Share News

వేములవాడను వెన్నెల వాడగా తీర్చిదిద్దుతా

ABN , First Publish Date - 2023-11-28T00:27:16+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ పట్టణాన్ని వెన్నెల వాడగా తీర్చిదిద్దుతానని భారతీయ జనతా పార్టీ వేములవాడ నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్‌ చెన్నమనేని వికాస్‌ అన్నారు.

వేములవాడను వెన్నెల వాడగా తీర్చిదిద్దుతా
ఓటు అభ్యర్థిస్తున్న బీజేపీ అభ్యర్థి చెన్నమనేని వికాస్‌

వేములవాడ, నవంబరు 27 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ పట్టణాన్ని వెన్నెల వాడగా తీర్చిదిద్దుతానని భారతీయ జనతా పార్టీ వేములవాడ నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్‌ చెన్నమనేని వికాస్‌ అన్నారు. సోమవారం వేములవాడ పట్టణంలోని పలు వార్డులలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, స్థానిక నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం చేసిన ఆయన వేములవాడ పట్టణంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తనను గెలిపిస్తే వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ ఏమాత్రమూ అభివృద్ధికి నోచుకోలేదని వికాస్‌ అన్నారు. వేములవాడ ఆలయానికి ఏటా 100 కోట్ల రూపాయల చొప్పున వెచ్చించి అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదని, వేములవాడలో కనీస వసతులు లేకపోవడంతో యాత్రికులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజల్లో వ్యక్తం అవుతున్న తీవ్ర వ్యతిరేకతను గమనించి వేములవాడను దత్తత తీసుకుంటానంటూ మంత్రి కేటీఆర్‌ చెబుతున్నారని, ఆది దేవుడు కొలువైన వేములవాడను దత్తత తీసుకోవడానికి మీరు ఎవరని ప్రశ్నించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంతోపాటు పట్టణ అభివృద్ధి బాధ్యత తనదని, తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే వేములవాడను మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని వికాస్‌ హామీ ఇచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించడంతోపాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు కల్పించడం భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేయనున్నట్లు బీజేపీ ప్రకటించిందని, బీసీలపై, సామాజిక న్యాయంపై బీజేపీకి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అన్నారు. వేములవాడ పట్టణంతోపాటు నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మండలాల్లో భారతీయ జనతా పార్టీకి ఆదరణ రోజు రోజుకు పెరుగుతోందని, యువకులు, మహిళలు, రైతులు బీజేపీని ఆదరిస్తున్నారని అన్నారు. తాము ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతీ చోట ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఈ నెల 30వ తేదీన జరగనున్న ఎన్నికలలో కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్‌, పట్టణ అధ్యక్షుడు రేగుల సంతోష్‌ బాబు, నాయకులు బిల్ల కృష్ణహరి, రాపెల్లి శ్రీధర్‌, పిన్నింటి హనుమాన్లు, రేగుల రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-28T00:27:18+05:30 IST