Share News

సిల్వర్‌ సిటీగా కరీంనగర్‌

ABN , First Publish Date - 2023-11-28T02:13:04+05:30 IST

కరీంనగర్‌ జిల్లాకు ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉందని, కరీంనగర్‌ను సిల్వర్‌ సిటీగా మార్చుతామని దేశ ప్రధాని నరేంద్ర మోద అన్నారు.

సిల్వర్‌ సిటీగా కరీంనగర్‌
ప్రధాని మోదీకి పిలిగ్రీ కళాకండాన్ని అందిస్తున్న బండి సంజయ్‌

- తెలంగాణలో బీజేపీ సర్కారు వస్తుంది

- కాళేశ్వరం అవినీతిని కక్కిస్తాం

- సకల జనుల విజయ సంకల్ప సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

కరీంనగర్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్‌ జిల్లాకు ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉందని, కరీంనగర్‌ను సిల్వర్‌ సిటీగా మార్చుతామని దేశ ప్రధాని నరేంద్ర మోద అన్నారు. సోమవారం కరీంనగర్‌లోని ఎస్సారార్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగించారు. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికి శుభాభివందనలు అంటు తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ వేములవాడ రాజన్న, శాతవాహన, కాకతీయలు, మౌర్యుల కర్మభూమి కరీంనగర్‌ గడ్డకు నమస్కారాలు అంటూ కరీంనగర్‌ చరిత్రను గుర్తు చేశారు. సిల్వర్‌ ఫిలిగ్రీ కళకు కరీంనగర్‌ ప్రసిద్ధి చెందిందని మన్‌కీ బాత్‌లో కూడా ప్రస్తావించానన్నారు. స్వర్ణకారులు, కళాకారుల కోసం పీఎం విశ్వకర్మ యోజన ప్రవేశపెట్టామన్నారు. దీని ద్వారా పిలిగ్రీ కళాకారులకు శిక్షణ అందించి లక్షల రూపాయల రుణ అందించడానికి వీలు కలుగుతుందన్నారు. కరీంనగర్‌ను సిల్వర్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు బీజేపీ కృషి చేస్తుందన్నారు.

ఫ సంజయ్‌ సూపర్‌ ఫాస్ట్‌..

సంజయ్‌ సూపర్‌ ఫాస్ట్‌ మీరు ఆయన ఫాస్ట్‌ను అందుకోవాలన్నారు. సభకు వచ్చిన జనాన్ని చూస్తుంటే తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు నాకు కనిపిస్తుందన్నారు. దేశ అభివృద్ధికి బీజేపీ మొదటి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఎవరైనా దేశం కోసం, అభివృద్ధి కోసం, దేశ ఆత్మగౌరవం కోసం ఓటు వేశామంటే అది బీజేపీకే వేశామని అర్థమవుతుందన్నారు. తెలంగాణలో పరివర్తన కనిపిస్తుందని, ఇక్కడ మార్పు నిశ్చయమన్నారు. కాంగ్రెస్‌ను అడ్డుకుని, బీఆర్‌ఎస్‌ పరిగెత్తిస్తామన్నారు. కాంగ్రెస్‌, కేసీఆర్‌ ప్రజలను మోసం చేసేందుకు ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టవన్నారు. అవినీతి, కుటుంబ రాజకీయాలు అంటే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు గుర్తుకు వస్తాయన్నారు. కాంగ్రెస్‌ సభ్యులకు గ్యారెంటీ లేదని, కాంగ్రెస్‌కు ఓటు వేశామంటే కేసీఆర్‌ను గద్దెనెక్కించేందుకే అన్నారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని వారిని నమ్మి మోస పోవద్దన్నారు. తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, తొలి సీఎం బీసీ వర్గం నుంచే ఉంటారన్నారు. వచ్చే ఐదు సంవత్సరాలు తెలంగాణ ప్రగతి కోసం బీజేపీని ఆదరించాలన్నారు. కుటుంబ పాలనతో ప్రతిభకు ఎంతటి అన్యాయం జరుగుతుందో ఈ గడ్డను చూస్తే అర్థమవుతుందన్నారు. తెలంగాణ కళల స్వప్నాన్ని బీజేపీ సాధిస్తుందన్నారు. వచ్చే ఐదేళ్లలో బీజేపీ పాలనలో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి సాధిస్తామన్నారు. ఈ గడ్డపై పుట్టిన పీవీ నర్సింహారావును కాంగ్రెస్‌ తీవ్రంగా అవమానించిందన్నారు.

