Share News

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం

ABN , First Publish Date - 2023-11-28T00:28:38+05:30 IST

ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో ఊరుకొక్కరు వాళ్లే బాగుపడ్డారని వేములవాడ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ అన్నారు.

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం
ఎగ్లాస్‌పూర్‌లో మాట్లాడుతున్న ఆది శ్రీనివాస్‌

కోనరావుపేట, నవంబరు 27 : ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో ఊరుకొక్కరు వాళ్లే బాగుపడ్డారని వేములవాడ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ అన్నారు. కోనరావుపేట మండలంలోని ఎగ్లాస్‌పూర్‌, శివంగాలపల్లి, కోనరావుపేట, చాంద్‌నగర్‌, మల్కపేట, ధర్మారంలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమాన్ని గౌరవించి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే కేసీఆర్‌ రెండుసార్లు గెలిచి ప్రజలను మోసం చేశారన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేపర్‌ లీకేజీలకు పాల్పడుతూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. ప్రజలు బీఆర్‌ఎస్‌ మోసాలను గ్రహించారని, అందుకే కాంగ్రెస్‌ను గెలిపించబోతున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రూ.500కే వంటగ్యాస్‌, రైతులకు, కౌలు రైతులకు పంట పెట్టుబడి సాయం ఏటా రూ.15000, మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు నెలకు రూ.2500, ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంట్‌, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వైద్య సహాయం, యువ వికాసం ద్వారా విద్యార్థులకు రూ.5 లక్షల గ్యారెంటీ కార్డులు, రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఇందిరమ్మ పథకం ద్వారా రూ.5 లక్షల సాయం అందిస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు. ఇద్దరు కొత్త దొరలు వచ్చి అభివృద్ధి చేస్తామని తిరుగుతున్నారని, వారు ఎన్నడూ మనకు కనిపించలేదని అన్నారు. వారు గెలిస్తే హైదరాబాద్‌, కరీంనగర్‌కు వెళ్లిపోతారని, వారిని కలవాలంటే కారు కిరాయి తీసుకొని మరో నలుగురిని తోలుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఎర్పడుతుందని అన్నారు. వారిని కలవడానికి వేలు ఖర్చు పెట్టుకోవాలన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ కుటుంబానికే పరిమితమైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట లక్షల కోట్లు దండుకున్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో ప్రవేశపెట్టిన పథకాలే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. కొత్తగా పథకాలు ప్రవేశ పెట్టలేదన్నారు. రేషన్‌ షాపులో బియ్యంతోపాటు పప్పు, ఉప్పు, సబ్బులు వంటి పది రకాల వస్తువులను కాంగ్రెస్‌ ప్రభుత్వం అందించినట్లు చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పది రకాల వస్తువులను తొలగించిందన్నారు. గ్రామాల్లో ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష రూపాయలు పర్మిషన్‌కు కట్టి ఇల్లు కట్టుకునే పరిస్థితికి తెచ్చారన్నారు. మిషన్‌ భగీరథ పేరిట లక్షల కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. ఇప్పటికీ పలు గ్రామాలకు మిషన్‌ భగీరథ నీళ్లు రావడం లేదన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ప్రవేశపెట్టిన అభయహస్తం పింఛన్‌ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొలగించిందని, ఆ డబ్బులు కూడా లబ్ధిదారు మహిళలకు అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించి చెయ్యి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం పలువురు యువకులు కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ జిల్లా నాయకులు కేతిరెడ్డి జగన్మోహన్‌ రెడ్డి, కేతిరెడ్డి లక్ష్మారెడ్డి, చందనగిరి గోపాల్‌, చేపూరి గంగాధర్‌, కచ్చకాయల ఎల్లయ్య, తాళ్లపల్లి ప్రభాకర్‌, గొట్టె రుక్మిణి, మండల అధ్యక్షుడు ఫిరోజ్‌ పాషా, బాల్‌రెడ్డి, గంగయ్య, లింబయ్య, భూమేష్‌, నందు గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

వేములవాడ టౌన్‌ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌పై ప్రజలు కోపంతో ఉన్నారని, కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు చూస్తు న్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ మండలం మారుపాకలో సోమవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రవేశెపెట్టిన ఆరు గ్యారంటీలకు ప్రజలు ఆకర్షితులయ్యారన్నారు. దక్షిణకాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయంలో వసతులు సరిగా లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, వసతులు కల్పించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ముడికే చంద్రశేఖర్‌, పిల్లి కనుకయ్య తదితరులు ఉన్నారు.

చందుర్తి : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఆ పార్టీ వేములవాడ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ అన్నారు. చందుర్తి మండలం ఎన్గల్‌లో సోమవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార బీఆర్‌ఎస్‌ నాయకులు ఓటమి భయంతో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. జడ్పీటీసీ నాగం కుమార్‌, పార్టీ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి, నాయకులు ఎనగంటి శంకర్‌, గసికంటి ప్రభాకర్‌, లింగంపల్లి హన్మంతు, సత్తయ్య, ముస్కు పద్మ, ధర్మపురి శ్రీనివాస్‌, భీమరాజు కనకరాజు, పొద్దుపొడుపు లింగారెడ్డి పాల్గొన్నారు.

కథలాపూర్‌ : వేములవాడ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ గెలుపు కోసం సోమవారం ఆయన భార్య చందుర్తి మాజీ జడ్పీటీసీ ఆది వనజ మండల కేంద్రంలో ఇంటింటీ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీలను వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పంబాల నారాయణ, రిక్కల తిరుపతిరెడ్డి, సత్యనారాయణ, నారాయణరెడ్డి, న్యావనంది శేఖర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-11-28T00:28:39+05:30 IST