Share News

ఉన్నత జీవనానికి అనువైన ప్రాంతంగా తీర్చిదిద్దుతా

ABN , First Publish Date - 2023-11-27T23:00:23+05:30 IST

‘మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఉన్నతమైన జీవన ప్రమాణాలు గల ప్రాంతంగా ఎదిగేలా కృషి చేస్తా. మెరుగైన జీవనానికి అవసరమైన మౌలిక వసతులు, వనరుల కల్పనకు చర్యలు తీసుకుంటాం.

ఉన్నత జీవనానికి అనువైన ప్రాంతంగా తీర్చిదిద్దుతా

ఉద్యోగ, ఉపాధి కల్పన వనరుల కేంద్రంగా మారుస్తా

విద్య, వైద్యరంగాలకు హబ్‌గా ఏర్పాటు చేస్తా

‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో మహబూబ్‌నగర్‌ అభ్యర్థి వి.శ్రీనివా్‌సగౌడ్‌

మూడోసారి గెలుపుపై మంత్రి ధీమా

మహబూబ్‌నగర్‌, నవంబరు 27(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఉన్నతమైన జీవన ప్రమాణాలు గల ప్రాంతంగా ఎదిగేలా కృషి చేస్తా. మెరుగైన జీవనానికి అవసరమైన మౌలిక వసతులు, వనరుల కల్పనకు చర్యలు తీసుకుంటాం. యువతీ, యువకులకు అవసరమైన ఉద్యోగ, ఉపాధి వనరుల ఏర్పాటుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తా.’ అని మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌ హామీ ఇచ్చారు. సోమవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’కిచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించారు.

మూడోసారి బరిలో ఉన్న మీరు ఇస్తోన్న ప్రధాన హామీ?

ఎమ్మెల్యేగా తొమ్మిదేళ్లలో ఎంతో చేశాం. ఇంకా ఈ ప్రాంతాన్ని ఉద్యోగ, ఉపాధి కల్పన వనరుల కేంద్రంగా తీర్చిదిద్దుతా. సీఎం కేసీఆర్‌ని ఒప్పించి మరీ ఇక్కడ ఐటీ టవర్‌ ఏర్పాటు చేయించా. ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో ప్రతిష్టాత్మకమైన అమరరాజా బ్యాటరీ కంపెనీ ఏర్పాటు చేయిస్తున్నాం. దీంతో స్థానికులకు పది వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. ఉన్నత స్థాయిలో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయిస్తా.

మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలకు ప్రణాళిక ఉందా?

మహబూబ్‌నగర్‌లో 2014కు ముందు నామ్‌కేవాస్తేగా జిల్లా ఆస్పత్రి ఉండేది. ప్రజలు ఏ అనారోగ్య సమస్య వచ్చినా హైదరాబాద్‌కు వెళ్లి, లక్షల రూపాయలు ఖర్చు చేసేవారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మహబూబ్‌నగర్‌లో మొదటి మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేశాం. దానికి అనుబంధంగా జనరల్‌ ఆస్పత్రిని 150 పడకల నుంచి 750 పడకల ఆస్పత్రికి అప్‌గ్రేడ్‌ చేశాం. మరో 1000 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంలో ఉంది. ఇది పూర్తయితే హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి దీటుగా పేదలకు ఉచితంగా, నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తుంది. సీఎంఆర్‌ ఎఫ్‌ ద్వారా రూ.30 కోట్ల నిధులు అందజేశాం. సీఎం కేసీఆరే ఈఅంశాన్ని ప్రకటించడం మా సేవలకు గుర్తింపుగా భావిస్తున్నాం.

నగర స్థాయికి ఎదిగిన ఈ పట్టణ ప్రజలకు మీ భరోసా?

నియోజకవర్గంలో దాదాపు 70 శాతం పట్టణమే ఉంది. ఈ నగరం పదేళ్లకు ముందు ఎలా ఉంది?.. ఇప్పుడెలా ఉందో? అందరూ ఆలోచించాలి. కాంగ్రెస్‌ పాలనలో 14 రోజులకు ఒక సారి కూడా తాగునీరు రాని స్థితి నుంచి.. నేడు ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేసి రోజూ కృష్ణా జలాలు అందిస్తున్నాం. మతాలు, కులాల పేరుతో ఘర్షణలు, అనుమానపు చూపులతో బిక్కుబిక్కుమనే జీవనముండేది. ఆ పరిస్థితిని మా ర్చేశాం. హైదరాబాద్‌ తర్వాత మహబూబ్‌నగరే మోస్ట్‌ లివబుల్‌ సిటీగా ఉన్న గుర్తింపును కొనసాగించేందుకు అవసరమైన ఉన్నతస్థాయి మౌలిక వసతులు రోడ్లు, మోడరన్‌ రైతు బజార్లు, మటన్‌ మార్కెట్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా, పార్కుల సుందరీకరణ, ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటుకు మరింత పట్టుదలతో కృషి చేస్తా.

మీరు ప్రత్యేకంగా చేసిన పనులేంటి?

ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి రోజు నుంచే ఈ నగరంపై ప్రత్యేక దృష్టితో పనులు చేపట్టా. జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్‌కు ఉన్న జాతీయ రహదారి విస్తరణ పనులు పూర్తి చేయించడంతో పాటు, అప్పన్నపల్లి వద్ద రెండో బ్రిడ్జిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశాం. పట్టణంలో దశాబ్దాల కోరికగా ఉన్న బైపాస్‌ రోడ్డును నిర్మించాం. పెద్ద చెరువును సుందరీకరించి, అక్కడ ఒక ఐలాండ్‌, కేబుల్‌ బ్రిడ్జి, నెక్లెస్‌ రోడ్డు ఏర్పాటు చేయించాం. అక్కడే శిల్పారామం కూడా ఏర్పాటు చేశాం. దేశంలోనే ఎక్కడా లేని రీతిలో ఇక్కడున్న మ యూరి పార్కును కేసీఆర్‌ అర్బన్‌ ఎకోపార్కుగా మార్చాం. ప్రసిద్ధిగాంచిన పిల్లలమర్రి వృక్షాన్ని పునరుజ్జీవింపజేశాం. మన్యంకొండ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద అభివృద్ధి పనులు చేపట్టాం.

సాగునీటి కల్పన జరగలేదనే అంశంపై మీస్పందన?

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటిదశ పూర్తయ్యింది. ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి నియోజకవర్గంలోని రెండు మండలాలకు కాల్వల నిర్మాణాలు జరిపి, ఆరేడు నెలల్లో సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలపై మీరేమంటారు?

తొమ్మిదేళ్లుగా జనాన్ని వదిలేసిన ప్రతిపక్షాలకు మమ్మల్ని విమర్శించే అర్హతే లేదు. ప్రజల ప్రశ్నలకు వారు సమాధానం చెప్పలేక వ్యక్తిగత ఆరోపణలు, నిందలకు దిగుతున్నారు. కులాల పేరుతో, మతాల పేరుతో సమాజాన్ని చీల్చి, లబ్ధిపొందాలనే కుట్రను ప్రతిపక్షాలు ఇక్కడ అమలు చేస్తున్నాయి. ప్రతిపక్షాలకు చెంపపెట్టులాంటి విజయంతో మూడోసారి గెలిపిస్తారనే విశ్వాసం నాకుంది.

Updated Date - 2023-11-27T23:00:41+05:30 IST