ఫ స్మార్ట్‌ సిటీ కోసం నిధులు ఇచ్చాం..

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం, కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీకోసం నిధులు ఇచ్చిందన్నారు. కేసీర్‌ కరీంనగర్‌ను లండన్‌ చేస్తానని తప్పుడు వాగ్దానం చేశాడన్నారు. బీజేపీతోనే కరీంనగర్‌ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కేసీఆర్‌ సాగునీటి పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి గురించి తెలంగాణాలోనే కాదు దేశం యావత్తు తెలుసన్నారు. చిన్న సన్నకారు రైతుల ఉసురు పోసుకున్న, ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడ్డ కేసీఆర్‌కు సర్కారుకు శిక్ష పడేలా ఓటు వేయాలన్నారు. రైతులకు పీఎం కిసాన్‌ సన్మాన్‌ నిధి కింద సాయం చేశామని తెలిపారు. కేసీఆర్‌కు మూఢ నమ్మకాలు ఎక్కువని, మోదీని ఎదుర్కొంటే మీ సంపద మొత్తం పోతుందని ఎవరో చెప్పారని, అందుకే తనకు ఎదురు పడడం లేదన్నారు. కేసీఆర్‌ పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇవ్వలేదని, కేంద్ర ప్రభుత్వం లక్షల ఇళ్లు మంజూరు చేసే వాటిని ఈ ప్రభుత్వం పేదలకు అందకుండా చేసిందన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రతి పేద వ్యక్తి శిక్షించాలన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్రోల్‌ డీజీల్‌ ధరలు తక్కువగా ఉంటాయని, ఇక్కడ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెట్రోల్‌ డీజీల్‌ రూపంలో ప్రజల నుంచి డబ్బులు లూటీ చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిరోజే పెట్రోల్‌ బంకులో దాని ఫలితం కనిపిస్తుందన్నారు. మోదీ గ్యారెంటీ అంటే కచ్చితంగా అమలు అవుతుందని అన్నారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమన్నారు. తెలంగాణాలో బీఆర్‌ఎస్‌ నావ మునిగి పోతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక లిక్కర్‌ స్కాం దర్యాప్తు వేగవంతం చేస్తామని, వాళ్లు దోచుకున్న సొమ్మునంతా కక్కిస్తామన్నారు. పొరపాటున కాంగ్రెస్‌ వస్తే తెలంగాణ వారికి ఏటీఎంలా మారుతుందన్నారు. కాంగ్రెస్‌ వస్తే ప్రతి సంక్షేమ పథకంలో దోపిడీ జరుగుతుందన్నారు. ఒక రోగాన్ని తగ్గించేందుకు బీఆర్‌ఎస్‌ను కాదని కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మరోక కొత్త రోగాన్ని తెచ్చుకోవడమే అన్నారు. బీజేపీపై భరోసా ఉంచి మోదీపై భరోసా ఉంచండని కోరారు. తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉందని, మౌలిక వసతులు, ఉగ్యోగాలు, ఉపాధి కల్పిస్తామన్నారు. రైతుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. బీసీని సీఎం చేస్తామని, మాదిగలకు న్యాయం చేస్తుందన్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ మోదీ ప్రభుత్వమే వస్తుందని, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు. బీజేపీ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ తెలంగాణను ప్రగతిపథంపై వేగంగా దూసుకెళ్లాలా చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో అభ్యర్థులు బండి సంజయ్‌కుమార్‌, బొడిగె శోభ, వికాస్‌రావు, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, బొడిగె శోభ, రాణిరుద్రమ, ఆరెపల్లి మోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-28T02:13:09+05:30 IST