Yellandu: సద్దుమణిగిన ఇల్లందు మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసం రగడ

ABN , First Publish Date - 2023-02-26T15:42:07+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam District)లో బీఆర్‌ఎస్‌ను చీల్చేందుకు కొందరు ప్రముఖ నేతలు సాగిస్తున్న యత్నాల్లో తొలి అస్త్రం ఇల్లెందు నియోజకవర్గంపై సంధించారు.

Yellandu: సద్దుమణిగిన ఇల్లందు మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసం రగడ

భద్రాద్రి: ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam District)లో బీఆర్‌ఎస్‌ను చీల్చేందుకు కొందరు ప్రముఖ నేతలు సాగిస్తున్న యత్నాల్లో తొలి అస్త్రం ఇల్లెందు నియోజకవర్గంపై సంధించారు. అయితే ఇక్కడే అధికార బీఆర్‌ఎస్ వ్యూహాకత్మకంగా వ్యవహరించింది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి (Palla Rajeshwar Reddy) చక్రం తిప్పారు. ప్రస్తుతానికి ఇల్లందు (Yellandu) మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసం రగడ సద్దుమణిగింది. అసమ్మతి వర్గం క్యాంపు నుంచి 12 మంది కౌన్సిలర్లు ఇల్లందు చేరుకున్నారు. ఇల్లెందు వచ్చిన అసమ్మతి వర్గం కౌన్సిలర్లు పల్లా రాజేశ్వర్రెడ్డిని కలిశారు. ఈనెల 6న మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరావుపై కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం నోటీసిచ్చారు. 20 రోజులుగా ఇరువర్గాల మధ్య సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు తీసుకున్నారు. ఎట్టకేలకు బీఆర్ఎస్ పెద్దల జోక్యంతో వర్గపోరు కొలిక్కి వచ్చింది.

కౌన్సిలర్లు కొంతకాలంగా చైర్మన్‌‌తో తీవ్రంగా విభేదిస్తున్నారు. కోట్ల రూపాయలతో పట్టణంలో భారీగా అభివృద్ధి పనులు జరుగున్నా గత పాలకవర్గాల మాదిరిగా కమీషన్ల పంపకాలు జరగడంలేదన్న విమర్శలను చైర్మన్‌ తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. కొద్ది నెలలుగా కౌన్సిలర్లతో తలెత్తిన విభేదాలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే హరిప్రియ, ఎమ్మెల్సీ తాత మధుసూదన పలుమార్లు యత్నించారు. అయినా విభేదాలు సద్దుమనగలేదు. సభలు, సమావేశాలకు ఇరువర్గాలు హజరవుతున్నా ఎడమొఖం పెడమొఖంగానే ఉంటున్నారు. అసమ్మతి వర్గం మాత్రం బహిరంగ ఆరోపణలు, విమర్శలకు వెళ్లకుండా అసమ్మతితో రగిలిపోతున్న కౌన్సిలర్లను కూడగట్టడం ద్వారా చైర్మన్ వెంకటేశ్వరరావును పదవీచ్యుతుడిని చేసి ఇల్లెందు నియోజవర్గ కేంద్రంలోనే బీఆర్‌ఎస్‌ను దెబ్బతీయాలనే వ్యూహంతో పనిచేస్తున్నట్లు ప్రచారం జరిగింది.

Updated Date - 2023-02-26T15:42:09+05:30 IST