Share News

వేములవాడ సమగ్ర అభివృద్ధే ధ్యేయం

ABN , First Publish Date - 2023-11-29T00:22:37+05:30 IST

వేములవాడ నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని భారతీయ జనతా పార్టీ వేములవాడ నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్‌ చెన్నమనేని వికాస్‌ అన్నారు.

వేములవాడ సమగ్ర అభివృద్ధే ధ్యేయం
వేములవాడలో ప్రచారం నిర్వహిస్తున్న చెన్నమనేని వికాస్‌

వేములవాడ, నవంబరు 28 : వేములవాడ నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని భారతీయ జనతా పార్టీ వేములవాడ నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్‌ చెన్నమనేని వికాస్‌ అన్నారు. మంగళవారం ఆయన తన సతీమణి చెన్నమనేని దీప, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, స్థానిక నాయకులతో కలిసి వేములవాడ పట్టణంలోని మెయిన్‌ రోడ్డు లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆంరఽధా వలస పాలకుల పాలనలో నిర్లక్ష్యానికి గురైన వేములవాడ రాజన్న క్షేత్రం ప్రత్యేక తెలంగాణలో సైతం అభివృద్ధికి నోచుకోకపోవడం శోచనీయమన్నారు. ప్రతీ సంవత్సరం 100 కోట్ల రూపాయల చొప్పున వెచ్చించి వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌ మాట నిలబెట్టుకోకుండా శివుడికే శఠగోపం పెట్టారని అన్నారు. రాజన్న ఆలయంతోపాటు వేములవాడ పట్టణ అభివృద్ధిని విస్మరించారని, మిషన్‌ భగీరథ అలంకారప్రాయంగా మారి ప్రజలు తాగునీటికి సైతం ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వేములవాడ పట్టణంలో ప్రధాన రోడ్ల వెడల్పు కార్యక్రమం విషయంలో పాలకులు మీనమేషాలు లెక్కబెట్టడంతో స్థానిక ప్రజలు, యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నియోజకవర్గ కేంద్రమైన వేములవాడ అభివృద్ధి ఆశించినంతగా జరగలేదని, సంవత్సరాలు గడుస్తున్నా మూలవాగుపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడం లేదని, కేవలం గ్రాఫిక్స్‌ పైపై పూతలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రజలు అనేక రకాలైప సమస్యలతో సతమతమవుతున్నారని స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో ఉండకపోవడంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో వేములవాడ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. సంవత్సరాల కింద పూర్తి కావాల్సిన కలికోట సూరమ్మ ప్రాజెక్టును పట్టించుకున్న వారే లేరని, గోవిందారం- చందుర్తి రోడ్డు పనులకు ఇప్పటివరకు మోక్షం లభించలేదని అన్నారు. మిడ్‌ మానేరు ముంపు గ్రామాల ప్రజల సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగా మిగిలిపోయాయని, ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులుగా మారిన ప్రజలకు న్యాయంగా దక్కాల్సిన పరిహారం దక్కలేదని, ఇల్లు నిర్మాణం కోసం 5 లక్షల 4 వేల రూపాయలు ఇస్తానని మాట తప్పడంతో బాధితులు ఇప్పటికీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. 30వ తేదీన జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే వేములవాడను మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెన్నమనేని వికాస్‌ హామీ ఇచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించడంతోపాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు కల్పిస్తానని అన్నారు. భారతీయ జనతా పార్టీకి ఆదరణ రోజు రోజుకు పెరుగుతోందని, యువకులు మహిళలు రైతులు బీజేపీని ఆదరిస్తున్నారని అన్నారు.

ఆకట్టుకున్న మహిళల బైక్‌ ర్యాలీ

భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డాక్టర్‌ చెన్నమనేని వికాస్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన మంగళవారం వేములవాడలో నిర్వహించిన మహిళల బైక్‌ ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది. కాషాయ రంగు టోపీలు, బీజేపీ కండువాలు ధరించిన యువతులు, మహిళలు తిప్పాపూర్‌ బస్టాండ్‌ నుంచి సుభాష్‌ నగర్‌, అంజనీ నగర్‌, కోరుట్ల బస్టాండ్‌, బద్ది పోచమ్మ వీధి, రాజన్న దేవాలయం మెయిన్‌ రోడ్డు, గాంధీ నగర్‌ మీదుగా మహాలక్ష్మి దేవాలయం వరకు బైకులపై ర్యాలీగా వెళుతూ భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. దేశ సమగ్ర అభివృద్ధి, ఐక్యత సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని, కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి బీజేపీ అభ్యర్థి చెన్నమనేని వికాస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ర్యాలీ సందర్భంగా బీజేపీ అభ్యర్థి చెన్నమనేని వికాస్‌, చెన్నమనేని దీప, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఓపెన్‌ టాప్‌ జీప్‌ పైనుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు రేగుల సంతోష్‌ బాబు, నాయకులు రాపెల్లి శ్రీధర్‌, పిన్నింటి హన్మాండ్ల్లు, రేగుల రాజ్‌ కుమార్‌, బోనాల శివ, రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ నాయకుల ఇంటింటి ప్రచారం

చందుర్తి : చందుర్తి మండల కేంద్రంతోపాటు మల్యాల గ్రామాల్లో బీజేపీ నాయకులు మంగళవారం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకు తిరుగుతూ బీజేపీ అభ్యర్థి చెన్నమనేని వికాస్‌రావును కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రామాల్లో యువత నిరుద్యోగంతో అలమటిస్తున్నారని, రైతులు సరైన మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి న్యాయం జరగాలంటే అది బీజేపీతోనే సాధ్యమని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజక వర్గ కన్వీనర్‌ మార్త సత్తయ్య, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివా్‌స్‌, మండల అధ్యక్షుడు పోంచెట్టి రాకేష్‌, నాయకులు చిర్రం తిరుపతి, సతీష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:22:38+05:30 IST