Share News

ముదిరాజ్‌ల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2023-11-28T00:30:02+05:30 IST

ముదిరాజ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని వేములవాడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి లక్ష్మీనరసింహారావు అన్నారు.

ముదిరాజ్‌ల సమస్యల పరిష్కారానికి కృషి
ముదిరాజ్‌లతో సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మీనరసింహారావు

వేములవాడ, నవంబరు 27 : ముదిరాజ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని వేములవాడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి లక్ష్మీనరసింహారావు అన్నారు. వేములవాడ పట్టణంలోని లాలపల్లి రోడ్డు, బద్దిపోచమ్మ ముదిరాజ్‌ సంఘం సభ్యులను చల్మెడ లక్ష్మీనరసింహారావు సోమవారం పెద్దమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలిశారు. ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడుతూ తాను గెలిచిన వెంటనే ముదిరాజ్‌ల న్యాయమైన డిమాండ్‌లను నెరవేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ముదిరాజ్‌లు చల్మెడను సన్మానించారు. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు నామాల లక్ష్మీరాజం, గజానందరావు, సంఘం అధ్యక్షుడు లక్ష్మీరాజం, ఉపాధ్యక్షుడు పండుగ రాజు, గౌరవ అధ్యక్షుడు రాములు, కార్యవర్గ సభ్యులు కర్ల శేఖర్‌, జలపతి, దేవయ్య, రాజయ్య, కనకయ్య, శ్రీకాంత్‌, దుర్గ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ నేత

వేములవాడ పట్టణ బీజేపీ మైనార్టీ సెల్‌ మాజీ అధ్యక్షుడు మహమ్మద్‌ బాబా సోమవారం వేములవాడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా బాబా మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన, చేపట్టబోయే అభివృద్ధి పనులకు ఆకర్షితుడినైనట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే ముస్లిం మైనారిటీలకు న్యాయం జరుగుతుందని, సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకంతో పార్టీలో చేరానని పేర్కొన్నారు. ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చల్మెడ గెలుపు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీపీ బండ మల్లేశం యాదవ్‌, నాయకులు అక్రమ్‌, షకీల్‌ జానీ, షాహిద్‌ పాషా, మధు, సంధాని పాల్గొన్నారు.

కోనరావుపేట: బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావును గెలిపించాలని లక్ష్మీనరసింహారావు స్వగ్రామంలో ఆయన సతీమణి సునీల సోమవారం ఇంటింటి ప్రచారాన్ని కొనసాగించారు. మండల అభివృద్ధి జరగాలంటే బీఆర్‌ఎస్‌ పార్టీ గెలవాలన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి లక్ష్మీనరసింహారావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. వైస్‌ ఎంపీపీ వంగపల్లి సుమలత, మల్కపేట సర్పంచ్‌ ఆరె లత, మహేందర్‌ పాల్గొన్నారు.

వేములవాడ టౌన్‌ : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహరావును భారీ మెజార్టీతో గెలిపించాలని సంకెపల్లి సర్పంచ్‌ జింక సునితవేణు అన్నారు. వేములవాడ మండలం సంకెపల్లిలో జడ్పీటీసీ మ్యాకల రవి నేతృత్వంలో చల్మెడకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కేవలం బీఆర్‌ఎస్‌ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ పెరుగు పర్శరాములు, పెరుగు ఎల్లయ్య, మారవేని మహేష్‌, రాయబోసు, బాలయ్య తదితరులు ఉన్నారు.

కోనరావుపేట : చల్మెడ లక్ష్మీనరసింహారావుకు గెలుపు కోసం కృషి చేస్తామని మాజీ నక్సల్స్‌ ప్రకటించారు. సోమవారం జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ రాఘవరెడ్డి సహకారంతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీనరసింహారావుకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. మాజీ నక్సల్స్‌ నేరెళ్ల జ్యోతి, నాగిరెడ్డి, శ్రీనివాస్‌, గుండాల లక్ష్మణ్‌, రమేష్‌, శంకరమ్మ, లక్ష్మీ, మల్లేశం, రమేష్‌ తదితరులు ఉన్నారు.

కథలాపూర్‌ : వేములవాడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఎన్నికల్లో గెలవాలని మండలంలోని సిరికొండ బీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసం పురస్కరించుకుని బీఆర్‌ఎస్‌ నాయకులు చల్మెడ కోసం పూజలు చేశారు. లక్ష్మీనరసింహారావును భారీ మెజార్టీతో గెలిపించాలని స్వామివారిని వేడుకున్నామన్నారు. ఈ సందర్భంగా సింగిల్‌ విండో చైర్మన్‌ చుక్క దేవరాజం, వైస్‌ చైర్మన్‌ బత్తుల నరేశ్‌, మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి, ద్యాగరి నర్సింలు, మహేశ్‌, ముదాం రవి, గట్ల మహేశ్‌, సాగర్‌, భాస్కర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-11-28T00:30:04+05:30 IST