవరికీ అవకాశం ఇవ్వొద్దని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో ముషీరాబాద్‌ టికెట్‌ ఆశిస్తున్న రాంనగర్‌ కార్పొరేటర్‌ కె రవిచారి, ముషీరాబాద్‌ కార్పొరేటప్‌ సుప్రియాగౌడ్‌ భర్త ఎం.నవీన్‌గౌడ్‌, గాంధీనగర్‌ కార్పొరేటర్‌ ఎ.పావని భర్త వినయ్‌కుమార్‌లకు అవకాశాలు లేకుండా పోయాయి. కార్పొరేటర్‌ పదవులు నిర్వహిస్తున్న నేపథ్యంలో మిగతా వారికి అవకాశం కల్పించాలని పార్టీ యోచన చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ విషయాన్ని డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ కూడా వారికి చెప్పినట్లు సమాచారం. అయితే వారు మాత్రం తమకు రావాలని పట్టుబడుతున్నప్పటికీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ మాత్రం వారికి ఎలాంటి అభయం ఇవ్వడం లేదు. పార్టీ అధికారంలోకి వస్తే కార్పొరేటర్ల భర్తలకు నామినేటెడ్‌ పదవుల్లో అవకాశాలు కల్పిస్తామని అధిష్టానం అభయం ఇచ్చినట్లు తెలిసింది.

Updated Date - 2023-10-27T09:15:44+05:30 IST