Share News

కార్యకర్తలే నా హీరోలు... గెలుపు బీజేపీదే

ABN , First Publish Date - 2023-11-29T00:16:06+05:30 IST

కార్యకర్తలే నా హీరోలు.. కరీంనగర్‌లో కాషాయ జెండా ఎగురవేస్తాం.. ఎన్నికల్లో గెలిచేది బీజేపీనే’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

కార్యకర్తలే నా హీరోలు... గెలుపు బీజేపీదే
అభివాదం చేస్తున్న బండి సంజయ్‌కుమార్‌

- కరీంనగర్‌లో ఎగిరేది కాషాయ జెండా

- 3న విజయోత్సవ ర్యాలీ నిర్వహిద్దాం

- బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ డబ్బులు పంచే పనిలో పడ్డారు

- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌

భగత్‌నగర్‌, నవంబరు 28: ‘కార్యకర్తలే నా హీరోలు.. కరీంనగర్‌లో కాషాయ జెండా ఎగురవేస్తాం.. ఎన్నికల్లో గెలిచేది బీజేపీనే’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం కరీంనగర్‌లో మహాబైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగుల దొంగ వీడియోలు సృష్టిస్తే చరిత్ర హీనుడివైపోతావని, నా సహనాన్ని పరీక్షించొద్దన్నారు. డిసెంబరు 3న బీజేపీ విజయోత్సవ ర్యాలీకి సిద్ధంగా ఉండాలన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు డబ్బుతో ఓట్లుకొనే పడిలో పడ్డారన్నారు. డబ్బులు పంపిణీ చేస్తే పోలీసులకు సమాచారమివ్వాలన్నారు. వాళ్లు పట్టించుకోకపోతే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వాళ్లు పంచే డబ్బులు గుంజుకుని పేదలకు పంచాలన్నారు. పోలింగ్‌ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తల కష్టం, అభిమానం, ప్రజల ఆశీర్వాదంతో కరీంనగర్‌లో భారీ మెజారిటీతో బీజేపీ విజయం సాధించబోతున్నదన్నారు. ఇదంతా తట్టుకోలేక తనపై దొంగ వీడియో, ఆడియోలు సృష్టించి సర్కులేట్‌ చేసే పనిలో పడ్డారట, నా సంగతి తెలుసు.. నేను తలుచుకుంటే నీ వీడియోలు, నీ చాటింగ్‌లు ఇంటింటికి చూపెట్టగలను... అవి చూస్తే కేసీఆర్‌, కేటీఆర్‌లు సైతం నిన్ను పోటీ నుంచి తప్పుకోవాలని చెబుతారు. అంతదాకా తెచ్చుకోవద్దన్నారు. దమ్ముంటే నాతో నేరుగా కొట్లడు.. అభివృద్ధిపై కొట్లాడు.. ఎవరేం అభివృద్ధి చేశారో తేల్చుకుందామన్నారు. అంతేగాని భూకబ్జాలు, రౌడీయిజం నా దగ్గర చెల్లవన్నారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే నీవు తట్టుకోలేవని హెచ్చరించారు. ఫాం హౌస్‌లో పడుకున్న కేసీఆర్‌ను ధర్నా చౌక్‌కు గుంజుకొచ్చిన, నీవెంత అన్నారు. మీరు అధికారంలో ఉండేది మరో 48 గంటలే.. క్షణాలు, నిమిషాలు లెక్కించుకో.. 30న పోలింగ్‌ జరగబోతుంది.. బీజేపీకి ఓటేయాలని ప్రజలంతా నిర్ణయించుకున్నారన్నారు. డిసెంబరు 3న ఫలితాల్లో మంచి ఫలితం ప్రజలు ఇవ్వబోతున్నారన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి దుకాణం బంద్‌ చేసుకున్నాడని, ఇద్దరు భూ కబ్జాల దారులేనన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు విచ్చలవిడిగా డబ్బులు పంచే పనిలో పడ్డారన్నారు. ఓట్లను బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వాళ్లు కొనాలనుకుంటున్నారు. కరీంనగర్‌ ప్రజలా ఒక్కసారి ఆలోచించండి భూకబ్జాదారులు, అవినీతి పరులు కావాలా.. మచ్చలేని వ్యక్తిత్వంతో ప్రజల కోసం పోరాడుతున్న నేను కావాలా ఆలోచించుకోవాలన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఫ బీజేపీ మహార్యాలీకి స్పందన

అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజుకావడంతో బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో మహా బైక్‌ర్యాలీ నిర్వహించి ప్రచారాన్ని ముగించారు. మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎంఆర్‌పిఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ మహార్యాలీ ప్రారంభ సమావేశంలో ప్రసంగించగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ రేకుర్తిలో మహార్యాలీ ముగింపుసమావేశంలో ప్రసంగించారు. ముస్లిం మహిళలు బండి సంజయ్‌ను పూల మాలలతో సత్కరించగా, ముస్లింలు భారీ గజమాలలతో సత్కరించారు. ముస్లిం యువకులు పూలు చల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

బండి సంజయ్‌ని గెలిపిస్తే సీఎం అవుతాడు

- ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ

కరీంనగర్‌లో బండి సంజయ్‌ను గెలిపిస్తే ముఖ్యమంత్రి అవుతారని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. మంగళవారం నగరంలో కరీంనగర్‌లో నిర్వహించిన మహా బైక్‌ ర్యాలీని ఆయన బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండి సంజయ్‌ను లక్ష మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గడగడలాడించిన బండి సంజయ్‌ యుద్ధంలో సైన్యాధిపతిగాముందుండి పోరాటం నడిపించారన్నారు. బండి సంజయ్‌కు ప్రధాని మోదీ అండ ఉందని, ప్రజల మనిషిగా ఉన్న బండి సంజయ్‌ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎస్సీ, ఎస్టీ బీసీ వర్గాలతోపాటు ఓసీ వర్గాలపై ఉందన్నారు. అణగారిన మాదిగల సమావేశానికి ఏ ప్రధాన మంత్రి రాలేదని, అలాంటిది మాదిగల మీటింగ్‌కు మోదీ వచ్చి తనను గుండెలకు హత్తుకుని ఎస్సీవర్గీకరణ చేస్తామని ప్రకటించారన్నారు. కరీంనగర్‌లో బండి సంజయ్‌ను గెలిపించుకోవాలని, ఇప్పటి వరకు ఓసీలే రాజ్యమేలుతున్నారని, బీసీలకు మొదటి సారి అవకాశం కల్పించాలని కోరారు.

Updated Date - 2023-11-29T00:16:10+05:30 IST