The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ ప్రదర్శనకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , First Publish Date - 2023-05-15T19:16:31+05:30 IST

మూడు రోజులుగా నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) సినిమా ప్రదర్శనపై కొనసాగుతున్న ఉత్కంఠకు సోమవారం తెరపడింది.

The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ ప్రదర్శనకు గ్రీన్‌ సిగ్నల్‌

భైంసా: మూడు రోజులుగా నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) సినిమా ప్రదర్శనపై కొనసాగుతున్న ఉత్కంఠకు సోమవారం తెరపడింది. ఎట్టకేలకు పోలీసు శాఖ సినిమా ప్రదర్శనకు గ్రీన్‌ సిగ్నల్‌ (Green signal) ఇచ్చింది. మంగళవారం నుంచి రోజు రెండు ఆటలు మార్నింగ్‌, మ్యాట్నీ షోలకు అనుమతినిచ్చింది. శుక్రవారం నుంచి సినిమా ప్రదర్శనపై వివాదం కొనసాగుతోంది. పట్టణంలోని కమల సినిమా థియేటర్‌లో శుక్రవారం నుంచి రోజు నాలుగు ఆటలు ది కేరళ స్టోరీ సినిమా ప్రదర్శించాల్సి ఉంది. అయితే మతకల్లోలిత, అతి సమస్యాత్మక ప్రాంతమైన భైంసా (Bhainsa)లో సంబంధిత సినిమా ప్రదర్శన ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు నెలకొంటాయన్న ముందస్తు ఆలోచనతో పోలీసు శాఖ సినిమా ప్రదర్శనను నిలిపి వేయించింది. థియేటర్‌ను మూసి ఉంచారు. అయితే ఆదివారం నిర్వాహకులు థియేటర్‌ను తెరిచి మార్నింగ్‌, మాట్నీ షోలను ప్రదర్శించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఫస్ట్‌ షో ఆరంభమయ్యే సమయంలో థియేటర్‌కు వెళ్లి ప్రదర్శనను అడ్డుకున్నారు. థియేటర్‌ మేనేజర్‌, డిస్ట్రిబ్యూటర్‌లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పి.రమాదేవి, హిందూవాహిని శ్రేణులు పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. సినిమా ప్రదర్శనకు అనుమతి ఇవ్వకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దీంతో స్పందించిన పోలీసు అధికారులు మంగళవారం నుంచి రెండు షోలకు అనుమతి ఇచ్చారు. థియేటర్‌ వద్ద పోలీసు శాఖ పికెటింగ్‌ను ఏర్పాటు చేసింది.

Updated Date - 2023-05-15T19:16:36+05:30 IST