లీకేజీ నిందితుడికి సన్మానమా..!

ABN , First Publish Date - 2023-04-13T02:47:45+05:30 IST

పదోతరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అరెస్టు అయ్యి కండిషనల్‌ బెయిల్‌పై కరీనంగర్‌ జైలు నుంచి బుధవారం విడుదలైన ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు ప్రశాంత్‌కు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు.

లీకేజీ నిందితుడికి సన్మానమా..!

బెయిల్‌పై విడుదలైన ప్రశాంత్‌కు బీజేపీ నేతల సన్మానం

ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌ ఫైర్‌

హైదరాబాద్‌, హనుమకొండ క్రైం, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): పదోతరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అరెస్టు అయ్యి కండిషనల్‌ బెయిల్‌పై కరీనంగర్‌ జైలు నుంచి బుధవారం విడుదలైన ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు ప్రశాంత్‌కు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ప్రశాంత్‌ తన స్వగ్రామం ఆరెపల్లికి వెళుతుండగా మార్గమధ్యలో హుజురాబాద్‌లో పలువురు బీజేపీ నేతలు శాలువాలతో సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. అయితే, బీజేపీ నేతఅ తీరుపై మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. ట్విటర్‌ వేదికగా బీజేపీకి చురకలంటించారు. ‘‘బిల్కిస్‌ బానోపై అత్యాచారం చేసిన దోషులను సన్మానిస్తారు, యూపీలో నేరస్తులను కేంద్రమంత్రి ఆహ్వానిస్తారు, తెలంగాణలో పదోతరగతి పేపర్‌ లీకేజీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని సన్మానిస్తారు. బీజేపీలో తీవ్రమైన బుద్ధిమాంద్యం కలిగిన నేతలున్నారు. వారి గురించి ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Updated Date - 2023-04-13T02:47:45+05:30 IST